తెలంగాణ

telangana

అప్రకటిత కరెంట్‌ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

By

Published : Feb 14, 2023, 6:56 AM IST

Updated : Feb 14, 2023, 7:59 AM IST

Power cuts in Telangana: కరెంట్‌ కోతలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళాపాళా లేని విద్యుత్‌ సరఫరాతో రైతులు పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు వారబందీ పేరుతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. బోర్ల ద్వారా నైనా పంటను కాపాడుకుందాం అంటే రైతులకు కరెంటు కష్టాలతో అది సాధ్యపడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Power cuts
Power cuts

రైతులను వేధిస్తున్న కరెంట్‌ కోతల కష్టాలు

Power cuts in Telangana: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అప్రకటిత కోతలతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా రెండు నెలల నుంచి కరెంట్‌ సరఫరా సరిగా లేక పొలాల వద్ద కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు:వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ సరైన సమయంలో కరెంటు సరఫరా చేయడం లేదు. ఉదయం ఆరు గంటలు నిరంతరాయంగా ఇస్తే పంటలు పండుతాయని... లేకుంటే ఎండిపోయి నష్టాలు మిగులుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట కరెంట్‌ ఇస్తే పాములు, తేళ్లు కుట్టి ప్రాణాపాయం కలుగుతుందని చెబుతున్నారు.

'ట్రాన్స్​ఫార్మర్​ల వద్ద పొద్దంతా కూర్చుంటున్నాం. ఎప్పుడో వస్తుందో తెలియట్లేదు. వచ్చినా అర్ధగంట, గంట మాత్రమే ఇస్తున్నారు. ఎవరిని అడిగినా మాకు సమాధానం చెప్పట్లేదు. నీరు లేక పంటలు వచ్చే పరిస్థితి లేదు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఎకరానికి ఒకరోజులో నీరు పెట్టేవాళ్లం.. ఇప్పుడు నాలుగు రోజులు పడుతోంది. 24 గంటల కరెంట్ అన్నారు.. ఇప్పుడు వస్తుంది పోతుంది. రెండు నెలల నుంచి కరెంట్ కోతలు ఎక్కువ అయ్యాయి. రాత్రి ఇవ్వకుండా పగలు ఇవ్వాలి.'-ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ చివరి చివరి ఆయకట్టు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వారబంది పేరుతో 9 రోజులే నీటిని విడుదల చేసి.. వారంపాటు నిలిపివేస్తుండటంతో నీళ్లు అందగా పైర్లు ఎండిపోతున్నాయి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, దామరచర్ల, వేములపల్లి మండలాల్లోని రైతులు పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కళ్లముందే పంట ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు.

'వానాకాలం కూడా ఇదే పరిస్థితి. కాలువకు గండి పడి 25 రోజులు నీరు రాక పంట నష్టం వచ్చింది. ఇప్పుడైనా మంచిగా పండించుకుని అప్పులు తీర్చుకుందామంటే వారబంది నీటి విడుదలతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుతడి పంటలు అంటే మేము పెట్టకపోయేవాళ్లం. కాలువకు గండి పడి వానాకాలమే చాలా నష్టపోయాం. బోరుబావులు ఉన్నవారి పరిస్థితి మాలాగే తయారయింది. కరెంట్ లేక వాళ్ల పొలాలు ఎండిపోతున్నాయి. నీరు వస్తుందని కౌలుకు చేసిన పొలం ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచకుండా అయింది.'- నల్గొండ జిల్లా రైతులు

ఓ వైపు కరెంట్‌ కోతలు... మరోవైపు సాగు నీటి కష్టాలు : యాసంగి సీజన్ మొదట్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెప్పకపోవడంతో వరి వేశామని... తీరా పంట చేతికందే సమయంలో వారబంది నీటి విడుదలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. పొట్ట దశలో ఉన్న పైరుకు నీరు అందకపోతే తీవ్ర నష్టం తప్పదని అల్లాడిపోతున్నారు. ఓ వైపు కరెంట్‌ కోతలు... మరోవైపు చివరి ఆయకట్టుకు నీరు రాక రైతులు పంట కాపాడుకునేందుకు అల్లాడుతున్నారు. ఉదయం పూట నిర్దిష్టమైన సమయంలో కరెంట్ ఇస్తే చాలాని రైతులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details