తెలంగాణ

telangana

తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చే ప్రయత్నం - విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయండి : కేసీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 4:01 PM IST

Updated : Nov 9, 2023, 5:02 PM IST

CM KCR Speech at Kamareddy Praja Ashirwada Sabha : కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని కొందరు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ప్రజలు తమాషాగా ఓటు వేస్తే మన తలరాతలు మారుతాయని హెచ్చరించారు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఈ మేరకు మాట్లాడారు.

brs public meeting in kamareddy
CM KCR Speech at Kamareddy Praja Ashirwada Sabha

CM KCR Speech at Kamareddy Praja Ashirwada Sabha : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాలను సీఎం గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి గడ్డతో తనకు పుట్టినప్పటి నుంచి సంబంధం ఉందన్న కేసీఆర్‌.. కోనాపూర్‌గా పిలుస్తున్న పోసానిపల్లిలో తమ తల్లి పుట్టారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి లాయర్లు చైతన్యం చూపారన్న ఆయన.. జల సాధన ఉద్యమం 45 రోజులు చేశామని గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో బిగ్రేడియర్లను నియమించామని.. కామారెడ్డి బిగ్రేడియర్‌గా తానే ఉన్నానని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ - భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

BRS Public Meeting in Kamareddy: ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కామారెడ్డిని జిల్లా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీ తెచ్చుకున్నామని.. కాళేశ్వరం పనులు ఆగమేఘాలపై జరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రెండేళ్లలో రెండు ప్రాంతాల్లో నీళ్లు పారుతాయని వెల్లడించారు. త్వరలోనే విద్యా సంస్థలు, అనేక పరిశ్రమలు తీసుకువస్తామని.. ప్రజలు ఊహించని అనేక అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కామారెడ్డి రూపురేఖలు మారుతాయని.. అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపుతానని స్పష్టం చేశారు.

హ్యాట్రిక్‌ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు - అభివృద్ధిని గుర్తించి దీవించాలని వేడుకుంటున్న అభ్యర్థులు

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తమాషాగా ఓటు వేస్తే మన తలరాతలు మారుతాయని హెచ్చరించారు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సూచించారు. పార్టీలు, అభ్యర్థులను చూసి ఓటు వేయాలని కోరారు. పార్టీల వైఖరిపై గ్రామాల్లో చర్చ జరగాలని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేశారని కేసీఆర్‌ విమర్శించారు. మూడు గంటల విద్యుత్‌ చాలని కాంగ్రెస్‌ చెబుతోందని.. మోదీ స్వరాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్‌ రావట్లేదని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన తెచ్చిందని.. రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లను కేంద్రం కోతపెట్టిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 180 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే.. రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క కళాశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలని ప్రశ్నించారు.

'సింగరేణిని ముంచింది కాంగ్రెస్​ - లాభాల బాట పట్టించింది బీఆర్​ఎస్'​

తెలంగాణ ఏర్పడ్డాక ధరణి పోర్టల్‌ తీసుకువచ్చామని కేసీఆర్‌ తెలిపారు. రైతు బొటన వేలు పెడితేనే భూ మార్పిడి జరుగుతుందని వివరించారు. భూ మార్పిడి చేసే హక్కు సీఎంకు కూడా లేదన్నారు. రైతు బంధు నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని.. ధరణి తొలగిస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారినే బంగాళాఖాతంలో కలపాలని గులాబీ దళపతి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్న ఆయన.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో తనపై పోటీ చేస్తున్నారని రేవంత్​రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి ప్రజలే కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన వ్యక్తి రూ.50 లక్షలతో పట్టుబడ్డారు. ఆ వ్యక్తినే కాంగ్రెస్‌ నాపై పోటీకి దింపింది. కేసీఆర్‌తో పాటు కామారెడ్డికి పరిశ్రమలు, ఐటీ రంగం వస్తుంది. కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తునకలా చేసి చూపిస్తా. జాతీయ రహదారి, రైల్వే లైన్‌ ఉన్న కామారెడ్డిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా. - కేసీఆర్, ముఖ్యమంత్రి

తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చే ప్రయత్నం విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయండి కేసీఆర్

ఆర్మూర్‌లో ప్రచార రథం పైనుంచి ముందుకు పడిన కేటీఆర్‌ - స్వల్ప గాయాలు

Last Updated :Nov 9, 2023, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details