తెలంగాణ

telangana

Rains in TS: మరోసారి వరుణుడి ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

By

Published : Aug 5, 2022, 5:23 AM IST

Updated : Aug 5, 2022, 5:58 AM IST

Rains in TS
Rains in TS

Rains in TS: రాష్ట్రానికి మరోసారి వరుణుడి ముప్పు పొంచి ఉంది. నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Rains in TS: రాష్ట్రానికి మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శనివారం అతి భారీ వర్షాలు ఉంటాయని సూచించింది. ఉరుములు, మెరుపులతోపాటు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 9 మధ్య అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. 7న 12 సెం.మీ. నుంచి 20 సెం.మీ. మేర భారీ వర్షాలు కురుస్తాయని, 8, 9 తేదీల్లో 20 సెం.మీ. పైన అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వివరించారు. ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు (ఎన్డీఆర్‌ఎఫ్‌) సమాచారం ఇచ్చామని తెలిపారు.

ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి వరకు..

బుధవారం ఏర్పడిన ఆవర్తనం గురువారం నాటికి ఏపీ కోస్తా తీరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. 7వ తేదీ లేక ఆ తరువాత వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. వాటి పరిసర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

*గురువారం అనేక జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. గరిష్ఠంగా కరీంనగర్‌ జిల్లా గంగాధరలో 15.5 సెం.మీ., మంచిర్యాల జిల్లా తాండూరులో 13.2, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 11.6 సెం.మీ. వర్షం కురిసింది.

ఇవీ చదవండి:BANDI SANJAY: కాళేశ్వరం పేరుతో సీఎం ఫామ్​హౌస్​కు పైపులైన్: బండి సంజయ్

నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది

Last Updated :Aug 5, 2022, 5:58 AM IST

ABOUT THE AUTHOR

...view details