Two People Died Due to Current Shock in Medak District : రాష్ట్రంలో కరెంట్ వైర్లు యమ పాశాలుగా మారుతున్నాయి. నియంత్రికలు ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలోగ్రామానికి చెందిన మణెమ్మ అనే మహిళ ఇంటి వద్ద తీగపై బట్టలు ఆరేస్తున్న క్రమంలో తీగకు విద్యుత్ సరఫరా అయింది.
Electric Shock Death Cases in Telangana : దీంతో మణెమ్మ ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో కుప్పకూలిపోయింది. ఇది గమనించిన వరుసకు కుమారుడైన భాను ప్రసాద్ అనే యువకుడు ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతనూ ప్రమాదానికి గురయ్యాడు. వీరిద్దరిని చూసిన మణెమ్మ కుమార్తె శ్రీలత వారిని రక్షించే ప్రయత్నం చేయగా, ఆమెకూ కరెంట్ షాక్ కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో శ్రీలత గాయాలతో బయటపడింది.
మరోవైపు అప్పటికే మణెమ్మ, భాను ప్రసాద్ మృతి చెందారు. మెరుగైన వైద్యం కోసం శ్రీలతను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కరెంట్ షాక్‌తో దంపతుల దుర్మరణం : ఇటీవల వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్ గ్రామానికి చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద దుస్తులు ఆరేసేందుకు వైరు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బట్టలు ఆరేసేందుకు వెళ్లిన లక్ష్మికి పక్కన ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ప్రమాదానికి గురైంది.
లక్ష్మి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న భర్త లక్ష్మణ్ వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనూ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేసే నియంత్రికలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీవాసులు ఆరోపించారు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నన్ను మన్నించు కన్నా - కళ్లల్లో నీ రూపం నింపుకొని లోకం వీడుతున్నా - Woman dies due to electric shock
దుస్తులు ఆరేస్తుండగా భార్యకు కరెంట్ షాక్ - కాపాడబోయి దంపతుల మృతి