Grain Procurement Slow Down in Telangana : అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అన్నిచోట్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వడివడిగా కూడా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో రహదారులపై ధాన్యం కుప్పలుగా పోసి కాపాలా కాసేందుకు రాత్రి పగలు రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్ల తీరు : వికారాబాద్ జిల్లాలో గత నెలలోనే కొనుగోలు కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. తాండూరులో మాత్రం గత నెల 4వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 19 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి 2,931 బస్తాలను లారీల్లో తరలించారు. అలాగే బెల్కటూరు కేంద్రంలో నలుగురు రైతుల నుంచి 612 బస్తాల ధాన్యాన్ని సేకరించారు. మరో వంద మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నా అది ఇంకా ముందుకు సాగలేదు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు : తూకంలో వేగం పెంచేందుకు మరిన్ని కాంటాలను ఏర్పాటు చేయాలి. అలాగే రోజుకు 3 నుంచి 5 లారీల్లో ధాన్యాన్ని తరలించడం ద్వారా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇలా చేస్తే రైతులకు అవస్థలు తప్పుతాయి. అధికారులు ఆ దిశగా కృషి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
అంచనాలు మించి వరి సాగు : పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రబీలో వరి సాధారణ సాగు 45,620 ఎకరాలు ఉండగా, అనూహ్యంగా 55,000 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కోతలు మొదలవడంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు డీసీఎమ్మెస్, ఐకేపీ, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 70కి మించి అందుబాటులో ఉండడం లేవు.
తాండూరు మండలం చెంగోల్ కొనుగోలు కేంద్రంలో చెంగోల్, అల్లాపూర్, రాంపూర్, చింతామణిపట్నం, పర్వతాపూర్ రైతులు ధాన్యం తీసుకువెళ్లారు. సేకరణలో ఆలస్యంతో ఓఆర్ఆర్పై చెంగోల్ నుంచి అంతారం తండా వరకు రెండు కిలోమీటర్ల మేర కుప్పలుగా నిల్వ ఉంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ కుప్పల వద్ద ప్రతిరోజు 100 మంది రైతులు కాపలా ఉంటున్నారు. వారి నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తేమ 17 శాతానికి మించి ఉంటే అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారు.
కాంటాలు, లారీల సంఖ్యలు పెంచుతాం : తూకాలు వేగవంతం చేసేలా అదనంగా మరో రెండు కాంటాలను ఏర్పాటు చేస్తున్నామని డీసీఎమ్మెస్ కొనుగోలు కేంద్రం అధికారి ఎల్లయ్య తెలిపారు. తూకం పూర్తయిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల సంఖ్యను మూడుకు పెంచుతామన్నారు. నిబంధనల ప్రకారమే తేమ శాతం 17లోపు ఉంటేనే సేకరిస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ అధికారి స్పష్టం చేశారు.
హనుమకొండలో వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Hanamkonda