తెలంగాణ

telangana

Untimely Rains in Telangana : అకాల వర్షాలకు తోడు పిడుగుపాట్ల బీభత్సం.. జనమంతా ఆగమాగం

By

Published : May 10, 2023, 8:12 AM IST

Untimely Rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కురిసిన అకాల వర్షం బెంబేలెత్తించింది. నిజామాబాద్‌, జగిత్యాల, హైదరాబాద్‌ జిల్లాల్లో దీని ప్రభావం కనిపించింది. జగిత్యాల జిల్లాలో పిడుగు దాటికి.. వరి పంట కోపిస్తున్న మహిళా రైతు మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది. పలు చోట్ల గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి

rains
rains

Untimely Rains in Telangana : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడవడంతో ప్రజలు వణికిపోయారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్‌, రాయికల్‌ మండలాల్లో రైతుల కళ్ల ముందే కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. సారంగాపూర్ మండలం పెంబట్లలో వరికోత మిషన్‌తో వరి కోస్తుండగా వర్షం రావడంతో చెట్టుకింద నిలబడ్డ రైతు దంపతులపై.. పిడుగుపడి జోగిని పద్మ అనే మహిళా మృతి చెందగా, ఆమె భర్త గంగమల్లు తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

గత 15 రోజులుగా జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపుతుండగా.. ఐదు రోజులుగా ఎండలు కాస్తూ ఉండటంతో ధాన్యం ఎండబెడుతున్న తరుణంలో మళ్లీ కురిసిన వర్షం.. అన్నదాతలను మరింత కుంగదీసినట్లయింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్​యార్డుల వద్ద రైతన్నలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, భీంగల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం హడలెత్తించింది. భీంగల్‌ మండలం పల్లికొండ శివారులో పిడుగుపాటుకు సుమారు 48 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి అనిల్‌కు గాయాలయ్యాయి. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి.. సరఫరా నిలిచిపోయింది.

స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.. డిచ్‌పల్లి మండలంలో పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. యానంపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ శిఖరంపై పిడుగుపడి ధ్వంసమైంది. నల్లవెల్లిలో నివాస సముదాయాల మధ్య కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రావులపెల్లి ఇసుక క్వారీలో తాటి చెట్టుపై పిడుగు పడింది.

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షానికి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం వేళ వర్షం కురవడంతో ఉద్యోగులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీరు రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అకాలవర్షాలకు తోడు పిడుగుపాట్ల బీభత్సం.. జనమంతా ఆగమాగం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details