తెలంగాణ

telangana

'ఆ విషయం ప్లేయర్లకు బాగా తెలుసు'- ప్రపంచకప్​ ఓటమిపై ద్రవిడ్​ కీలక వ్యాఖ్యలు

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 10:52 PM IST

Rahul Dravid On World Cup Loss : ఓటమితో వచ్చే నిరాశ నుంచి ఎలా బయటపడాలో భారత ఆటగాళ్లకు తెలుసని కోచ్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా పర్యటన ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశమన్నాడు.

rahul dravid on world cup loss
rahul dravid on world cup loss

Rahul Dravid On World Cup Loss : ప్రపంచకప్​ ఓటమిపై స్పందించాడు భారత క్రికెట్ జట్టు హెడ్​ కోచ్​ రాహుల్ ద్రవిడ్​. ఆ నిరాశ నుంచి బయటపడి ఆటగాళ్లు ముందుకు సాగుతున్నారని వెల్లడించాడు. ఓటమితో వచ్చే నిరాశ నుంచి ఎలా బయటపడాలో భారత ఆటగాళ్లకు తెలుసని కోచ్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా పర్యటన ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశమన్నాడు. వన్డే వరల్డ్​కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా, చివరి మెట్టుపై తడబడింది. ఈ ఓటమి ఆటగాళ్లతో పాటు కోట్లాది అభిమానులనూ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ ఓటమి అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యారు.

"వరల్డ్​కప్‌ ఓటమి నిజంగా అందరినీ ఎంతో నిరాశకు గురిచేసింది. కానీ, అదంతా గతం. ఇప్పుడు మన ఎదురుగా మరో సిరీస్‌ ఉంది. గత ఓటమి నుంచి బయటపడి మనం ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో ఆటగాళ్లు చాలా పరిణతితో వ్యవహరిస్తున్నారు. మేం కూడా వారిని ఆ బాధ నుంచి బయటపడేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి ఓటముల నుంచి చాలా నేర్చుకుంటున్నాం. ఓడిన ప్రతిసారి ఆడటానికి మరో సరికొత్త ఇన్నింగ్స్‌ ఉంటుంది. అందుకే గతంలో ఎదురైన నిరాశలోనే కూరుకుపోకూడదు. నిరాశ చెందిన సమయంలో ఏం చేయాలో క్రికెటర్లుగా అందరూ తెలుసుకోవాలి. లేకపోతే తర్వాత అది మీ ఆటపై ప్రభావం చూపుతుంది."
--రాహుల్​ ద్రవిడ్‌, హెడ్​ కోచ్​

ఆటగాళ్లలో కొత్తగా స్ఫూర్తి నింపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు హెడ్ కోచ్ రాహుల్​ ద్రవిడ్‌. దేశం తరఫున దక్షిణాఫ్రికా పిచ్‌లపై టెస్టు క్రికెట్‌ ఆడటం చాలా గొప్ప విషయమని రాహుల్​ అభివర్ణించాడు. ఆటగాళ్లు మంచి క్రికెట్‌ ఆడటానికి ఇది అవకాశమని చెప్పాడు. "ఆటగాళ్లకు ప్రేరణనివ్వాలి అనే విషయాన్ని నేను నమ్మను. వారికి సరైన వాతావరణం కల్పించడాన్ని మాత్రమే నమ్ముతాను. ఎలాంటి లోపం లేకుండా సాధన చేయడం, మైదానంలో మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. వారిని అలా ఉంచడమే ఓ కోచ్‌గా నా పని. వారికి అవసరమైన అవకాశాలను అందించాలి. విజయం సాధించడానికి ఉవ్విళ్లూరే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు" అని ద్రవిడ్‌ వివరించాడు.

దుమ్మురేపిన రాహుల్ కొడుకు- కవర్ డ్రైవ్​లకు ఫ్యాన్స్​ ఫిదా- వీడియో చూశారా?

'ఆ విషయం ఇప్పుడు ఎందుకు - రోహిత్ గురించి మాకు క్లారిటీ లేదు'

ABOUT THE AUTHOR

...view details