తెలంగాణ

telangana

బీసీసీఐకి కాసుల వర్షం.. ఐపీఎల్​ ప్రసార హక్కుల వేలంలో తొలిరోజే రూ.42వేల కోట్లు

By

Published : Jun 12, 2022, 9:42 PM IST

IPL media rights auction 2022: 2023-27 ఐపీఎల్‌ మీడియా ప్రసార హక్కుల కోసం ప్రారంభించిన వేలం బీసీసీఐకి భారీగానే కాసుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఈ-వేలం ప్రారంభం కాగా ఊహించినట్లుగానే అనూహ్య స్పందన వ్యక్తమైంది. తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్ల రూపాయలు పలికింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా.

ఐపీఎల్
ఐపీఎల్​

IPL media rights auction 2022: భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి కల్పతరువుగా మారిన ఐపీఎల్‌.. బోర్డు ఖజానాను మరోసారి భారీగా నింపేందుకు సిద్ధమైంది. 2023-27 ఐపీఎల్‌ మీడియా ప్రసార హక్కుల కోసం ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ-వేలం ప్రారంభం కాగా, అంతా అంచనా వేసినట్లుగానే భారీ స్పందన వ్యక్తమైంది. ప్రసార హక్కుల ధర 45వేల కోట్ల రూపాయలు పలుకుతుందని బీసీసీఐ లెక్కలు కట్టగా, తొలిరోజే ఇది 42వేల కోట్ల రూపాయలకు చేరింది. వేలంకు బీసీసీఐ కనీస ధరను 32వేల 440 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా, తొలి రోజే దాని ధర అంతకు 10వేల కోట్ల రూపాయలకు చేరింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా. 2017లో స్టార్‌ ఇండియా 2018-2022 సీజన్‌ కోసం టీవీ, డిజిటల్‌ ప్రసారాలకు కలిపి 16 వేల 347 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు కాగా, ఈ సారి అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరే అవకాశం ఉంది.

2023-27 ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రసారాల హక్కుల కోసం డిస్నీ స్టార్‌, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, సోనీ, జీ లాంటి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ రేసు నుంచి అమెజాన్‌ వైదొలిగినా, టీవీ, స్ట్రీమింగ్‌ పరంగా చూసుకుంటే 10 సంస్థలు హక్కుల కోసం బరిలో నిలిచాయి. టీ-ట్వంటీ లీగ్‌ మీడియా హక్కుల కోసం బీసీసీఐ తొలిసారి ఈ- వేలం నిర్వహిస్తోంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. అయితే సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ వైదొలిగి, అత్యధిక బిడ్‌ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థ వేలం నుంచి వైదొలుగుతూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. చివరకు అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.

ఐపీఎల్‌ ఈ మీడియా ప్రసార హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-ఏలో భారత ఉపఖండ టీవీ హక్కులు, ప్యాకేజీ-బీలో భారత ఉపఖండ డిజిటల్‌ హక్కులను చేర్చారు. ప్యాకేజీ- సీలో భారత ఉపఖండంలో మాత్రమే జరిగే ప్లేఆఫ్స్‌ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌ల డిజిటల్‌ హక్కులు, ప్యాకేజీ డీలో భారత్‌ మినహా మిగతా ప్రపంచ దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కులు చేర్చారు. ఒక సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరిగితే ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 18గా ఉంటుంది. ఈ ఒప్పందంలోని చివరి రెండు సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాలున్నాయి. అప్పుడు ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 22 అవుతుంది. ఈ ఒక్కో ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్‌ ధర వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే సంస్థలు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. చివరకు అన్ని మ్యాచ్‌లకు కలిపి వాటిని లెక్కగట్టి అయిదేళ్ల కాలానికి ఎంత అవుతుందో తేలుస్తారు. ఒక్కో సంస్థ ఎన్ని ప్యాకేజీలకైనా బిడ్లు దాఖలు చేయవచ్చు.

ఇదీ చూడండి :టాప్​లో కోహ్లీ, ప్రియాంక.. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారంటే?

ABOUT THE AUTHOR

...view details