తెలంగాణ

telangana

Ravi Teja Khiladi: 'హాలీవుడ్‌ స్థాయిలో రవితేజ 'ఖిలాడి''

By

Published : Feb 8, 2022, 9:31 AM IST

Ravi Teja Khiladi: కథను నమ్మి సినిమాలు చేయడం వల్లే తనకు విజయాలు దక్కుతున్నాయని చెప్పారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రవితేజ హీరోగా ఆయన నిర్మించిన 'ఖిలాడి' చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు సత్యనారాయణ.

ravi teja khiladi
ఖిలాడి

Ravi Teja Khiladi: "కథని నమ్మి ప్రయాణం చేయడం నా శైలి. అందుకే విజయాలు దక్కుతున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త రకమైన కథతో మా చిత్రం తెరకెక్కింద"న్నారు కోనేరు సత్యనారాయణ. విద్యాసంస్థల్ని నిర్వహిస్తూనే, హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుసగా సినిమాలు చేస్తున్న నిర్మాత ఈయన. 'రాక్షసుడు'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల రవితేజ కథానాయకుడిగా పెన్‌ స్టూడియోస్‌తో కలిసి 'ఖిలాడి' సినిమాని నిర్మించారు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీలోనూ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

కోనేరు సత్యనారాయణ

"కథ బాగుంటేనే సినిమా బాగుంటుందని నమ్ముతాను. మేం నిర్మించిన 'రాక్షసుడు' విషయంలో అదే జరిగింది. ఇటీవల తమిళంలో నిర్మించిన 'పెళ్లిచూపులు' రీమేక్‌ విషయంలోనూ అదే రుజువైంది. అందుకే నేను కథకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నా. దర్శకుడు రమేష్‌ వర్మ 'ఖిలాడి' కథ చెప్పాక నాకు అప్పుడే నమ్మకం కలిగింది. రవితేజతో 'ఇది మీకెరీర్‌లోనే ఎక్కువ వసూళ్లు సాధించే చిత్రం అవుతుంద'ని చెప్పా. రవితేజతో చేస్తేనే ఈ కథ బాగుంటుందనుకున్నాం. ఆయనకి చెప్పగానే చేయడానికి ముందుకొచ్చారు. వాణిజ్య కథతో రూపొందిన సినిమానే అయినా కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. నిర్మాణ విలువల పరంగా హాలీవుడ్‌ స్థాయిలో కనిపిస్తుంది. ఇటలీలో తెరకెక్కించిన సన్నివేశాలు ఈ సినిమా స్థాయిని చాటి చెబుతాయి. ఇలాంటి కథాంశంతో ఇదివరకెప్పుడూ సినిమా రాలేదు. పూర్తి సినిమా చూసిన వెంటనే, ఇంత బాగా తీసిన దర్శకుడికి ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. కారు బహుమతిగా ఇచ్చా. దేవిశ్రీప్రసాద్‌ మంచి పాటలు ఇచ్చారు".

'ఖిలాడి'
  • "నలభయ్యేళ్లుగా విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నాం. సినిమా రంగానికి నేను కొత్త. ఇక్కడికొచ్చాక సినిమాని చూసే కోణమే మారిపోయింది. ప్రపంచస్థాయి వినోద విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అందుకోసం హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో వంద ఎకరాలు భూమిని కొనుగోలు చేశాం".
    మీనాక్షి చౌదరీ

హవీష్‌తో 'సంజయ్‌ రామస్వామి'

"'ఖిలాడి'ని జాతీయ స్థాయిలో అన్ని భాషల్లోకి తీసుకెళ్లాలనే పెన్‌ స్టూడియోస్‌ సంస్థతో కలిశాం. తెలుగుతోపాటు, హిందీలోనూ విడుదల చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆటల్ని ప్రదర్శించడం కోసం కర్ఫ్యూ సమయాన్ని రాత్రి పూట ఒక గంట సడలించాలంటూ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా విజ్ఞప్తి చేశాం. ఏ వ్యాపారమైనా క్రమశిక్షణ, నిబద్ధతతో చేయాలనుకుంటా. మా సినిమాలకి వందశాతం డిజిటల్‌ చెల్లింపులే చేస్తున్నాం. ప్రస్తుతానికి 'సంజయ్‌ రామస్వామి' పేరుతో హవీష్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆ తర్వాత 'రాక్షసుడు2'ని రూపొందించే ఆలోచన ఉంది. రూ.వంద కోట్ల వ్యయంతో పాన్‌ ఇండియా స్థాయిలో 'యోధ' అనే ప్రాజెక్ట్‌ సన్నాహాల్లో ఉంది".

డింపుల్ హయతి

ఒక్కడే కింగ్‌...

'ఈ ఆటలో ఒక్కడే కింగ్‌' అంటూ సందడి చేస్తున్నారు రవితేజ.. 'ఖిలాడి' ట్రైలర్‌తో. ఇటీవలే ట్రైలర్‌ విడుదలైంది. డబ్బు చుట్టూ సాగే కథతో, యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. మోహన్‌గాంధీ అనే పాత్రలో రవితేజ కనిపించారు. ఆయన, కథానాయికలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరీ, అనసూయలతో కలిసి చేసిన అల్లరి ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచింది.

ఇదీ చూడండి:'కేజీఎఫ్​2' ఐటెమ్ సాంగ్​​.. హాట్​ భామతో!

ABOUT THE AUTHOR

...view details