ETV Bharat / sitara

ఆమె పాటకు 'డాలర్ల'తో పట్టాభిషేకం

author img

By

Published : Mar 31, 2022, 9:01 AM IST

Gujarati Folk singer Geeta ben rabari
గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్‌ రబరీ

Gujarati Folk singer Geeta ben rabari: గానంతో రాళ్లు కరుగుతాయో లేదో కానీ.. గీతా రబారి పాడితే మాత్రం మనసులు కరగాల్సిందే! రుజువేంటంటారా? ఇటీవల అమెరికాలో జరిగిన కచేరీల్లో ఆమె పాటలకు ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. ఆ డబ్బు లెక్కేస్తే కోట్లలో తేలింది. ఇది ఆమెకు కొత్త కాదు... ఒక సాధారణ గిరిజన జానపద గాయని అసాధారణ ప్రయాణమిది...

Gujarati Folk singer Geeta ben rabari: ‘మానవత్వం మనిషి గుణగణాల్లోనే కాదు.. చేతల్లోనూ కనిపిస్తుందం’టారు. ఇందుకు తాజా ఉదాహరణే గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్‌ రబరీ. తన అద్భుత గాత్రంతో సంగీత ప్రియుల్ని ఓలలాడించే ఆమె.. ఈసారి తనలో ఉన్న ఈ ప్రత్యేక నైపుణ్యాల్ని నిధుల సమీకరణ కోసం ఉపయోగించింది. రష్యాతో యుద్ధంలో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌కు తన వంతుగా సహాయసహకారాలు అందించడానికి అమెరికా వేదికగా నిర్వహించిన ఓ సంగీత కచేరీలో పాలుపంచుకుంది గీత. ఇక్కడా ఆమె గాత్రానికి కోట్ల కొద్దీ కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఇలా దీని ద్వారా రెండు కోట్లకు పైగా నిధులు పోగు చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఈ కచేరీకి సంబంధించిన ఫొటోల్ని ఆమె సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి కాస్తా వైరలవుతున్నాయి. ఈ గుజరాతీ సింగర్‌ మంచితనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె గురించే ఈ కథనం..

గుజరాత్‌లోని కచ్‌.. ‘గోవుల సంరక్షణ’ కోసం నిర్వహించిన కార్యక్రమమది. దానిలో పాడుతోంది గీత. పాట మొదలైందో లేదో.. డబ్బుల వర్షం. కచేరీ అయ్యాక చూస్తే రూ.మూడున్నర కోట్లు లెక్కతేలింది. అదే రాష్ట్రంలోని మాధాపూర్‌, వల్సాద్‌ల్లో ఇలాగే సహాయ కార్యక్రమాల్లో పాడటానికి వెళ్లింది. అక్కడా కోటిన్నర, కోటి చొప్పున వచ్చాయి.

2018.. ఆఫ్రికాలోని నైరోబీలో దేశాధ్యక్షుడి ఎదుట పాడింది. అక్కడా ఆ దేశ కరెన్సీతో ఆమె కూర్చున్న ప్రదేశం నిండిపోయింది. లండన్‌, అమెరికా, దుబాయ్‌.. ఆమె ఎక్కడికి వెళ్లినా ఇదే దృశ్యం.

తాజాగా.. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, సంస్థలు నిధులు సేకరిస్తున్నాయి. అమెరికాలో ఎన్నారైలు అట్లాంటా, జార్జియాల్లో కచేరీలు ఏర్పాటు చేశారు. అక్కడ గీత గానానికి పరవశించిన ప్రేక్షకులు డబ్బుల్ని పూలలా ఆమెపై వెదజల్లారు. ఆ మొత్తం రూ. రెండు కోట్లకుపైనే! ఇదంతా జరిగింది గీతా బెన్‌ రబరీ పాల్గొన్న సంగీత కచేరీలలోనే.

Gujarati Folk singer Geeta ben rabari
గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్‌ రబరీ

ఎవరీ గీతాబెన్‌ రబారీ.. ఆమె ఏ పాప్‌ స్టారో, సినీ నేపథ్య గాయనో కాదు. ఓ అటవీ ప్రాంతానికి చెందిన పేదింటి అమ్మాయి. నాన్నకేమో పక్షవాతం. అమ్మ చేసే చిన్నా చితక పనులే జీవనాధారం. ఇద్దరు అన్నలు ఉండేవారు. తన చిన్నతనంలో అనారోగ్యాలతో చనిపోయారు. ఇదీ ఆ కుటుంబ పరిస్థితి. వాళ్లది గుజరాత్‌లోని తప్పర్‌ గ్రామం. మల్దారీ అనే గిరిజన తెగ. పాడి ఇక్కడివారి జీవనాధారం. అమ్మాయిలకూ చదువు అవసరమన్న ఊహే తెలియదు అక్కడి వారికి. ఈమె చిన్నతనంలో వాళ్ల నాన్న అప్పటి సీఎం మోదీ నుంచి అమ్మాయిలను చదివించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఒక పోస్టుకార్డు అందుకున్నారు. అప్పుడు తన కూతురికి అక్షర జ్ఞానం అందించాలన్న ఆలోచన వచ్చిందామె నాన్నకి. వెంటనే పాఠశాలలో చేర్చాడు.

అలా గుర్తింపు... గీతకి చిన్నతనం నుంచీ పాటలంటే ఇష్టం. ఓసారి ఓ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీ ప్రశంసలు, నగదు బహుమతి అందుకుంది. దీంతో పాటమీద మరింత ఇష్టం పెంచుకుంది. ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా పాల్గొనేది. ఆమె గొంతు విని అందరూ మైమరిచిపోయేవారు. ఇళ్లలో ఏ వేడుక జరిగినా ఆమెనే తీసుకెళ్లేవాళ్లు. అలా మొదలైన ఆమె సంగీత ప్రయాణం పక్క ఊళ్లకీ పాకింది. అప్పటిదాకా గుజరాతీ భజనలు, జానపదాలే ఆమె ప్రపంచం. తనకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఆన్‌లైన్‌ సంస్థ పాట పాడే అవకాశమిచ్చింది. ‘రోనా షెర్‌ మా’ అంటూ పాడితే అది కాస్తా సంచలనమైంది. ఆ ఒక్క పాటతోనే రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత గుజరాతీలో ప్రాచుర్యం పొందిన గర్బా నృత్య గీతాల్ని ఆలపించి దాంట్లోనూ విజయవంతమైంది. ఆ విశ్వాసంతో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రముఖ గాయనిగా ఎదిగింది. లైవ్‌ ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్త గుర్తింపునీ తెచ్చుకుంది. యూఎస్‌, యూకే, లండన్‌, ఆఫ్రికా.. ఇలా ఎన్నో దేశాల్లో 400కుపైగా లైవ్‌ ప్రదర్శనలిచ్చింది. 2020లో అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎదుటా కచేరీ చేసింది.

సంప్రదాయానికే పెద్దపీట.. ఇంతకీ ఈమె చదివిందేంటో తెలుసా.. పదో తరగతే! అయినా ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకు ఇరవై లక్షలకుపైగా, యూట్యూబ్‌ ఛానెల్‌కు పదకొండు లక్షలకుపైగా ఫాలోయర్లున్నారు. తన ఎదుగుదలలో భర్త పృథ్వీ రబారీ ప్రోత్సాహమూ ఎక్కువే అనే ఈ 26 ఏళ్ల అమ్మాయి.. సంగీతంలో ఏ శిక్షణా తీసుకోలేదు. ఇంత పేరుప్రఖ్యాతులను సంపాదించినా గత ఏడాది వరకూ తన ఊరిని వదల్లేదు. అమ్మానాన్నలనీ దగ్గరుండి చూసుకుంటోంది. పాటతోనే కాదు.. ప్రవర్తనతోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆల్బమ్‌ అయినా, లైవ్‌ ప్రదర్శన అయినా గుజరాతీ సంప్రదాయ వస్త్రాలు, నగలనే ధరిస్తుంది. ఇదే తన ఉనికనే అమ్మాయి... ప్రధాని మోదీ సహా ఎందరో ప్రముఖుల మెప్పునూ అందుకుంది. మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించడం గొప్పేగా మరి!

Gujarati Folk singer Geeta ben rabari
గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్‌ రబరీ

తనే నా బలం, ప్రోత్సాహం!

* గీతకు మూగజీవాలంటే ప్రాణం. తనకిష్టమైన ఆట క్రికెట్‌ అంటోంది.

* తన చదువుకు కారణమైన ‘భేటీ బచావో.. భేటీ పఢావో..’ కార్యక్రమాన్ని మరింతమంది బాలికలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో.. ఇదే నేపథ్యంలో పాటలు పాడి మరింత పాపులారిటీ సంపాదించింది గీత.

* గుజరాతీ సింగర్ కింజల్ దేవ్ తన ప్రాణ స్నేహితురాలంటోందామె.

* ఇక తన సంపాదనతో మొదటిసారి ఇన్నోవా కారు కొన్న ఆమె.. అది తనకు ఎంతో అమూల్యమైందని చెబుతోంది.

* పాటలే కాదు.. గర్భా పాటలతో కూడిన ఆల్బం కూడా రూపొందించింది గీత.

* సివిల్‌ ఇంజినీర్‌ అయిన పృథ్వీ రబరీని వివాహమాడిన ఈ గుజరాతీ సింగర్‌.. ‘తనే నా బలం, ప్రోత్సాహం’ అంటూ చెప్పుకొచ్చింది.

* గీతకు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే! ఇన్‌స్టాలో ఆమెను 23 లక్షల మంది ఫాలో అవుతుండగా.. యూట్యూబ్‌లో 11 లక్షలకు పైగా సబ్‌స్రైబర్లున్నారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీని మెప్పించిన గుజరాతీ గాయని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.