తెలంగాణ

telangana

పొదుపుతో భవిత కాంతిమంతం

By

Published : Oct 17, 2021, 5:13 AM IST

ప్రస్తుతం భారత్‌ విద్యుత్‌ రంగంలో భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో సరఫరా మరింత క్లిష్టతరమవుతుందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

surviving power crisis
పొదుపుతో భవిత కాంతిమంతం

చాలాకాలం క్రితం జర్మనీలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని లిఫ్టులో నిండు గర్భిణి ఒంటరిగా కిందికి దిగుతున్నారు. హఠాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. ఆమె తీవ్ర భయకంపితురాలై గట్టిగా అరుస్తూ స్పృహతప్పి పడిపోయారు. కొద్దిసేపటి తరవాత విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరిగి ఆమె క్షేమంగా బయటికొచ్చారు. 'బతుకుజీవుడా' అనుకొంటూ బయటపడిన ఆమె అంతటితో ఊరుకోలేదు. తనను అంతగా కంగారు పెట్టిన విద్యుత్‌ శాఖపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ప్రాణాలు పోయేంతగా తనను భయపెట్టినందుకు ప్రతిఫలంగా భారీగా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఆమెకు భారీ మొత్తం చెల్లించాలంటూ కోర్టు విద్యుత్‌ శాఖను ఆదేశించగా, అది కిమ్మనకుండా పాటించింది.

ఇక్కడితో కథ ముగియలేదు. తనకు ఎదురైన భయానక అనుభవం మరెవ్వరికీ భవిష్యత్తులో కలగకుండా ఉండేందుకు అవసరమైన అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల వంటి సదుపాయాలు సమకూర్చుకొనే నిమిత్తం నష్టపరిహారం సొమ్మును విద్యుత్తుశాఖకు తిరిగిచ్చేస్తూ- అందుకు తగిన ఆదేశాలు జారీచేయాలంటూ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారామె! ఇదంతా మనకు ఆశ్చర్యం కలిగించే ఉదంతం. ప్రతి వేసవిలో, ఆ మాటకొస్తే ఏడాది పొడుగునా కోతలకు అలవాటు పడిపోయిన పరిస్థితి మనది. అలాంటిది జర్మనీలో కొన్ని నిమిషాలపాటు విద్యుత్‌ ఆగిపోతే వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించడం మన ఊహకందని విషయం. కానీ, నిజంగా జరిగిన సంఘటన ఇది!

జాగ్రత్తలు తీసుకోకుంటే..

ప్రస్తుతం భారత్‌ విద్యుత్‌ రంగంలో భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో సరఫరా మరింత క్లిష్టతరమవుతుందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. కోతలు తప్పవంటున్నాయి. కరెంటు మనకు విలాసం కాదు- ప్రాణావసరం. చలికాలంలో సైతం ఫ్యాన్‌ లేకుంటే ఊపిరి ఆడని స్థితిలో ఉన్నాం. అలాంటిది మండు వేసవిలో కరెంటు కోతలు వచ్చిపడితే ఎంతగా విలవిల్లాడిపోతామో ఊహించుకోవచ్చు. అందుకని, ఆ జర్మనీ మహిళ తీరులోనే మనమూ తప్పక ఆలోచించాలి. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే ఆలోచించుకోవాలి.

'నేటి అవసరాల కోసం రేపటిని తాకట్టు పెట్టడమనేది ఏ రకంగా వివేకమో నాకైతే అర్థంకాదు' అన్నారు మహాత్మాగాంధీ. నిజానికి మన అసలు స్వభావం అదే. రేపటి గురించి నిన్ననే ఆలోచించి నేడు అమలు చేయడమే మనం అనుసరిస్తున్న విధానం. మొదటినుంచీ మన పెద్దలు మనకు నూరిపోసిందదే. తమ పిల్లల భవిష్యత్తు కోసం సుఖాలను త్యాగం చేసే తల్లిదండ్రులు, పదవీ విరమణ దరిమిలా జీవితం ప్రశాంతంగా గడపాలనే లక్ష్యంతో ఉద్యోగం చేసినన్నాళ్లూ పొదుపు పాటించే ఉద్యోగులు, పైసాపైసా కూడబెట్టి సురక్షిత భవిష్యత్తును నిర్మించుకోవాలని చూసే శ్రమజీవులు.. ఇదే మన సమాజం. అదే నిజం. 'వర్షార్థ మష్టౌ ప్రయతేత మాసాన్‌... వర్షాకాలం నిమిత్తం తక్కిన ఎనిమిది నెలలూ కష్టపడి పొదుపు చేయాలి. వృద్ధాప్యం నిశ్చింతగా గడపడం కోసం నడి వయసులోనే ఆలోచన చేయాలి. పరలోకంలో ఉత్తమ గతులకోసం ఇహలోకంలోనే ప్రయత్నాలు చేయాలి' అన్న హితవచనం ఈ జాతికి శిరోధార్యం. అలాంటి స్వభావం కారణంగానే ఆర్థికరంగంలో విశ్వమంతా కుదేలైపోయిన ఎన్నో సందర్భాల్లో భారతదేశం నిబ్బరంగా నిలబడగలిగింది. రేపటి గురించి ఆలోచించే మౌలిక తత్వమే భారతదేశ నిశ్చింతకు మూలంగా నిలిచింది.

రాష్ట్రాలు కేంద్ర పక్షపాత ధోరణిపైనా, కేంద్రం రాష్ట్రాల అసమర్థ పాలనపైనా నెపం పెడుతూ వారూ వీరూ కూడా చేతులెత్తేస్తున్న రోజులు నడుస్తున్నాయి. ఇది అన్ని రంగాలకు వర్తించేమాట. రేపు ఎదురయ్యే విద్యుత్‌ సంక్షోభం క్షోభపెట్టేది- సామాన్య ప్రజలనే కాని, సంపన్న వర్గాలను, నేతలను కాదు. అందుకని, విద్యుత్‌ అవసరాలను కుదించుకోవాలి. కరెంటును దాచుకోవాలి. ధాన్యం పుష్కలంగా ఉన్నరోజుల్లో గాదెల్లో భద్రపరుస్తూనే నిత్యం వాడుకుంటూనే, రేపటి విత్తనాల కోసం కొంతభాగాన్ని దాచి ఉంచే రైతన్నల మాదిరి వేసవి అవసరాల కోసం శీతాకాలంలో విద్యుత్తును మనం దాచిపెట్టుకోవాలి.

- వై. శ్రీలక్ష్మి

ఇదీ చూడండి :Herd Immunity: హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం డెల్టా బారిన పడాల్సిందే.. లేదా..!

ABOUT THE AUTHOR

...view details