తెలంగాణ

telangana

జగన్‌ అక్రమాస్తుల కేసు.. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

By

Published : Jul 5, 2023, 4:58 PM IST

Updated : Jul 6, 2023, 6:25 AM IST

supreme court
supreme court

16:48 July 05

జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court Notices to Jagathi Publication Bharathi Cements: ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసు, సీబీఐ కేసుల్లో తీర్పు వచ్చాకే ఈడీ కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు గత సంవత్సరం సెప్టెంబరులో తీర్పు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ, ఈడీ కేసులు ఏకకాలంలో విచారించినా సీబీఐ కేసుల్లో తీర్పు వచ్చే వరకు ఈడీ కేసు తీర్పు నిలిపివేయాలని సూచించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈడీ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం పిటిషన్లను విచారించింది.

విజయ్‌ మదన్‌లాల్‌ చౌదరి కేసులో తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఒకవేళ ప్రధాన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలినా నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం కింద విచారణ కొనసాగించవచ్చు కదా? అనే ప్రశ్నను పరిష్కరించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు వాదనలు వినిపిస్తూ ఆయా కేసుల్లో శాంక్షన్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదన్న కారణంగా నిందితులు నిర్దోషులుగా తేలితే పరిస్థితేంటనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘మేం కేవలం విధివిధానాలపైనే మాట్లాడుతున్నాం. రెండు దర్యాప్తు సంస్థల కేసుల విచారణ ఏకకాలంలో చేపట్టవచ్చని హైకోర్టు అభిప్రాయపడినందున హైకోర్టు తీర్పు మొత్తంగా తప్పనలేం. అన్ని పక్షాల వాదనలు వింటాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

భారతి సిమెంట్స్‌ తరఫున న్యాయవాది జ్ఞానేంద్ర వాదనలు వినిపించారు. ఈడీ కేసుల్లో ట్రయల్‌ వద్దని హైకోర్టు తీర్పులో లేదని, ప్రధాన కేసు పూర్తయ్యేంత వరకు తుది తీర్పును నిలిపేయాలని మాత్రమే హైకోర్టు ఆదేశించిందని అన్నారు. ‘హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన విజయ్‌ మదన్‌లాల్‌ చౌదరి తీర్పుపై స్పష్టత ఇవ్వాలా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకు స్పష్టత మేం ఇవ్వాలా? లేదా త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలా? అనే అంశాలపై వాదనలు విని నిర్ణయిస్తాం’ అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా పేర్కొన్నారు.

అనంతరం ప్రతివాదులుగా ఉన్న భారతి సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ధర్మాసనం నోటీసులనిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది. ఈ ఐదు పిటిషన్లలో సీఎం జగన్‌ సతీమణి భారతిరెడ్డి ప్రతివాదిగా అన్ని కేసులలో హైకోర్టు తీర్పు వేరుగా ఉన్నందున ప్రస్తుత పిటిషన్ల నుంచి వాటిని వేరు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వేరు చేసిన ఆ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం విచారిస్తామని స్పష్టం చేసింది.

Last Updated :Jul 6, 2023, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details