తెలంగాణ

telangana

ఏనుగుల హల్​చల్.. కర్ణాటకలో ఇద్దరు మృతి.. రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు!

By

Published : Feb 20, 2023, 9:56 PM IST

కర్ణాటక, ఝార్ఖండ్​లలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఝార్ఖండ్​లో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు మరణించారు.

elephants-attacks-in-karnataka-and-jarkhand
ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి

కర్ణాటకలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దక్షిణ కన్నడ ప్రాంతంలో అడవి ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వీరి మరణంపై అక్కడి స్థానికులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బెడద ఉందని ఎంత చెప్పినప్పటికి అధికారులెవ్వరూ పట్టించుకోలేదని, తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

పేరడ్క పాల సొసైటీలో పనిచేస్తున్న రంజిత.. ఇంటి నుంచి సొసైటీకి వెళ్తుండగా మీనది వద్ద ఏనుగు దాడి చేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు రమేశ్ రాయ్​పై కూడా ఏనుగు దాడి చేసింది. దీంతో రమేశ్ రాయ్, రంజిత అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏనుగుల బెడదపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. అటవీశాఖపై, ప్రభుత్వంపై స్థానిక ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "గత ఐదేళ్ల నుంచి తాలూకాలో ఏనుగుల బెడద ఎక్కువైంది. ఏనుగుల బెడద కారణంగా అటవీశాఖ, సంబంధిత అధికారులతో పలుమార్లు కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరాం. అంతే కాదు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా విన్నవించాం. కానీ ప్రయోజనం లేకపోయింది" అని అక్కడి స్థానికుడు ఆరోపించాడు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఏనుగులు దాడిలో చనిపోయిన రమేశ్​
ఏనుగుల దాడిలో చనిపోయిన రంజిత

మర్దాల్‌కు చెందిన స్థానిక యువకుడు ఏనుగు దాడి గురించి వారం రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పెట్టాడు. గ్రామ పంచాయతీకి కూడా సమాచారం అందించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, మంత్రి ఇక్కడికి వచ్చే వరకు మృతదేహాలను తొలగించేది లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. ప్రజల నిరసన గురించి తెలుసుకున్న డీఎఫ్‌ఓ సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సాయంత్రం ఏనుగులను పట్టుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నాగర్‌హోళె, దుబరే శిబిరాల నుంచి మచ్చిక చేసిన ఏనుగులను రప్పించి అడవి గున్నలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

ఝార్ఖండ్​లో ఏనుగుల బీభత్సం
ఝార్ఖండ్‌లోనూ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గత రెండు రోజుల్లో ఏనుగుల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రాంచీ, లోహర్‌దగా, లతేహర్, జమ్తారాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఏనుగుల సంచారం గురించి వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చాలా చోట్ల ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details