తెలంగాణ

telangana

Shadnagar murder case: 'బిడ్డను ఇవ్వమన్నందుకు చంపేశారు'

By

Published : May 3, 2023, 1:39 PM IST

Woman Murder in Shadnagar: పుట్టిన మగబిడ్డ ఆరోగ్యస్థితి సరిగా లేక మృతి చెందాడు. ఎలాగైనా తమకు ఓ మగబిడ్డ కావాలనుకున్న ఆ దంపతులు తెలిసిన వారి నుంచి ఆరు నెలల పసికందును కొనుగోలు చేశారు. బంధువులతో పాటు తండాలో తమకు బాబు పుట్టాడని ప్రచారం చేశారు. కానీ పసికందును విక్రయించిన మహిళ మరింత డబ్బును డిమాండ్ చేయడంతో కథ మలుపు తిరిగింది. అడిగినంత డబ్బు ఇవ్వమని.. లేకపోతే బాబును తిరిగి ఇచ్చేయమని చెప్పడంతో ఆ దంపతులు కంగుతిన్నారు. ఆమె వల్ల బాబు తమకు పుట్టలేదనే విషయం తండాలో తెలుస్తుందన్న భయంతో ఆమెను చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటుచేసుకుంది.

Shadnagar murder case
Shadnagar murder case

Woman Murder in Shadnagar: మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్ మండలంలోని బత్లీ తండాకు చెందిన రాములు, శారద దంపతులు. గత కొన్నేళ్లుగా షాద్​నగర్​లోని పటేల్‌ రోడ్డుల్లో నివాసం ఉంటున్నారు. రాములు స్థానికంగా హమాలీ పని చేస్తూ ఉంటాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే ఇటీవల జన్మించిన మగ శిశువు అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. తమకు ఎలాగైనా మగ బిడ్డ కావాలని తనతో పాటు పనిచేస్తున్న హమాలీ పురుషోత్తంకు చెప్పాడు రాములు.

కట్ చేస్తే.. పురుషోత్తం ఛత్తీస్‌గఢ్​కు చెందిన దేవకితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వారికి పుట్టిన మగబిడ్డను ఇస్తానని రాములుకు చెప్పాడు. ఇందుకు పురుషోత్తం, దేవకి కలిసి రాములు-శారద దంపతుల నుంచి రూ.1.50 లక్షల నగదు తీసుకున్నారు. డబ్బులు ఇచ్చి మగశిశువును తీసుకున్న రాములు దంపతులు ఆ బిడ్డ తమకే పుట్టాడని స్థానికులు, బంధువులతో చెప్పుకున్నారు.

అయితే బిడ్డను అమ్ముకున్న దేవకి అంతటితో ఆగకుండా దుర్బుద్ధి పుట్టి తన కుమారుడి తిరిగి ఇవ్వాలని లేకపోతే మరికొంత డబ్బు ఇవ్వాలని రాములు దంపతులను డిమాండ్ చేసింది. ఈ విషయంలో పలు మార్లు రాములు ఇంటి వద్ద వాగ్వాదానికి దిగింది. దేవకి ప్రవర్తనతో రాములు దంపతులు విసిగిపోయారు. తమను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె చేస్తున్న గొడవతో ఆ బిడ్డ తమకు పుట్టిన వాడు కాదనే విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడ్డారు. ఈ క్రమంలో దేవకిని అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నారు.

డబ్బులు ఇవ్వాలని మహిళ డిమాండ్​.. హత్య చేసిన దంపతులు: ఇదే విషయమై సోమవారం రాత్రి దేవకి.. రాములు ఇంటికి వచ్చింది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆమెను ఇంట్లోకి పిలిచి రాములు దంపతులు.. శారద చెల్లెలు జ్యోతి సహకారంతో ఆమెపై దాడి చేశారు. అనంతరం చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. రాములు హమాలీ కావడంతో తన ఇంట్లో ఉన్న గోనెసంచిలో దేవకి మృతదేహాన్ని పెట్టారు. మూట కట్టి తలపై పెట్టుకుని రాంనగర్ కాలనీ శివారు వైపు వెళ్లాడు. అతనితో పాటు భార్య శారద కూడా వెళ్లింది. తలపై ఉన్న సంచి చూసిన పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది ప్రశ్నించగా.. చెత్త అని సమాధానం ఇచ్చారు.

బాలుడిని అమ్మిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు: అనుమానం వచ్చి సంచి తనిఖీ చేయగా దేవకి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే రాములు అతని భార్య శారదను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని షాద్​నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన షాద్​నగర్ పోలీసులు రాములు దంపతులతో పాటు సహకరించిన శారద చెల్లెలు జ్యోతిని కూడా అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. బాలుడిని అమ్మిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు షాద్​నగర్‌ ఏసీపీ కుశాల్కర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details