తెలంగాణ

telangana

'ఎన్నికల గుర్తులు దుర్వినియోగమవుతున్నాయ్‌'

By

Published : Dec 11, 2020, 7:46 AM IST

రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను దుర్వినియోగం చేస్తున్నాయని అలహాబాద్​ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓ జాతీయ పార్టీకి సంబంధించిన గుర్తును ఎన్నికల సంఘం వెంటనే ఉపసంహరించుకోవాలని పిటిషనర్​ కోరారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి నోటుసులు ఇచ్చింది అలహాబాద్​ హైకోర్టు.

HC SEEKS ELECTION COMMISSION ON PLEA FOR WITHDRAWING BJP'S ELECTION SYMBOL
'ఎన్నికల గుర్తులు దుర్వినియోగమవుతున్నాయ్‌'

రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను దుర్వినియోగం చేస్తున్నాయంటూ అలహాబాద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. భాజపాకు కేటాయించిన కమలం గుర్తును ఉపసంహరించుకోవాలని కూడా పిటిషన్‌దారు అందులో కోరారు. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ మాథుర్‌, జస్టిస్‌ పియూష్‌ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం భారత ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 12కు వాయిదా వేసింది.

భాజపాకు ఎన్నికల గుర్తుగా కేటాయించిన కమలాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఈసీఐని ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ వాసి కాళీ శంకర్‌ గతంలో కోరారు. 'కమలం' జాతీయ పుష్పమని, పలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అది కనిపిస్తుంటుందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఆ గుర్తును వాడుకునేందుకు ఏ పార్టీనీ అనుమతించొద్దన్నారు. ఆ చిహ్నాన్ని ఉపయోగించుకునే పార్టీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తిని ఈసీఐ గత ఏడాది ఏప్రిల్‌ 4న తిరస్కరించింది. దీంతో ఆయన అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల గుర్తులను ఆయా ఎన్నికల వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని.. వాటిని లోగోలుగా వాడుకునేందుకు పార్టీలను అనుమతించకూడదని కూడా పిల్‌లో కోరారు. గుర్తులను అన్నివేళలా వినియోగించుకునేందుకు అనుమతిస్తే.. స్వతంత్ర అభ్యర్థులకు, ఏ పార్టీతోనూ సంబంధం లేని అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల చిహ్నాల వినియోగానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. స్పందన దాఖలు చేసేందుకు సమయమివ్వాల్సిందిగా ఈసీఐ తరఫు న్యాయవాది కోరారు. ఇతర రాజకీయ పార్టీలనూ తాజా పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని కాళీ శంకర్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: పట్టు వీడని రైతన్న- మెట్టు దిగని సర్కార్!

ABOUT THE AUTHOR

...view details