తెలంగాణ

telangana

60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. అధికారులు షాక్

By

Published : Apr 8, 2022, 3:59 PM IST

Thieves Steal Bridge: బిహార్​లో దొంగలు ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే లేపేశారు. మూడు రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా టన్నుల ఇనుమును దోచుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు, అధికారులు కంగుతిన్నారు.

Thieves Steal Bridge
60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. కంగుతిన్ని అధికారులు

Bihar bridge robbery: మీరు ఇప్పటివరకు ఎన్నో దొంగతనాల గురించి విని ఉంటారు. కానీ ఈ దోపిడీ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని అవాక్కవ్వడం ఖాయం. ఇంట్లోకి చొరబడి రూ.లక్షల నగదు, బంగారం, ఆభరణాలు దోచుకెళ్లిన గజదొంగలు, ఏదీ దొరకనప్పుడు వస్తువులను తీసుకెళ్లే చిన్న చిన్న దొంగతనాలను మనం చాలాసార్లు చూశాం. కానీ ఈ ముదుర్లు మాత్రం ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే లేపేశారు. మూడు రోజుల్లోనే పనికానిచ్చారు. కానీ ఇంత జరగుతున్నా ఈ విషయాన్ని చుట్టు పక్కలవారు ఎవరూ పసిగట్టలేకపోయారు. చివరకు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.

బిహార్​ రోహ్తాస్ జిల్లా నాసరీగంజ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని అమియావార్​లో ఓ పురాతన ఐరన్​ బ్రిడ్జి ఉంది. దీని పొడవు 60 అడుగులు, వెడల్పు 10 అడుగులు. ఎత్తు 12 అడుగులు. 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా పథకం పన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులమని చెప్పి గ్యాస్​ కట్టర్​లు, జేసీబీని ఉపయోగించి ఇనుమునంతా కట్ చేశారు. ఎంచక్కా దాన్ని డీసీఎంలో లోడ్ చేసి దర్జాగా తీసుకెళ్లారు. గ్రామస్థులు వచ్చి అడిగినా ఏమాత్రం తడబడకుండా 'ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం దీన్ని తొలగిస్తున్నాం" అని సమాధానం చెప్పారు. దీంతో వారు కూడా పట్టించుకోలేదు. అయితే మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేసిన తర్వాత వచ్చింది ఇరిగేషన్ అధికారులు కాదు, దొంగలు అని తెలిసింది. దీంతో స్థానికులు సహా ప్రభుత్వ అధికారులు కూడా అవాక్కయ్యారు.

దొంగలు దర్జాగా ఇనుమునంతా పట్టపగలే లారీల్లో ఎక్కించుకెళ్లారని, అడిగితే అధికారులం అని చెప్పారని, బ్రిడ్జి కూలగొట్టేందుకు ఆర్డర్లు ఉన్నాయన్నారని స్థానికులు చెప్పారు. వారంతా దొంగలని తెలిశాక నమ్మలేకపోతున్నాం అని పేర్కొన్నారు. కాంక్రీటు బ్రిడ్జికి 25 అడుగులు సమాంతరంగా 50 ఏళ్ల నాటి ఐరన్​ బ్రిడ్జి ఉందని చెప్పారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నాయి.

ఆరా కెనాల్​పై నిర్మించిన ఈ బ్రిడ్జి పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేది. అయితే శిథిలావస్థకు చేరిన కారణంగా ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు కూడా అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు దర్జాగా బ్రిడ్జిని దోచుకున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన అనంతరం ఇరిగేషన్​ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఎఫ్​​ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:'భాజపా వల్ల దేశంలో చీలిక.. త్వరలో ఉక్రెయిన్ తరహా పరిస్థితులు!'

ABOUT THE AUTHOR

...view details