ETV Bharat / sukhibhava

మధుమేహానికి మెంతులతో రక్ష!

author img

By

Published : Dec 7, 2021, 11:31 AM IST

మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ మెంతులు ఉపయోగపడుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక పేర్కొంటోంది. మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్‌ అనే అమైనో ఆల్కనాయిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచటంతో పాటు కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించేలా చూస్తుంది.

menthulu for diabetes
మధుమేహానికి మెంతులతో రక్ష!

మెంతులు ప్రతి వంటింట్లోనూ ఉండేవే. ఇవి వంటకాల రుచిని పెంచటానికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని ప్రాచీన కాలం నుంచి ఔషధంగా వాడటం తెలిసిందే. మెంతుల్లో ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, రాగి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీసుతో పాటు ఎ, బి6, సి, కె విటమిన్ల వంటి పోషకాలెన్నో ఉంటాయి.

మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ మెంతులు ఉపయోగపడుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక పేర్కొంటోంది. వీటిల్లో నీటిలో కరిగే పీచు దండిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను, పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదింపజేస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. ఫలితంగా గ్లూకోజు మోతాదులు అదుపులో ఉంటాయి. మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్‌ అనే అమైనో ఆల్కనాయిక్‌ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచటంతో పాటు కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించేలా చూస్తుంది. ఇన్సులిన్‌ను ప్రేరేపించే గుణం గల 2-ఆక్సోగ్లుటేట్‌ అణువులు సైతం మెంతుల్లో ఉంటాయి. ఇవన్నీ గ్లూకోజు అదుపులో ఉండటానికి తోడ్పడేవే. ఇక వీటిల్లోని సోపోనిన్సు రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ దోహదం చేస్తాయి. మెంతుల పొడిని నేరుగా కూరల్లో వాడుకోవచ్చు. పిండిలో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి వాటిని వడగట్టి, నీళ్లు తాగొచ్చు. వేడి నీటిలో 10 నిమిషాల సేపు మెంతులను వేసి మూతపెట్టి, తర్వాత వడగట్టి తాగొచ్చు. కావాలంటే మెంతులతో టీ కూడా కాచుకొని వేడివేడిగా తీసుకోవచ్చు.

ఇదీ చూడండి:- ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.