ETV Bharat / state

కేటీఆర్ చెప్పిన ఉద్యోగ మంత్ర.. 'ముందు ఫోన్లు బంజేయుండ్రి'

author img

By

Published : Jun 15, 2022, 6:41 PM IST

KTR Inspiring Words: మూడు నెలలు కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమి కాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సెల్​ఫోన్లను పక్కకు పెట్టి శ్రద్ధగా చదవాలని నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపారు. టాలెంట్​ ఉన్న వ్యక్తికి అవకాశాలకు కొదవలేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా... చింతించ్చవద్దన్న ఆయన... ప్రైవేటులోనూ విస్తారంగా అవకాశాలున్నాయని తెలిపారు.

KTR
KTR

కేటీఆర్ చెప్పిన ఉద్యోగ మంత్ర.. 'ముందు ఫోన్లు బంజేయుండ్రి'

KTR Inspiring Words: నిరంతరం రాజకీయాలతో బిజీబిజీగా ఉండే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇవాళ తనలో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగుల్లో ఆయన స్ఫూర్తి నింపారు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో కేటీఆర్‌ ప్రేరణ పాఠం చెప్పారు. ముస్తాబాద్ ప్రభత్వ కళాశాలలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేటీఆర్‌.. వారిలో స్ఫూర్తిని నింపారు. లక్షలాది మంది పోటీపడుతున్న పరీక్షల్లో విజేతలుగా నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు. ప్రిపరేషన్ సమయంలో సెల్​ఫోన్​లను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియమకాలు కలసాకారం చేసుకున్నామని కేటీఆర్​ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. నీళ్లు సాధించుకోవడంతో పాటుగా మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వివరించారు.

దేశంలో భౌగోళికంగా తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రం. జనాభా ప్రాతిపదికన తెలంగాణ 12వ పెద్ద రాష్ట్రం. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణది 4వ స్థానం. అభివృద్ధికి ప్రామాణికాలు తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్ష 24 వేలుగా ఉంటే... ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం రూ.2లక్ష 78 వేలుగా ఉంది. దేశ సగటు తలసరి ఆదాయం రూ.లక్ష 49వేలు. 2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ఆదాయం రూ.5లక్షల కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ఆదాయం రూ.11లక్షల55వేల కోట్లు. దేశ జనాభాలో తెలంగాణది 2.5 శాతం ఉంది. దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం తోడ్పాటునందిస్తోంది. -- కేటీఆర్, మంత్రి

నియామకాల కోసం టీఎస్‌ఐపాస్‌ ద్వారా ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ఆహ్వానించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనూ నియామకాలు చేపడుతున్నామన్న ఆయన... ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు. ప్రైవేటు రంగంలో అవకాశాలు ఉన్నాయని మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. చదువు, నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదని చెప్పారు.

వాళ్లు, వీళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదని ఊర్లో కూర్చుని... వాట్సప్‌ చూసుకుంటూ ముచ్చట్లు పెడితే నడవదు. మంత్రి, ఎమ్మెల్యే చెబితే ఉద్యోగాలు ఇవ్వరు. మీ నైపుణ్యం పరిశ్రమకు ఉపయోగపడుతుందా? లేదా? అని చూసుకుని ఉద్యోగాలు ఇస్తారు. జీవితంలో రాణించేందుకు ఏకైక మంత్రం 'స్కిల్‌, అప్‌స్కిల్‌, రీ స్కిల్‌' టాలెంట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.. లేదంటే అవుట్‌డేట్ అవుతారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే... అప్డేట్‌ కాకుంటే అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ ఉద్యోగంలోకి తీసుకున్నా.. పదోన్నతులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషం. రాకుంటే ఏదో అయిపోయిందని భయపడి, బాధపడకండి. -- కేటీఆర్, మంత్రి

జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే పరమావధి కాదని చెప్పారు కేటీఆర్. టాలెంట్‌ ఉంటే ఆకాశమే హద్దు... ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయని మరోమారు ఉద్యోగార్థులకు వివరించారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు ఈ మూడు నెలలు శ్రమించాలని సూచించారు. ఈ మూడు నెలలు చదువుపై శ్రద్ధ పెట్టాలన్న ఆయన... మిగతా పనులు, ఫోన్లు పక్కకు పెట్టాలని తెలిపారు.

మోదీ 10లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తున్నారు. ఐదారు రోజుల కింద మనం డిమాండ్‌ చేశాం. మోదీ ముందుకు వచ్చినందుకు సంతోషం. స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. కొత్తగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8 ఏళ్లలో 19 వేల పరిశ్రమలు, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. కేంద్ర ప్రభుత్వ ప‌రిధిలో 16 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని వారం రోజుల క్రితం లేఖ రాశాను. 10 లక్షలు ఉద్యోగాలు రెండేళ్లలో భర్తీ చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు ఆకాశమే హద్దు. -- కేటీఆర్, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.