ETV Bharat / state

తుది అంకానికి మునుగోడు ప్రచార పర్వం.. తెరవెనుక మంత్రాంగానికి పార్టీల ప్రాధాన్యం

author img

By

Published : Oct 30, 2022, 8:32 AM IST

Munugode Bypoll Campagain: రోడ్ షోలు...! ఇంటింటిటి ప్రచారాలు..! విమర్శలు.. ప్రతివిమర్శలు..! ఇప్పటివరకు మునుగోడులో ప్రచారం జరుగుతున్నతీరిది. ఐతే ఈ ప్రచారం ఎల్లుండితో ముగియనుండటంతో ప్రధానపార్టీలు రూట్ మారుస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు తెరలేపాయి. మైక్ మూతపడగానే మనీ, మద్యం పంపిణీ చేసే ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందజేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Munugode Bypoll
Munugode Bypoll

తుది అంకానికి మునుగోడు ప్రచార పర్వం.. తెరవెనుక మంత్రాంగానికి పార్టీల ప్రాధాన్యం

Munugode Bypoll Campagain: ప్రధాన పార్టీలైనా తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక.. ప్రచారం నవంబరు ఒకటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. గడువు తేదీ వరకు ప్రచారం హోరెత్తిస్తూనే... క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇన్నాళ్లు రోడ్‌షోలు, ఇతరత్రా బహిరంగ కార్యక్రమాలు, సర్పంచి, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టిన నాయకులు తాజాగా భారీ సభలు కాకుండా తెరవెనుక మంత్రాంగానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉండటంతో గ్రామాల్లో ఎదుటి పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయనే లెక్కలతో పాటూ ప్రత్యర్థి పార్టీ ఓటర్లను పోలింగ్‌బూత్‌కు తీసుకెళ్లే నాయకులపై దృష్టి సారించారు. బూత్, గ్రామ, క్లస్టర్ల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారు ఇన్ని రోజుల ప్రచార సరళిని క్రోడీకరిస్తున్నారు. రాత్రి వేళల్లో బూత్‌ స్థాయిలో ప్రతి ఓటరుకు మద్యం పంపిణీని ప్రధాన పార్టీలు రెండు రోజుల నుంచి తప్పనిసరి చేశాయి. ప్రతి బూత్‌కు నిత్యం గ్రామంలో సుమారు లక్ష వరకు ఖర్చు చేస్తుండగా... శనివారం నుంచి ఆ ఖర్చును రెట్టింపు చేశాయి. నారాయణపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో పురుషులకు ఒక క్వార్టర్‌ మద్యం సీసా, మహిళలకు కూల్‌డ్రింక్‌ను శనివారం మధ్యాహ్నం నుంచే పంపిణీ చేస్తున్నారు. చౌటుప్పల్‌ మండలంలోని రెండు గ్రామాల్లో సంబంధిత ఇన్‌ఛార్జ్‌ శుక్రవారం నుంచి కుటుంబానికి ఒక ఫుల్‌బాటిల్‌ చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో అదే గ్రామంలో మరో పార్టీ కుటుంబానికి ఆఫ్‌ మద్యం సీసాను పోటీగా పంపిణీ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు రోజు వరకు ఉంటుందని ఆయా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో వివిధ పార్టీల్లోని ప్రధాన నాయకుల వద్దకు మద్యం డంప్‌లు చేరుకున్నాయి. మర్రిగూడ మండలంలో ఓ ప్రధాన పార్టీ ముఖ్య నేత బస చేస్తున్న ప్రాంతం నుంచి శనివారం మధ్యాహ్నం నుంచే వివిధ ప్రాంతాలకు మద్యం తరలించారని తెలిసింది. మద్యంలో ముంచుత్తుతూనే... ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడానికి ప్రధాన పార్టీలన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటూ స్థానిక పోలీసులు, ఎన్నికల పరిశీలకులు నగదు పంపిణీపై నిఘా వేయడంతో... డబ్బులను ఎలా పంపిణీ చేయాలనే దానిపై శనివారం ఓ ప్రధాన పార్టీ బూత్‌స్థాయి ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది.

దీనిపై సదరు పార్టీ ముఖ్యుడొకరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఎవరికి అనుమానం రాని, పార్టీకి సంబంధించి సామాన్య కార్యకర్తల వద్ద రెండు ప్రధాన పార్టీలు 10 లక్షలకు తక్కువ కాకుండా దాచాయని ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచే ఈ రెండు రోజుల్లో గ్రామాల్లోకి చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మరో ప్రధాన పార్టీ ఆరోపిస్తుంది. పోలింగ్‌కు ముందు రోజు మద్యం, నగదు పంపిణీపై భారీ నిఘా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఓటర్లకు డబ్బులివ్వాలని ఓ ప్రధాన పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీ ఇచ్చే మొత్తం కంటే కొంచెం ఎక్కువగా ఇద్దామనే భావనలో మరో పార్టీ ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రచారం ముగిసిన రోజు నుంచే ఓటర్లకు డబ్బుల పంపిణీని ప్రారంభిస్తేనే ఫాయిదా ఉంటుందని... కానీ ఆ పార్టీ వారు ఎంతిస్తారో తేలాకే మొదలుపెట్టాలని ఓ పార్టీ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.