ETV Bharat / state

పొలం దారి మాయం.. మా భూమికి దారేదంటూ అన్నదాతల ఆవేదన

author img

By

Published : Apr 7, 2023, 2:15 PM IST

Farmers facing problems in Khammam: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురంలో తాతలు, తండ్రుల కాలం నుంచి వారసత్వంగా సంక్రమించిన భూముల్లో దశాబ్దాలపాటు పంటలు పండించిన గిరిజన రైతులు సాగును వదిలేసి కూలీ పనులకు వెళ్తున్నారు. అధికారుల నిర్వాకమో.. ఆన్‌లైన్‌ తప్పిదమో కానీ.. వారి పొలాలకు వెళ్లే దారి మూసుకుపోవడంతో రెండేళ్లుగా ఆ రైతుల పంట భూములన్నీ బీళ్లుగా మారిపోయాయి. సాగు భూముల్లోకి వెళ్లేందుకు దారి చూపండంటూ ఆ రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

farmers facing problems
సాగు భూమికి దారిలేక ఇబ్బంది పడుతున్న రైతులు

సాగు భూముల్లోకి వెళ్లేందుకు దారిలేక గిరిజన రైతుల అవస్థలు

Farmers facing problems in Khammam: ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం తిరుమలాపురం తండాకు చెందిన 50 మంది గిరిజన రైతులకు దాదాపు 70 ఎకరాల వరకు వ్యవసాయ భూములున్నాయి. వీరిలో చాలామందికి ఈ వ్యవసాయ భూములు వారి తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. కొంత భూమిని మాత్రం ఇతరుల వద్ద కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. అయితే.. రెండేళ్లుగా వీరు పంట పొలాల్లోకి వెళ్లే దారిని కొందరు పరిసర భూముల రైతులు మూసేశారు. దీంతో గిరిజన రైతులు తమ పొలాల్లోకి వెళ్లి సాగు చేసుకునేందుకు దారిలేక ఇబ్బందులు పడుతున్నారు.

70ఎకరాల భూమికి దారిలేదు: తిరుమలాపురం తండాలో 1927 నాటి నక్షాలో వీరి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు డొంకదారి ఉండేది. ఈ దారి ద్వారానే 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూముల‌్లోకి రైతులు వెళ్లేవారు. కానీ రెండేళ్లుగా ఆ డొంకదారి కనుమరుగైంది. తరతరాలుగా తమ కుటుంబాలు నడిచిన డొంక దారి ఒక్కసారిగా కనుమరుగవడంతో గిరిజన రైతులు ఆందోళన బాట పట్టారు. రెండేళ్లుగా తమ భూముల్లోకి వెళ్లనీయకుండా కొందరు అడ్డుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదులు చేశారు.

30అడుగుల డొంకదారి మూసివేశారు: తాజా నక్షాల్లో ఆ భూములకు దారి లేదని అధికారులు గుర్తించడంతో గిరిజన రైతుల సమస్య మరింత జఠిలంగా మారింది. దీంతో గిరజన రైతులు సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర భూములు, సర్వే కార్యాలయాల్లో 1927 నాటి నక్షాను సాధించారు. అందులో గ్రామకంఠం భూమి, 30 అడుగుల డొంకదారి ఉన్న సంగతిని రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రైతులంతా కరపత్రాలు వేయించి, ఆందోళనకు దిగారు.

దారి మూసివేసిన రైతులు స్థానికంగా అందుబాటులో లేరు: తాజా నక్షా ప్రకారం ఆ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు దారిలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. డొంకదారిని మూసేసిన రైతులు స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ వ్యవసాయ భూముల్లోకి తాము వెళ్లేందుకు దారి చూపాలని గిరిజన రైతులు వేడుకుంటున్నారు.

"మాకు ఉన్న నక్షాదారిలో ఆ ప్రదేశం లేనందున బాట చేయలేకపోయాం. స్థానికంగా ఉన్నమరికొంత మంది రైతులు గ్రామ కంఠాన్ని ఆక్రమించారు. దీనిపై చర్యలు తీసుకోమని దారిలేని రైతులు మమ్మల్ని కోరారు. దీంతో ఆక్రమించుకున్న రైతలకు నోటీసులు ఇచ్చాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిచర్య లేదు. నోటీసులో ఇచ్చిన సమయం అవ్వగానే వారిపై యాక్షన్​ తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఆ రైతులకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం." - ధార ప్రసాద్, తహసీల్దార్, నేలకొండపల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.