ETV Bharat / state

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ: బండి సంజయ్‌

author img

By

Published : Apr 15, 2022, 8:31 PM IST

Updated : Apr 16, 2022, 6:00 AM IST

Bandi Sanjay: 'కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారంటే అది భాజపా ఫలితమే'
Bandi Sanjay: 'కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారంటే అది భాజపా ఫలితమే'

Bandi Sanjay: ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్‌ను బయటకు రప్పించింది భాజపానేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారంటే అది భాజపా ఫలితమేనన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించే సమయం వచ్చిందన్న సంజయ్​.. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Bandi Sanjay: పన్నెండొందల మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస నేతలు లిక్కర్‌, భూమి, ఇసుక, డ్రగ్‌ మాఫియాలుగా మారి జలగల రూపంలో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో కేసీఆర్‌ డబ్బులను ఎత్తిపోసుకున్నారని విమర్శించిన ఆయన ఉద్యమ సమయంలో ప్రస్తావించిన ఆర్డీఎస్‌ పథకాన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత ఆధునికీకరించలేదు కానీ.. గోదావరి నుంచి కాళేశ్వరం పథకంతో తన ఫాంహౌస్‌కు నీళ్లు ఎత్తిపోసుకున్నారని ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం ఇమాంపూర్‌ నుంచి లింగనవాయి వరకు సాగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో రోజు ప్రజాసంగ్రామ యాత్రŸలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్‌ పథకం తీసుకొస్తే కేసీఆర్‌ ప్రభుత్వం మోకాలడ్డుతోందన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. మహిళా సంఘాలకు కేంద్రమే రుణాలిస్తోందని, కరోనా రోజుల నుంచి పేదలకు ఉచితంగా అయిదు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.

పచ్చని పాలమూరు ఎక్కడుందో కేటీఆరే చెప్పాలి: బండి సంజయ్‌
పాలమూరు పచ్చగా ఎక్కడ ఉంది?: బండిసంజయ్‌‘పచ్చగా ఉన్న పాలమూరు జిల్లాలో చిచ్చు పెడుతున్నానని అంటున్నారు.. పాలమూరు పచ్చగా ఉంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు, వలసలు, సాగునీటి సమస్యలు ఎందుకుంటాయి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. పాలమూరు పచ్చగా ఎక్కడ ఉందన్నారు. ఉండవల్లి మండల కేంద్రంలో రాత్రి ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యం ఉచితంగా అమలు చేస్తామన్నారు.

వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు..
వచ్చే నెల నుంచి ప్రజలకు కరెంటు షాక్‌ తెలుస్తుందని సంజయ్‌ అన్నారు. పెంచిన ఛార్జీలతో బిల్లులు రెండింతలు కాబోతున్నాయన్నారు. డిస్కంలకు రూ.60 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదని, అందుకే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును ఏడు గంటలకు పరిమితం చేశారన్నారు.

ప్రజా సమస్యలు వింటూ..
పాదయాత్ర మధ్యలో ఉపాధి హామీ పథకం కూలీలతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముచ్చటించారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించగా లేదని వారు చెప్పారు. అనంతరం లింగనవాయి గ్రామ ఆంజనేయస్వామి ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. యాత్రలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్‌లో ప్రకంపనలు: లక్ష్మణ్‌
ప్రజా సంగ్రామయాత్ర రెండో రోజే ప్రగతిభవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోందని..సంజయ్‌ యాత్ర గురించి కేటీఆర్‌ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో కలిసి శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా పెంచేలా ట్రైబ్యునల్‌ ముందు బలంగా వాదనలు వినిపించడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందన్నారు. తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌..మూడు ఒక్కటేనని.. ప్రశాంత్‌కిశోర్‌ ప్రయత్నాలన్నీ తెరాసను, కాంగ్రెస్‌ను కలిపేందుకేనని.. అది ఎన్నికలకు ముందా? ఫలితాల తర్వాతా? అన్నదే తేలాలని చెప్పారు.

బండి సంజయ్‌ పాదయాత్ర రెండో రోజు ఉండవల్లి మండలం కంచుపాడులో ముగిసింది. ఇవాళ 11 కిలోమీటర్ల మేర సాగింది. ఇమాంపూర్‌ నుంచి లింగనవాయి, డి.బూడిదపాడు మీదుగా పాదయాత్ర సాగింది. రేపు కంచుపాడు నుంచి మూడో రోజు పాదయాత్ర ప్రారంభంకానుంది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 16, 2022, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.