ETV Bharat / state

NIRF RANKINGS: దిగజారిన రాష్ట్ర విద్యాసంస్థల ర్యాంకులు

author img

By

Published : Sep 10, 2021, 8:10 AM IST

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో రాష్ట్రంలోని విద్యాసంస్థల స్థానం పడిపోయింది. ఓవరాల్‌, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఒక్క ఐఐటీహెచ్‌ తప్ప మిగిలిన అన్ని సంస్థల ర్యాంకులు గత ఏడాదితో పోలిస్తే దిగజారాయి. ఓవరాల్‌ విభాగంలో మొత్తం 100 స్థానాల్లో తెలంగాణ నుంచి నాలుగు సంస్థలు చోటుదక్కించుకోగా.. వాటిలో మూడు కేంద్రీయ విద్యాసంస్థలే.

NIRF RANKINGS
NIRF RANKINGS

నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో ఐఐటీ హైదరాబాద్‌ 17 నుంచి 16వ స్థానానికి ఎగబాకింది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(హెచ్‌సీయూ) 17, ఓయూ 62, ఎన్‌ఐటీ(వరంగల్‌) 59వ ర్యాంకు సాధించాయి. హెచ్‌సీయూ, ఓయూ, ఎన్‌ఐటీలు నిరుటితో పోలిస్తే తక్కువ స్కోర్లు పొందాయి. ఈసారి కొత్తగా పరిశోధన విభాగంలో ర్యాంకులు కేటాయించగా ఐఐటీహెచ్‌ 15వ, హెచ్‌సీయూ 25వ స్థానాల్లో నిలిచాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో 8వ ర్యాంకు సాధించిన ఐఐటీహెచ్‌.. వరుసగా ఆరో సంవత్సరం దేశంలో మొదటి పది స్థానాల్లో నిలవడం విశేషం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2021 ఆరో ఎడిషన్‌ ర్యాంకింగ్‌లను గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేశారు. ఐఐటీ మద్రాస్‌ వరుసగా మూడో ఏడాది దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ)కి రెండో స్థానం లభించింది. దేశంలో 10 అత్యుత్తమ విద్యాసంస్థల్లో 7 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లే కావడం విశేషం.

పరిశోధన, ప్రాజెక్టులో మరింత కృషి అవసరం

‘ర్యాంకింగ్‌ విషయాన్ని చాలా రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మనం కూడా మరింత పట్టుదలగా పనిచేయాలి. ముఖ్యంగా పరిశోధన, ప్రాజెక్టుల్లో మరింత కృషి చేయాలి’ అని హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలోని విద్యాసంస్థల స్థానాలు...

విద్యాసంస్థల వివరాలు

ఇతర విభాగాల్లో రాష్ట్ర విద్యాసంస్థల స్థానం

  • ఫార్మసీ విద్యలో నైపర్‌ 6వ, అనురాగ్‌ వర్సిటీ 61, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ 72వ ర్యాంకు సాధించాయి.
  • మేనేజ్‌మెంట్‌ విద్యలో హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ 27, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ 63వ స్థానంలో నిలిచాయి.
  • కళాశాలల విభాగంలో హైదరాబాద్‌ బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాల 85వ స్థానాన్ని దక్కించుకుంది.
  • న్యాయ విద్యలో నల్సార్‌ 3వ, ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ 29వ స్థానాన్ని సాధించాయి.
  • దంత వైద్య విద్యలో ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ 30వ స్థానంలో నిలిచింది.
  • ఆర్కిటెక్చర్‌లో కూడా 25 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యాసంస్థ ఒక్కటీ లేదు.
  • మెడికల్‌ విభాగంలో 50 స్థానాలను ప్రకటించగా రాష్ట్రం నుంచి ఒక్క కళాశాలకూ చోటుదక్కలేదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా వైద్యకళాశాల సహా గాంధీ, కాకతీయ వైద్యకళాశాలలు తొలి 50 స్థానాల్లో చోటు పొందలేకపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంలో ఈఎస్‌ఐ సహా మొత్తం 10 వైద్యకళాశాలలుండగా.. ప్రైవేటులో 18, మైనారిటీలో 4 వైద్య కళాశాలలున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కళాశాలలు వేర్వేరు కారణాల వల్ల నిర్దిష్ట ప్రొఫార్మా ప్రకారం వివరాలు పంపించే విషయంలో స్పందించకపోయి ఉండవచ్చని.. అందువల్లే ర్యాంకులకు పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చని వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు.

అత్యుత్తమ ‘పది’ ఇవే

  • 1.ఐఐటీ మద్రాస్‌ 2.ఐఐఎస్‌సీ బెంగళూరు 3.ఐఐటీ బాంబే 4.ఐఐటీ దిల్లీ 5.ఐఐటీ కాన్పూర్‌ 6.ఐఐటీ ఖరగ్‌పుర్‌ 7.ఐఐటీ రూర్కీ, 8.ఐఐటీ గువాహటి, 9.జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ 10.బనారస్‌ హిందూ యూనివర్సిటీ
  • ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి ఏడు స్థానాలు వరుసగా మద్రాస్‌, దిల్లీ, బాంబే, కాన్పూర్‌, ఖరగ్‌పుర్‌, రూర్కీ, గువాహటి ఐఐటీలు చేజిక్కించుకున్నాయి. ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా ఐఐటీహెచ్‌, ఎన్‌ఐటీ (తిరుచిరాపల్లి), ఎన్‌ఐటీ (కర్ణాటక) నిలిచాయి.
  • విశ్వవిద్యాలయాల విభాగంలో తొలిస్థానం ఐఐఎస్‌సీ (బెంగళూరు) సొంతం చేసుకోగా, రెండు మూడు స్థానాలు జవహర్‌లాల్‌ నెహ్రూ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు అందుకున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 24వ స్థానం దక్కింది. పరిశోధన సంస్థల ర్యాంకింగ్స్‌లోనూ ఐఐఎస్‌సీ తొలి స్థానంలో నిలవడం విశేషం.
  • కళాశాలల విభాగంలో తొలి ర్యాంక్‌ దిల్లీకి చెందిన మిరండా హౌస్‌ను వరించింది. రెండు, మూడు స్థానాలను లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ (దిల్లీ), లయోలా కాలేజ్‌ (చెన్నై) దక్కించుకున్నాయి. 34వ ర్యాంక్‌లో ఆంధ్ర లయోలా కాలేజ్‌ నిలిచింది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో తొలి మూడు ర్యాంక్‌ల్లో వరుసగా అహ్మదాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా ఐఐఎంలు సొంతం చేసుకున్నాయి.
  • ఫార్మసీలో దిల్లీకి చెందిన జామిమా హమ్‌దర్ద్‌కు అగ్రస్థానం లభించగా, రెండు మూడు ర్యాంకులను పంజాబ్‌ యూనివర్సిటీ (చండీగఢ్‌), బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (బిట్స్‌) సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌కు 30వ స్థానం లభించింది.
  • వైద్య కళాశాలల విభాగంలో దిల్లీ ఎయిమ్స్‌ తొలి ర్యాంక్‌లో నిలవగా, రెండు మూడు ర్యాంకులను చండీగఢ్‌కు చెందిన పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, తమిళనాడులోని వెల్లూర్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ దక్కించుకున్నాయి. దంత వైద్య కళాశాలల్లో కర్ణాటక ఉడుపికి చెందిన మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ మొదటి ర్యాంకు సాధించింది.

ఇదీ చూడండి:HIGH COURT: 'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.