ETV Bharat / state

HIGH COURT: 'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

author img

By

Published : Sep 9, 2021, 10:55 AM IST

Updated : Sep 9, 2021, 3:05 PM IST

గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

10:54 September 09

HIGH COURT: 'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

    గణేశ్​ ఉత్సవాలు, మండపాల నిర్వహణ, నిమజ్జనంపై హైకోర్టు (High court) ఆంక్షలు విధించింది. ఆంక్షలు, నియంత్రణ చర్యలను అమలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సేన్​సాగర్​లో గణేశ్​, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై రిజర్వ్ చేసిన తీర్పును ధర్మాసనం ఇవాళ వెల్లడించింది.

హెచ్ఎండీఏ పరిధిలో 25 కుంటలు...  

హుస్సేన్​సాగర్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతినిచ్చింది. ట్యాంక్​బండ్ వైపు విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు... పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వైపు నుంచి చేసుకోవచ్చునని తెలిపింది.  

రబ్బర్ డ్యాం...  

హుస్సేన్​సాగర్​లో ప్రత్యేక రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. దూర ప్రాంతాల నుంచి ఒకే రోజున హుస్సేన్​సాగర్​కు వెళ్లకుండా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు పేర్కొంది. చిన్న చిన్న విగ్రహాలను ఇళ్లల్లోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని ఆదేశించింది. నిమజ్జనం రోజున జీహెచ్ఎంసీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ఉత్సవాల్లో లౌడ్ స్పీకర్లను అనుమతించవద్దని తెలిపింది. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎప్పటిలాగే వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  

పర్యావరణహితం...  

వినాయక విగ్రహాలు, మండపాల ఏర్పాటు, నిర్వహణలోనూ హైకోర్టులో నియంత్రణ విధించింది. చిన్న, పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా గణేశ్​ మండపాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేసింది. మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా నియంత్రించాలని పోలీసులను ఆదేశించింది. వినాయక దర్శనం, పూజలు, ఉత్సవాలను ఆన్​లైన్, సామాజిక మాధ్యమాలు, స్థానిక కేబుల్ టీవీల ద్వారా ప్రోత్సహించాలని తెలిపింది. విద్యార్థులు, వృద్ధులకు ఇబ్బంది తలెత్తకుండా రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైకులను అనుమతించవద్దని స్పష్టం చేసింది. మండపాల వద్ద నిర్వాహకులు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది.  

మార్గదర్శకాలు అమలయ్యేలా...

వచ్చే ఏడాది వినాయక చవితికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం స్పందించకపోతే సీపీసీబీ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వేణుమాధవ్ పిటిషన్​లోని అంశాల ఆధారంగా సుమోటోగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కరోనా విపత్తు, జల, ధ్వని కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు, నియంత్రణ చర్యలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: HIGH COURT: 'నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది'

Last Updated :Sep 9, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.