ETV Bharat / international

'ఆ బడిలో రహస్యంగా చదువుకున్నా - శరణార్థుల కష్టాలు నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?' - Aksana Soltan

author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 3:51 PM IST

Aksana Soltan Story : శరణార్థుల కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించిన వారి కంటే ఎక్కువగా మరెవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదు. స్వేచ్ఛ, హక్కుల విలువ సాధారణ ప్రజల కంటే వారికే బాగా తెలుసు. అలా కొన్నేళ్ల పాటు కూటి కోసం, గూటి కోసం పరితపించిన ఓ శరణార్థి అమ్మాయి, తనలాంటి వాళ్ల కష్టాలకు చరమగీతం పాడాలనుకుంది. ఇందుకు చదువు ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది అఫ్గానిస్తాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ లాయర్‌ అక్సానా సోల్టాన్‌. ఇప్పుడు అదే ఆమెను ఫోర్బ్స్‌ తాజా 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో చేర్చింది. ఆమెకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Aksana Soltan
Aksana Soltan (ETV Bharat)

Aksana Soltan Special Story : 'మాది అఫ్గానిస్తాన్‌లోని మజర్‌-ఎ-షరీఫ్‌ ప్రాంతం. మా తల్లిదండ్రులకు మొత్తం నలుగురు సంతానం. అందులో నేను చిన్నదాన్ని. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఓ అక్క ఉంది. మా నాన్న ఇంజినీర్​​. నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న రోజులవి. బయట తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోందని మారుతున్న మా ఇంటి వాతావరణంతో అర్థమవుతోంది. ఇద్దరు అన్నయ్యలు స్కూల్‌కు వెళ్తుంటే, మా అక్క, నేను వాళ్లకు క్యారేజీలు కట్టిచ్చేవాళ్లం. నాకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెలా మా జీవితం కాకూడదని నిశ్చయించుకుంది. అంతే ఒక పాత సంచిలో కొన్ని పుస్తకాలు పెట్టి, నాకు మా అన్నయ్య డ్రస్‌ వేసి భయంభయంగా ఒక చోటుకి తీసుకెళ్లింది. అండర్‌ గ్రౌండ్‌లో నల్లటి కర్టెన్లతో ఉన్న ఆ చోటును చూసి మొదట్లో చాలా భయం వేసింది. కాసేపటి తర్వాత నాలాంటి అమ్మాయిలు మరికొందరు అక్కడ కనిపించారు.

అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. అదొక ఆడపిల్లల స్కూల్​ అని. అక్కడ ఇద్దరు టీచర్లు ఉండగా, అందులో మా అమ్మ ఒకరు. ఈ రహస్య పాఠశాలకు నేను, మా అక్క అన్నయ్యల దుస్తులు వేసుకుని అబ్బాయిల్లా వెళ్లేవాళ్లం. వేర్వేరు దారుల్లో, వేర్వేరు సమయాల్లో మాత్రమే బడికి పోయేవాళ్లం. అలా చేస్తే ఇద్దరిలో ఒక్కరైనా దక్కుతారని మా అమ్మ ఆశ. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ మా అమ్మ 'ఆడపిల్లకు పుస్తకమే ఆయుధం' అని ధైర్యం చెప్పి పంపించేది. నాతో సహా ఆ బడికి వచ్చే 50 మంది ఆడపిల్లలూ ప్రతిరోజూ ప్రాణాలు పణంగా పెట్టి వచ్చేవాళ్లం. కుర్చీలు, బల్లలు ఉండవు అక్కడ. అందరూ గుండ్రంగా కూర్చుని చప్పుడు చేయకుండా చదువుకునే వాళ్లం. రోజులు గడుస్తున్న కొద్దీ తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. దాంతో నాన్న జేబులో ఉన్న 2 డాలర్ల డబ్బుతో మా కుటుంబం మొత్తం దేశం దాటింది.

అమెరికాకు శరణార్థుల దండు.. కాలినడకనే పయనం.. టార్గెట్ అదే!

శరణార్థిగా : మొదట తజికిస్తాన్‌ శరణార్థి శిబిరంలో చేరాం. అక్కడ తిండి లేదు. మందులు లేవు, కరెంట్‌ సౌకర్యం లేదు. చదువు అసలే లేదు. నా చుట్టూ ఉన్న క్యాంపుల్లో మా లాంటి పిల్లలు చనిపోవడం మొదట్లో భయంగా అనిపించినా, తర్వాత సాధారణం అనిపించింది. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌ వెళ్లాం. కాస్త అటూ, ఇటూగా అక్కడా అదే పరిస్థితి. అమ్మకొచ్చిన కుట్టు పని మమ్మల్ని పస్తులు ఉండకుండా అంతవరకూ కాపాడింది. నాన్న యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీలో మా కుటుంబాన్ని రిజిస్టర్‌ చేయించారు. దాంతో మా చదువులకు యునిసెఫ్‌ సాయం అందింది. అదే మా జీవితంలో వచ్చిన మంచి మార్పు. మాతో సహా మరో నలభై మందికి అమెరికాలో ఉండే అవకాశం వచ్చింది. 12 ఏళ్ల వయసులో రిచ్‌మండ్‌కి చేరుకున్నా. అక్కడ చదువుకుంటున్నా అన్న మాటే కానీ నా ఆలోచనల్లోంచి శరణార్థి జీవితం తాలూకు చేదు అనుభవాలు తొలగిపోలేదు.

అందుకే 15 ఏళ్లకే 'ఎన్‌హాన్సింగ్‌ చిల్ట్రన్స్‌ లైవ్స్‌' అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. చదువుకోవాలని ఉన్నా వీలుకాని ఎంతో మంది ఆడ పిల్లలకు కనీస విద్యావసరాలు తీర్చడం మా సంస్థ లక్ష్యం. అలా ఐరాస సాయంతో రిచ్‌మండ్, వర్జీనియా సహా హైతీ, అఫ్గానిస్తాన్‌ వరకూ మా సేవలు విస్తరించాయి. చదువుకునే ఆడ పిల్లలకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, షూస్, స్టేషనరీ అందించే వాళ్లం. ఇక శరణార్థి పిల్లల కోసం అయితే మా సంస్థ వాలంటీర్లు స్వయంగా క్యాంపులకే వెళ్లి ట్యూషన్లు చెబుతారు. వాల్‌ మార్ట్‌ సాయంతో అఫ్గానిస్తాన్‌లో ఒక లైబ్రరీ, బుక్‌స్టోర్‌ ప్రారంభించా. ఈ ప్రయత్నం అక్కడ 6వేల మంది ఆడవాళ్లను చైతన్యవంతులను చేసింది. వీరికి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు సౌరశక్తితో నడిచే టెక్నాలజీ వాడుకుంటున్నాం.

ఈ పాఠాలతో ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది ఆడపిల్లలు అక్షర చైతన్యం పొందుతున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 2,500 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. తాలిబన్ల కారణంగా మహిళలుగా ఏ హక్కుల్ని కోల్పోయామో నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు? అందుకే రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్‌ వెల్త్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ జస్టిస్‌ చదివా. ప్రస్తుతం హ్యూమన్‌ రైట్స్‌ లాయర్‌గా పని చేస్తున్నా. ప్రపంచానికి మా మహిళల గొంతుక వినిపించాలన్నదే నా లక్ష్యం. అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండిపోవడం నాకిష్టం లేదు. అందరి సహకారంతో అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలన్నది నా ఆశయం.'

అఫ్గాన్​ నుంచి వచ్చేవారికి అమెరికా సాయం- ఒక్కొక్కరికీ ఎంతంటే...

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తారా?.. భారత్​ జవాబు ఇలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.