ETV Bharat / state

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్‌ న్యాబ్‌ బలోపేతానికి అధికారుల ప్రణాళిక

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 11:35 AM IST

Police Officials Plan to Strengthen TS NAB : తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి, వాటికి డీఎస్పీ స్థాయి అధికారుల్ని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించింది. అయితే, నిధుల లేమి కారణంగా అవి అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలనటంతో కదలిక వచ్చింది.

TS NAB
TS NAB

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా

Police Officials Plan to Strengthen TS NAB : రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో బలోపేతానికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనలో, పోలీస్‌ శాఖ నిమగ్నమైంది. టీఎస్‌ న్యాబ్‌ (TS NAB) పరిధిలో ఇప్పటికే ఏర్పాటైన పోలీస్‌స్టేషన్లకు సరిపడా సిబ్బంది, వాహనాలు, ఉపకరణాల సమకూర్చడంపై దృష్టి సారించింది. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ఇప్పటికే డీఎస్పీ స్థాయి అధికారిని ఎస్‌హెచ్‌ఓగా నియమించినా క్షేత్రస్థాయి సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఒక్కో ఠాణాకు ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలతో పాటు, 40-50 మంది కానిస్టేబుళ్లను నియమించాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

CM Revanth Reddy Call for Control Drug Crackdown : ఇందుకోసం ఇతర విభాగాల సిబ్బందిని సైతం, నియమించుకోవటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అలాగే, ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 3, 4 వాహనాలు అవసరముంటాయని భావిస్తున్నారు. టీఎస్‌-న్యాబ్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు పూర్తిస్థాయి డైరెక్టర్‌గా అదనపు డీజీపీ సందీప్‌ శాండిల్యాకు (Additional DGP Sandeep Shandilya) బాధ్యతలు అప్పగించారు. టీఎస్‌ న్యాబ్‌ బలోపేతానికి అవసరమైన నిధులతో కూడిన నివేదిక రూపొందించే పనిలో సందీప్‌ శాండిల్య నిమగ్నమయ్యారు.

Telangana Narcotics Bureau(TNAB) : 'అవగాహనతోనే యువతను డ్రగ్స్​కు దూరంగా ఉంచగలం'

వాస్తవానికి గత జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలతో సమీక్ష నిర్వహించి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఆ తర్వాత టీఎస్ న్యాబ్‌ ఉనికిలోకి వచ్చింది. అప్పటి హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను డైరెక్టర్‌గా నియమించారు. అంతకుముందు మత్తు పదార్థాల నియంత్రణకు హైదరాబాద్‌లో సాగుతున్న హెచ్‌న్యూను, టీఎస్‌ న్యాబ్‌లో విలీనం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మరోసారి కదలిక : హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌ కమిషనరేట్లలో పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి, ఎస్‌హెచ్‌ఓలను నియమించారు. అయితే నిధుల లేమి కారణంగా కొత్త ఠాణాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కావటంతో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో మరోసారి కదలిక వచ్చింది.

'మత్తు'పై ఉక్కుపాదం.. కళాశాలల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు

టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్ సారథ్యంలో దాదాపు 300 మంది : టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్ సారథ్యంలో దాదాపు 300 మంది కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. నలుగురు ఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ, 15మంది డీఎస్పీలు, 22మంది ఇన్స్‌పెక్టర్లు, 44మంది ఎస్‌ఐలు, 126 మంది కానిస్టేబుళ్లు, 88మంది ఇతర సిబ్బంది ఉంటారు. వీరిలో ప్రస్తుతం డైరెక్టర్‌తో పాటు కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఉన్నారు.

అంతా టీఎస్‌ న్యాబ్‌ ఆధ్వర్యంలోనే : గతంలో మాదిరి నిందితుల్ని పట్టుకొని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు అప్పగించకుండా దర్యాప్తు, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు ప్రక్రియ వరకూ అంతా టీఎస్‌ న్యాబ్‌ ఆధ్వర్యంలోనే జరగనుంది. ఈమేరకు ఇందులో నమోదయ్యే కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు.

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. నిరోధానికి మరింత పకడ్బందీ చర్యలు

డార్క్‌ నెట్ డీల్స్​కు చెక్.. టెక్నాలజీ సాయంతో ముకుతాడు వేస్తున్న నార్కోటిక్ వింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.