ETV Bharat / state

ఏపీలో ఉన్నత విద్య అకడమిక్ కేలండర్ విడుదల

author img

By

Published : Oct 31, 2020, 7:56 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి వార్షిక విద్యా కేలండర్‌ను విడుదల చేసింది. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనుండటంతో తరగతుల నిర్వహణ, ఫీజులు తదితర అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 30 శాతం మేర ట్యూషన్​ ఫీజు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.
Educational institutions start from second november released academic calender in andhrapradesh
ఏపీలో ఉన్నత విద్య అకడమిక్ కేలండర్ విడుదల

రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తి విద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారానికి ఆరు రోజులు తరగతులు నిర్వహించనున్నారు.

ఏదైనా కారణంతో ఒకరోజు సెలవు ఇస్తే రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహించాలని సూచించింది. జాతీయ సెలవులు, పండుగ రోజులు మినహా ఇతర సమయాల్లో దీన్ని అమలు చేయాలంది. విద్యాసంస్థల్లో కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని ఆదేశించింది. 1/3 మందికి 10 రోజుల చొప్పున తరగతులు నిర్వహించనున్నారు. 90 రోజుల్లో 30 రోజుల పాటు తరగతి బోధన, మిగతా సమయం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. తరగతి 45 నిమిషాలు, 5-10 నిమిషాల తర్వాత మరో తరగతి ఉంటాయి.

డిగ్రీ వారికి తరగతులు..

  • 2, 3 సంవత్సరాల వారికి నవంబరు 2 నుంచి డిగ్రీ కళాశాలలు ప్రారంభం
  • సెమిస్టర్‌-3, 5 వారికి అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
  • వచ్చే ఏడాది మార్చి 6న విద్యా సంస్థలకు సెలవు
  • సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
  • సెమిస్టర్‌-4, 6 వారికి తరగతులు: మార్చి 25 నుంచి
  • అంతర్గత పరీక్షలు: జూన్‌ 1-5
  • సెమిస్టర్‌ పరీక్షలు: ఆగస్టు 9 నుంచి

బీటెక్, బీఫార్మసీ వారికి తరగతులు

  • సెమిస్టర్‌-3, 5, 7 వారికి తరగతులు: నవంబరు 2న
  • అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
  • వచ్చే ఏడాది మార్చి 6న విద్యాసంస్థలకు సెలవు
  • సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
  • సెమిస్టర్‌-4, 6, 8 వారికి తరగతులు: మార్చి 25 నుంచి
  • అంతర్గత పరీక్షలు: జూన్‌ 1-5
  • ఆగస్టు 7న విద్యాసంస్థలకు సెలవు
  • సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 9 నుంచి

పీజీ పునఃప్రారంభం..

  • పీజీ సెమిస్టర్‌-3 వారికి తరగతులు ప్రారంభం: నవంబరు 2
  • అంతర్గత పరీక్షలు: డిసెంబరు1-5
  • వచ్చే ఏడాది మార్చి 6న సెలవు
  • సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
  • సెమిస్టర్‌-4 తరగతులు: మార్చి 25న
  • అంతర్గత పరీక్షలు: జూన్‌1-5
  • సెమిస్టర్‌-4 పరీక్షలు: ఆగస్టు 9

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు 30% తగ్గింపు

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు గతేడాది వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజులో 70శాతమే తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచన ప్రకారం ఈ విషయం నిర్ణయించింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులను చెల్లించే పరిస్థితుల్లో లేరని పేర్కొంది. అన్‌లాక్‌ నిబంధనలతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, అందుకే ట్యూషన్‌ ఫీజులో 30% తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

  • పాఠశాలలు మార్చి 23 నుంచి మూతపడ్డాయి. ఇప్పటివరకు పునఃప్రారంభం కాలేదు. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గాయి.
  • నవంబరు 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఐదు నెలలు పని చేయలేదు. దీనికి అనుగుణంగా ఖర్చులు తగ్గాయి.
  • కేంద్రం ఇచ్చిన ప్రత్యామ్నాయ కేలండర్‌ను అమలు చేశారు. ఆన్‌లైన్‌ బోధన మాత్రమే అందించారు.
  • మిగతా నెలలకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను తగ్గించనుంది. పాఠశాల బస్సులకు కొంత మొత్తమే వ్యయం కానుంది.

ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులే

రాష్ట్రంలో నవంబరు రెండో తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా మాస్కు, నీళ్ల సీసా ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. విద్యార్థులందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజన విరామం ఇవ్వకూడదని తెలిపింది. మాస్కు ధరిస్తేనే ఎవరినైనా పాఠశాలల్లోకి అనుమతించాలని పేర్కొంది. వీరందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రినింగ్ చేయాలని తెలిపింది. "ప్రార్థన సమావేశాలు తరగతి గదిలోనే నిర్వహించాలి. కొవిడ్ -19 జాగ్రత్తలపై ప్రతిజ్ఞ చేయించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలోనే బోధన నిర్వహించాలి. నవంబరు ఒకటో తేదీన తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం నిర్వహించాలి" అని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇదీ చూడండి:రసవత్తరంగా మారిన దుబ్బాక ఉపఎన్నిక పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.