ETV Bharat / state

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్న బీఆర్ఎస్ శ్రేణులు

author img

By

Published : Dec 23, 2022, 8:36 AM IST

BRS
BRS

BRS Agitations Today: రాష్ట్రంలోని ఉపాధిహామీ పనులపై కేంద్రం దుష్ప్రచారం చేస్తోందంటూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే... మోదీ సర్కారు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

BRS Agitations Today: కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైందని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకు అత్యంత ఉపయుక్తంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ధాన్యం సహా పంట ఉత్పత్తుల ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. వాటికి ఉపాధి హామీ పథకం కింద వెచ్చించిన రూ. 151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసు ఇవ్వడం దారుణమన్నారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో నేడు ధర్నా కార్యక్రమాలు.. కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా రాష్ట్రంపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.కేంద్ర ప్రభుత్వం రైతులపై, తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వైఖరికి నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వీటిలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కేటీఆర్‌ కోరారు. గురువారం ఆయన ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదులసార్లు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశాం. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి పంపించాం. మా విన్నపాలు వినకుండా మొత్తం పథకాన్ని నీరుగార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్రం కొత్తగా చేర్చింది. కరోనా కష్టకాలం తర్వాత గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తోంది. మరోవైపు పెరిగిన ఎరువులు, పెట్రోల్‌ ధరలు, ఇతర ఖర్చుల వల్ల పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబాంధవుడు. అన్నదాతలకు ఏ కష్టం రానీయొద్దని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి అనేక చరిత్రాత్మక పథకాలు అమలు చేస్తున్నారు.'-కేటీఆర్, ఐటీ మంత్రి

ఎందుకీ కక్ష?: 'తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించకపోగా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. వ్యవసాయ రంగ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్నా... రాష్ట్ర రైతులపై కక్ష సాధించేందుకు మాత్రమే నిధుల మళ్లింపు అంటూ మోదీ సర్కారు దుష్ప్రచారం చేస్తోంది. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహాలో సిమెంట్‌ కల్లాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని కేంద్రానికి గుర్తుచేసినా పట్టించుకోవడంలేదు. ఇక్కడి రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదు. మేం సాయం చెయ్యం.. చెయ్యనీయం అన్నట్టుగా కేంద్రం తీరు ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన కేంద్ర ప్రభుత్వం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని మరో కుట్రకు తెర లేపింది. కేంద్రం ఎన్ని కుతంత్రాలు పన్నినా కల్లాల నిర్మాణం ఆగదు. రూ.750 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 79,000 కల్లాల నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఈ సంకల్పానికి అన్నదాతలు మద్దతునివ్వాలి. శుక్రవారం భారాస ఆధ్వర్యంలో జరిగే ఆందోళనల్లో పెద్దఎత్తున పాల్గొని అన్నదాతల శక్తిని కేంద్రానికి తెలియజేయాలి' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.