ETV Bharat / state

కిషన్‌ జీ.. అభివృద్ధి అంటే కుర్‌కురే ప్యాకెట్లు పంచడం కాదు: కేటీఆర్‌

author img

By

Published : Dec 22, 2022, 10:29 PM IST

KTR Fires on Kishan Reddy : హైదరాబాద్ నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళ్లుండి చూడలేని పరిస్థితిలో ఉన్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. నగరం నలుమూలలా అభివృద్ధి సాధిస్తుంటే.. చూసి ఓర్వలేక అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

KTR fires on kishan reddy
KTR fires on kishan reddy

KTR Fires on Kishan Reddy : సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తర బిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరానికి ఒక్కపైసా కూడా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదన్నారు.

వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేంటని కిషన్ రెడ్డి అడగలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్ర మోదీ పాట పాడుతున్నారని మండిపడ్డారు.

తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏం అభివృద్ధి చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎస్అర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఅర్‌ఎంపీ కార్యక్రమాలు, వైకుంఠ ధామాలు, ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలే నిదర్శనం వివరించారు.

మాటలు బంద్‌ చేసి నిధులు తీసుకురండి: హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎస్‌ఆర్‌డీపీ ద్వారా రూ.5,660 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామని, అందులో ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయని కేటీఆర్ వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ఉండేందుకు ఎస్‌ఎన్‌డీపీ ద్వారా నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో 56 పనులు.. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులను చేపట్టినట్లు తెలిపారు.

ఇలా చెప్పుకుంటూ పోతే తాము చేసిన అభివృద్ధి పనుల జాబితా అంతులేనిదని, నగరంలోని అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక, ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ప్యాసింజర్ లిఫ్ట్‌లను ప్రారంభించడం, కుర్ కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్ర మంత్రి మాటలు బంద్ చేసి హైదరాబాద్‌కు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేదన్నారు. కిషన్ రెడ్డికి తన సొంత పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అవగాహన లేదని విమర్శించారు.

సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పనులు మూడేళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నా.. కిషన్ రెడ్డి అసలు పట్టించుకోలేదన్నారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం అజ్ఞానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.