ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

author img

By

Published : Dec 4, 2022, 2:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ భూములపై.. అక్రమార్కుల పడగ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ భూములపై.. అక్రమార్కుల పడగ

Trespassers focus on government lands: ప్రభుత్వ భూములు.. ఇళ్లు లేవు. విద్యుత్ వినియోగం లేదు. ఆ మాటకొస్తే అసలు అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు. అయితేనేం.. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కొందరి కన్ను పడింది. అనుకున్నదే తడువుగా లేని ఇళ్లు ఉన్నట్లు, విద్యుత్ మీటర్లు సృష్టించారు. తప్పుడు మార్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు క్రమబద్దీకరణ పేరిట దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... పాల్వంచ మండలంలో సాగుతున్న అక్రమార్కుల అసలు బాగోతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ భూములపై.. అక్రమార్కుల పడగ

పాల్వంచకు ఆనుకుని ఉన్న లక్ష్మీదేవిపల్లి(ఎస్‌) పంచాయతీ పరిధిలోని ఒకటో నెంబర్ సర్వేలో ఉన్న అత్యంత విలువైన భూమిపై స్థానికంగా చక్రం తిప్పే కొందరి కన్నుపడింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న స్థలం కావడం, గజం వేల రూపాయల ధర పలికే అత్యంత విలువైన భూమిని స్వాహా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు శాశ్వతంగా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.59 ను అడ్డుగా పెట్టుకుని... కోట్ల భూమిని కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో లేని ఇళ్లు ఉన్నట్లు సృష్టించి... రాత్రికి రాత్రే తప్పుడు ఇంటి నెంబర్లు సృష్టించి, విద్యుత్ మీటర్లు సైతం ఏర్పాటు చేసి... క్రమబద్దీరణ పేరిట వశపరుచుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తం ఈ సర్వేలో 7 ఎకరాల భూమిని కాజేసేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. ఈ భూమి విలువ అక్షరాలా.. సుమారు 35 కోట్లు. ఇదే పంచాయతీ పరిధిలోని అదే ఒకటో నెంబర్ సర్వేలో మరో రెండు చోట్ల ప్రభుత్వ భూమిని వశపరుచుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు.

ఇదే సర్వే నెంబర్‌లో పల్లె ప్రకృతి వనం సమీపంలో మరో ఎకరం భూమిని కబ్జా చేసేలా ప్రణాళికలు చేపట్టారు. పార్కు కోసం ప్రభుత్వానికి ఎకరం స్థలం కేటాయిస్తే.. పక్కనే ఉన్న మరో ఎకరం స్థలాన్ని చదును చేసి ఆక్రమించే యత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా అమ్మకాలు చేపట్టారు. కొందరు ఇంటి జాగా కోసం భూమిని కొనుగోలు చేసి లక్షలకు లక్షలు చెల్లించారు. ఈ రెండు చోట్లా సుమారు 6 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాహా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

వీటన్నింటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవట్లేదంటూ.. స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లిలో సర్వే నెంబర్ 1లో ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల వరకు ఉంది. గతంలో కొంత భూమిని ప్రభుత్వ వసతి గృహాలు, జూనియర్, డిగ్రీ కళాశాలకు కేటాయించారు. మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. ఇప్పుడు అత్యంత విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు... ఒకే ఇంటిపై ఏకంగా 9 ఇంటినెంబర్లు తీసుకున్నారు. ఇంటి నెంబర్ ఆధారంగా విద్యుత్ శాఖ నుంచి విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కొన్ని మీటర్లు బిగించారు. ఈ ఇంటినంబర్లు, కరెంటు మీటర్లు ఎలా వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలా మంజూరు చేశారన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమణలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని... రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని... కబ్జా చేసేందుకు యత్నిస్తున్న అక్రమార్కులకు.. రాజకీయ నేతల అండదండలు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.