ETV Bharat / state

నక్సల్స్‌ వ్యూహం.. పోలీసుల ప్రతివ్యూహం

author img

By

Published : Sep 25, 2020, 1:00 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతంలో పరిణామాలు కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నక్సల్స్‌, పోలీసుల వ్యూహప్రతివ్యూహాలతో కలవరం మొదలైంది. కడంబా ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసు యంత్రాంగం మావోయిస్టు చర్యలను అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనికోసం ఆధునిక సాంకేతికతను అన్ని విధాలుగా ఉపయోగించుకుంటోంది. సాధారణ విధుల్లో ఉన్న పోలీసులను సైతం అప్రమత్తం చేసింది.

naxals strategy x police counter-strategy
నక్సల్స్‌ వ్యూహం x పోలీసుల ప్రతివ్యూహం

మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా పూర్వప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగ యువతను ఆకర్షించే ప్రయత్నాలను చేసినట్లు రాష్ట్ర పోలీసు నిఘా విభాగం(ఎస్‌ఐబీ) పసిగట్టింది. రాష్ట్ర కమిటీ సభ్యుడైన మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలో ప్రత్యేక దళం కొత్తగా కొంతమందిని పార్టీలో చేర్చుకున్నట్లుగా భావిస్తున్న పోలీసు యంత్రాంగం వారి వివరాలని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన చంద్రపూర్‌, గడ్చిరోలి, సిరోంచ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఆధునిక సాంకేతిక వినియోగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. అటవీ ప్రాంతాల్లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌తోనే ఈ నెల 17న ఆసిఫాబాద్‌ మండలం చిలాటిగూడ-తూంపెల్లి సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు పసిగట్టిన పోలీసు యంత్రాంగం ఆగమేఘాలపై ఆ ప్రాంతంలో నాలుగువైపుల బలగాలను మోహరించింది. కానీ అప్పటికే చీకటిపడడంతో మావోయిస్టులు తప్పించుకోవడం పోలీసులను నిరాశకు గురిచేసింది. ఆ తరువాత రెండురోజుల వ్యవధిలో ఈ నెల 19న కడంబా ఎదురుకాల్పుల్లో చుక్కాలు, బాజీరావు మరణించారు. వారిద్దరు పార్టీలో కొత్తగా చేరిన వారేననేది పోలీసుల ప్రాథమిక నిర్ధరణలో వెల్లడైంది.

పసిగడుతున్న మావోయిస్టులు..

పోలీసుల వ్యూహాలకు అనుగుణంగా మావోయిస్టులు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారనే అభిప్రాయం పోలీసు వర్గాల నుంచే వినిపిస్తోంది. పోలీసు యంత్రాంగమంతా ప్రాణహిత నదీ పరివాహకంతోపాటు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దున ఉన్న ఆసిఫాబాద్‌ అటవీప్రాంతంపై దృష్టి సారించగా మావోయిస్టులు పశ్చిమ ప్రాంతంలో పావులు కదిపినట్లు నిఘా విభాగం అంచనా వేస్తోంది. కడంబా ఎన్‌కౌంటర్‌లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాజీరావు మృతి చెందడం నిఘావర్గాల అంచనాకు బలాన్ని చేకూరుస్తోంది. మావోయిస్టులు వ్యూహాత్మకంగా దాడులకు దిగవచ్చనే ఆలోచనతో ఇప్పటికే నేతలను అప్రమత్తం చేసిన యంత్రాంగం తాజాగా విధుల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో యూనిఫాం ధరించడం అనివార్యమేమీ కాదన్నట్లు సూచిస్తోంది. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలనే అంతర్గత ఆదేశాల వెనుక మావోయిస్టుల ప్రతిచర్యలు ఉండవచ్చని భావిస్తోంది. ఇప్పటికే తెరాస, భాజపా నేతలతోపాటు కొంతమంది పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని కుమురంభీం-మంచిర్యాల డివిజన్‌ కార్యదర్శి అడెల్లు కడంబా ఎన్‌కౌంటర్‌ తరువాత ప్రకటన జారీచేసిన విషయం విదితమే. సురక్షితంగానే ఉన్న అడెల్లు నేతృత్వంలోని దళాలు ఎలాంటి చర్యలకు పాల్పడతాయోననే కోణంలో వివరాలు సేకరిస్తూ వారిని పట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుండటం క్షేత్రస్థాయిలో పరిస్థితిని వేడెక్కిస్తోంది.

ప్రతీకారం తప్పదు: మావోయిస్టు నేత భాస్కర్‌

కాగజ్‌నగర్‌ మండలం కడంబా అటవీప్రాంతంలో ఈ నెల 19న జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని కుమురం భీం -మంచిర్యాల డివిజన్‌ మావోయిస్టు కార్యదర్శి అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరాయుధులుగా ఉన్న చుక్కాలు, బాజీరావులను పట్టుకొని కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారని ఆరోపించారు. దీనికి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం, పోలీసు శాఖ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మావోయిస్టులకు నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదని భాస్కర్‌ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.