ETV Bharat / sports

Commonwealth Games: అమ్మాయిలు.. సరిలేరు మీకెవ్వరూ

author img

By

Published : Aug 9, 2022, 7:09 AM IST

Commonwealth games Indian Women Athlets
కామన్వెల్త్ గేమ్స్​ 2022

Commonwealth Games 2022 indian women athlets: దేశం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు చేసుకుంటోన్న వేళ ఆంగ్లేయుల గడ్డపైన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు మన క్రీడామణులు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో వీళ్లు సాధించిన ప్రతి పతకం వెనకా పట్టుదల, శ్రమతోపాటు ఓ స్ఫూర్తిగాథ దాగుంది. తమ కలల్ని నిజం చేసుకోవడంలో పేదరికం, గాయాలు, వయసు, సాంకేతిక అంశాలు... ప్రతి అడ్డంకినీ దాటిమరీ విజయబావుటా ఎగరేశారు. వారెవరో తెలుసుకుందాం...

Commonwealth Games 2022 indian women athlets: కామన్వెల్త్​క్రీడల్లో ఆంగ్లేయుల గడ్డపైన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు మన క్రీడామణులు. అయితే ఈ విజయం వెనకా పట్టుదల, శ్రమతోపాటు ఓ స్ఫూర్తిగాథ దాగుంది. మరి వారెవరు? వారి కథలేంటి తెలుసుకుందాం..

హిళల 48 కిలోల బాక్సింగ్‌ అనగానే గుర్తొచ్చేది మేరీకోమే. ఈసారి ఆమె స్థానంలో అడుగుపెట్టిన నీతూ ఘంఘాస్‌.. ఎలాగైనా స్వర్ణం సంపాదించాలనుకుంది. సాధించి ఆ పతకాన్ని తండ్రికి అంకితం చేసింది. నీతూ తండ్రి హరియాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కూతుర్ని ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనేది ఆయన కోరిక. ఆమెను తీర్చిదిద్దే క్రమంలో తను వెన్నంటే ఉండాలని ఏకంగా మూడేళ్లుగా జీతంలేని సెలవులో ఉన్నారాయన. నీతూకి ఈ విజయం ఏమంత సామాన్యంగా దక్కలేదు. నాలుగు నెలల కిందట జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం అందించి తండ్రి కలను నిజం చేయాలనుకుంది. కానీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరేసరికి జ్వరం వచ్చింది. అయినా బరిలోకి దిగి గట్టిపోటీనిచ్చింది. నిజానికి నీతూ 52 కిలోల విభాగంలో పోటీపడేది. ఈ మధ్యనే 48 కిలోల విభాగంలోకి మారింది. ‘సెమీస్‌లో అడుగుపెట్టినప్పటికే నాకు పతకం ఖాయమని తెలుసు. అయితే, నాన్న కష్టానికి ప్రతిఫలంగా కాంస్యం, రజతం సరిపోవు. స్వర్ణమే అందుకోవాలకున్నా. ఈ పోటీ కోసం నోరుకట్టుకుని బరువు తగ్గా. ఆ త్యాగం, కష్టం ఫలించాయి’ అని చెప్పే 21 ఏళ్ల నీతూ.. మేరీ కోమ్‌ పోటీల వీడియోలు చూస్తూ పాఠాలు నేర్చుకుంటోంది.

Commonwealth games Indian Women Athlets
నీతూ

స్వర్ణం తేలేదు.. క్షమించమ్మా!.. దిల్లీ పోలీసు విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తోన్న అమృతకు ఫోన్‌ వచ్చింది. అవతల ఏడుస్తోన్న గొంతు ‘క్షమించమ్మా స్వర్ణం తేలేకపోతున్నా’ అంది. ఆ ఫోన్‌ చేసింది తన కుమార్తె జూడో క్రీడాకారిణి తూలిక మాన్‌. ‘నువ్వు ఏ పతకం సాధించినా అది స్వర్ణమే’ అని బదులిచ్చింది తల్లి. వీరి కథ తెలిస్తే ఎవరైనా ఆ మాటల్లో వాస్తవాన్ని గ్రహిస్తారు. భర్త వేధింపులు భరించలేక మూడేళ్ల తూలికను తీసుకుని హరియాణా నుంచి దిల్లీ వచ్చేసింది అమృత. ఆపైన పోలీసు ఉద్యోగం సంపాదించింది. తన తండ్రి గురించి తూలిక ఎప్పుడు అడిగినా అతను చనిపోయాడని తప్పించి మరో మాట చెప్పేది కాదు. నిజంగానే అతను 2005లోనే చనిపోయాడు. కానీ అంతకు ముందే తూలికని స్కూల్లో చేర్చినప్పుడు రికార్డుల్లో తన తండ్రి పేరు కాకుండా ఏదో తోచిన పేరు రాయమని చెప్పింది. ఎందుకంటే వారి జీవితాల్లోంచి అతణ్ని పూర్తిగా తీసేయాలని. స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని నాలుగేళ్లప్పట్నుంచీ తూలికకు జూడో నేర్పింది. దాన్నే కెరీర్‌గా మలుచుకుందామె. 23 ఏళ్ల తూలిక బర్మింగ్‌హామ్‌లో 78 కిలోల విభాగంలో పోటీ పడింది. కానీ అదివరకు ఆమె 100 కిలోలకుపైన విభాగాల్లో పోటీ పడేది. ఒలింపిక్‌ కమిటీ వాటిని తీసేయడంతో ఆటలో కొనసాగడానికి ఏడాదిలోనే ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది.

Commonwealth games Indian Women Athlets
తూలిక

రైతుబిడ్డ కాంస్యం తెచ్చింది.. పంజాబ్‌కు చెందిన ఆ రైతుకి చిన్న ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. పశుపోషణే వారి జీవనాధారం. ఓ యంత్రం సాయంతో గడ్డిని ముక్కలు కోసి పశువులకు వేసే బాధ్యత అతని కూతురు హర్జీందర్‌ కౌర్‌ది. ఆ పని చేస్తూనే కబడ్డీ ప్రాక్టీసు చేసేదామె. ఓసారి పంజాబ్‌ యూనివర్సిటీలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరానికి హాజరైంది. గడ్డి కోసే యంత్రాన్ని బలంగా చేత్తో కొడుతుండాలి. దానివల్ల ఈమె భుజాలు దృఢంగా తయారయ్యాయి. శిబిరంలో ఓ కోచ్‌ హర్జీందర్‌ని పరిశీలించి వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు మళ్లించాడు. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. కామన్వెల్త్‌లో కాంస్యం అందుకునేలా చేసింది. పట్టుదల, ప్రోత్సాహం ఉండాలే కానీ ఆటలకు పేదరికం ఆటంకం కాదని నిరూపించిన హర్జీందర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం రూ.40 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.

Commonwealth games Indian Women Athlets
హర్జీందర్​

రెజ్లర్‌ పూజా గెహ్లోత్‌ కామన్వెల్త్‌కి వెళ్తోందనీ, పతకం తెస్తుందనీ చాలామందికి తెలీనే తెలీదు. కానీ తాను మాత్రం స్వర్ణం గెలిచి పోడియం దగ్గర జాతీయగీతం ఆలపించాలనుకుంది. తీరా కాంస్యం దగ్గర ఆగిపోయేసరికి కన్నీరుమున్నీరై.. ‘నా దేశ ప్రజలందరినీ క్షమించమని అడుగుతున్నా’ అంటూ ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. దానికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘పూజా నీ పతకంతో సంబరాలు చేసుకోవాలి. ఏడవాల్సిన పని అస్సలే లేదు. నీ ప్రయాణమే మాకు ప్రేరణ, నీ ప్రతి విజయమూ మాకు సంతోషమే. నీకు అద్భుతమైన భవిష్యత్తు’ ఉంది అంటూ ట్విటర్‌లో చెప్పారు.

ఇక ‘ఈ వయసులో ఆటలా’ అనుకునేవాళ్లు మన లాన్‌బౌల్స్‌ జట్టు గురించి తెలుసుకోవాల్సిందే. లవ్లీ, రూపారాణి, నయన్మోని, పింకీ.. నలుగురూ దాదాపు 40కి అటూఇటుగా ఉన్నవారు. అప్పటికే వేరే క్రీడల్లో రాష్ట్రానికీ, దేశానికీ ప్రాతినిధ్యం వహించారు. అయినా ఆటమీద ప్రేమను చంపుకోలేక కొత్తగా లాన్‌బౌల్స్‌వైపు అడుగులు వేసి అందులో స్వర్ణం అందించారు.

Commonwealth games Indian Women Athlets
లాన్​బౌల్స్​ జట్టు

వీరే కాదు, మహిళల క్రికెట్‌ జట్టు మొదటి క్రీడల్లోనే రజతం అందుకుంది. 2006 తర్వాత హాకీలో పతకాన్ని తెచ్చారు మహిళలు. పతకాలు అందుకున్నవాళ్లలో దాదాపు సగం మంది మహిళలే. అంచనాలు పెట్టుకున్నవాళ్లు వాటిని అందుకుంటే... ఎలాంటి అంచనాల్లేకుండా సంచలనం రేపిన వాళ్లెందరో. వీరికి వీరే సాటి!

Commonwealth games Indian Women Athlets
హాకీ జట్టు

ఇదీ చూడండి: Common wealth Games: క్రీడల్లో మరింత ఎదగలేమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.