ETV Bharat / international

'ఉక్రెయిన్​ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'

author img

By

Published : Mar 25, 2022, 9:03 PM IST

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా 30వ రోజు ఖర్కివ్‌ సహా పలు నగరాల్లో దాడులు నిర్వహించింది. మానవతా సహాయ కేంద్రంపై జరిపిన రాకెట్ లాంచర్ల దాడిలో నలుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డొనెట్స్క్​ నుంచి క్రిమియా వరకు రష్యా బలగాలు పాక్షికంగా భూమార్గం ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించటమే లక్ష్యంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కోసం కొత్త ఒప్పందం చేసుకున్నట్లు ఐరోపా, అమెరికా ప్రకటించాయి. మరోవైపు.. ఉక్రెయిన్​ యుద్ధంలో 1,351 మంది సైనికులను కోల్పోయినట్లు రష్యా ప్రకటించింది.

Russia Ukraine war
రష్యా జెండా

Russia-Ukraine War: ఉక్రెయిన్​పై గత నెల రోజులుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. 30వ రోజు ఖర్కివ్​ సహా పలు నగరాల్లో దాడులు నిర్వహిచింది. ఖర్కివ్‌లో మానవతా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన క్లినిక్‌పై పుతిన్‌ సేనలు రాకెట్‌ లాంచర్లతో జరిపిన దాడిలో నలుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు. కీవ్‌ వెలుపల ఉన్న ఉక్రెయిన్‌ ప్రధాన ఇంధన డిపోను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌ బలగాల ప్రతిఘటనతో కీవ్‌ శివార్లలో మాస్కో సేనలు వెనక్కితగ్గినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. కీవ్‌కు తూర్పున 35కిలోమీటర్ల వరకు పట్టణాలు, రక్షణ స్థావరాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా 1200 క్షిపణులు ప్రయోగించగా అందులో సగానికిపైగా గురి తప్పినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌ పార్లమెంటు సభ్యుడొకరు చెర్నిహివ్‌ నగరంలో పుతిన్‌ సేనలు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన ఓ వీడియో విడుదల చేశారు. ఆయన చెర్నిహివ్‌ మేయర్‌తో కలిసి నగరమంతా కారులో ప్రయాణిస్తూ విధ్వంసకాండను రికార్డ్‌ చేశారు. డొనెట్స్క్​ రీజియన్‌ నుంచి క్రిమియా వరకు రష్యా పాక్షికంగా రోడ్డుమార్గం ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. మరియుపోల్‌ నగరంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఐరాస మానవహక్కుల బృందం తెలిపింది. సామూహిక ఖననాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొంది.

యుద్ధ స్వరూపమే మారిపోతుంది: రష్యా రసాయనిక లేదా అణ్వాయుధాలు వాడితే ఉక్రెయిన్‌లో యుద్ధ స్వరూపమే పూర్తిగా మారిపోతుందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించటమే లక్ష్యంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కోసం కొత్త ఒప్పందం చేసుకున్నట్లు ఐరోపా, అమెరికా ప్రకటించాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు తమపై పూర్తి యుద్ధం ప్రకటించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆరోపించారు. తమ ఆర్థిక వ్యవస్థను, మొత్తంగా రష్యాను సర్వనాశనం చేయటమే లక్ష్యమన్నారు. తమపై ఆర్థిక ఆంక్షలు విధించినా తామేమీ ఏకాకిగా మిలిగిపోలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు ఎంతో మంది మిత్రులు ఉన్నారని లావ్రోవ్‌ పేర్కొన్నారు. పాస్ఫరస్‌ బాంబులు ఉపయోగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలను క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ఖండించారు. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా ఎప్పుడు కూడా ఉల్లంఘించదని స్పష్టం చేశారు.

పోలాండ్​ పర్యటనలో బైడెన్​: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా చివరగా బైడెన్ పోలాండ్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్‌లోని రెజెస్‌జో నగరానికి బైడెన్‌ వచ్చారు. పోలాండ్- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైన్యంతో బైడెన్‌ మాట్లాడనున్నారు. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు వలస వెళ్తున్న శరణార్థులకు సాయం అందించడంపై చర్చించనున్నారు. అమెరికా సైన్యం, ప్రభుత్వేతర సంస్థలు ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు వచ్చే వారికి సహాయం చేస్తున్నాయి.

తొలి దశ పూర్తి: ఉక్రెయిన్‌లో చేపట్టిన సైనిక చర్య మొదటి దశ దాదాపు పూర్తికావచ్చిందని రష్యా ప్రకటించింది. ఇక తమ తదుపరి లక్ష్యం డాన్‌బాస్‌ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడమేనని స్పష్టం చేసింది. అటు యుద్ధంలో చనిపోయిన మాస్కో సేనల సంఖ్యపై రష్యా అధికారిక ప్రకటన చేసింది. యుద్ధంలో ఇప్పటివరకు 1,351 మంది మాస్కో బలగాలు చనిపోయినట్లు రష్యా మిలటరీ స్టాఫ్‌ డిప్యూటీ హెడ్‌ ప్రకటించారు. మరో 3,825 మందికి గాయాలైనట్లు స్పష్టం చేశారు. తమపై దాడి చేస్తున్న 16వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్‌ తాజాగా ప్రకటించింది. అటు నాటో కూటమి కూడా 7 వేల నుంచి 15 వేలమంది పుతిన్‌ సేనలు మరణించినట్లు పేర్కొంది. రష్యా.. చివరిసారి మార్చి 2న అప్‌డేట్‌ చేసిన వివరాల్లో ఈ సంఖ్య 498గా ఉంది. మరోవైపు.. ఇప్పటివరకు 16,100 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 53 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం అయిదు నౌకలు, 49 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

రష్యన్‌ సంస్కృతిపై వివక్ష: తమ దేశ సంస్కృతిపై పశ్చిమ దేశాలు వివక్ష చూపుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. రష్యన్‌ సంగీతం, సాహిత్యంపై ఆంక్షల పరిణామాలను.. 1930ల్లో నాజీ మద్దతుదారులు పుస్తకాలను తగులబెట్టిన ఘటనతో పోల్చారు. 'ఈ రోజు పశ్చిమ దేశాలు.. వెయ్యేళ్ల పురాతన రష్యా సంస్కృతిని తుడిచిపెట్టేందుకు యత్నిస్తున్నాయి. రష్యాకు సంబంధించిన విషయాలపై వివక్ష గురించి నేను మాట్లాడుతున్నా' అని పుతిన్.. కళాకారులతో నిర్వహించిన ఓ టెలివిజన్ సమావేశంలో అన్నారు.

22 లక్షలకుపైగా ప్రజలు పోలాండ్‌లోకి: రష్యా సైనిక చర్య మొదలు దాదాపు 22 లక్షలకుపైగా ప్రజలు ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌లోకి ప్రవేశించారని పోలాండ్‌ బార్డర్‌ గార్డ్‌ తాజాగా వెల్లడించింది. కొంతకాలంగా రోజువారీ సంఖ్యలో తగ్గుదల నమోదవుతున్నా.. గురువారం కాస్త పెరిగారని, మొత్తం 32,500 మంది బార్డర్‌ దాటారని చెప్పింది. బుధవారంతో పోల్చితే ఇది 7.4 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం పోలాండ్‌లో దాదాపు 12-13 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు వార్సా యూనివర్సిటీలో మైగ్రేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ మాసీజ్ డస్జ్‌జిక్ అంచనా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.