ETV Bharat / international

పుతిన్‌ తీరుపై నాటో ఆగ్రహం.. రష్యా యుద్ధ నౌక ధ్వంసం..

author img

By

Published : Mar 25, 2022, 8:02 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​పై దాడికి రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టం చేసింది. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు నాటో సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని 'ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి' (నాటో) పిలుపునిచ్చింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం గురువారం ప్రారంభమైంది.

Ukraine Crisis
పుతిన్

NATO Summit 2022: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు, ఐరోపాలో తలెత్తిన పరిస్థితిపై స్పందించేందుకు సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని 'ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి' (నాటో) పిలుపునిచ్చింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం గురువారం ప్రారంభమైంది. దురాక్రమణకుగానూ రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టంచేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా కీలకనేతలు దీనికి హాజరయ్యారు.

అకారణంగా విరుచుకుపడిన రష్యా తీరును ఖండించి, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని.. ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి నాటో దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ చెప్పారు. రష్యాపై ఆంక్షల్ని కొనసాగించి, "దుర్మార్గ యుద్ధానికి" ముగింపు పలకాలనేది తమ నిర్ణయమని చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రక్షణ రంగంలో పెట్టుబడులను పెంచాలన్నారు. కూటమిలో సభ్య దేశంపై ఎలాంటి దాడి జరిగినా స్పందించి, పరిరక్షించేందుకు నాటో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రష్యా మీద విధించాల్సిన కొత్త ఆంక్షలు, ఉక్రెయిన్‌కు అదనపు సాయంపై నాటో సభ్య దేశాలతో బైడెన్‌ చర్చించారు. శుక్రవారం ఆయన పోలండ్‌ వెళ్తారు. మరోవైపు- జి-7 కూటమి శిఖరాగ్ర సదస్సు, ఈయూ సదస్సు కూడా బ్రసెల్స్‌ వేదికగా నిర్వహించారు. జీవ, రసాయన, అణ్వాయుధాలను వాడవద్దంటూ రష్యాకు జి-7 విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మార్కెట్లకు సరఫరాలు పెంచాలని చమురు ఉత్పత్తి దేశాలను కోరింది. రష్యా కేంద్ర బ్యాంకు ఏ లావాదేవీల్లోనూ బంగారాన్ని వినియోగించకుండా నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించింది.

Ukraine Crisis
.

రెండు పక్షాలకూ నష్టం

Ukraine War: యుద్ధంలో భాగంగా ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు రష్యా, ఉక్రెయిన్‌ గురువారం గట్టి ప్రయత్నాలు చేశాయి. రష్యాకు చెందిన ఒక యుద్ధనౌకను ధ్వంసం చేసి దానిని ముంచేశామని ఉక్రెయిన్‌ నౌకాదళం ప్రకటించింది. రష్యా బలగాలకు అవసరమైన వాటిని సరఫరా చేయడానికి ఆ నౌకను వినియోగించేవారు. తూర్పు ఉక్రెయిన్‌లో హోరాహోరీ పోరు తర్వాత ఇజో నగరాన్ని తాము గుప్పిట పట్టామని రష్యా ప్రకటించుకుంది. చాలా ప్రాంతాల్లో రష్యా సైన్యానికి ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తీవ్రంగా ధ్వంసమైన మేరియుపొల్‌లో వీధివీధినా పోరాటం జరుగుతోంది. ఈ నగరం రష్యా చేజిక్కకుండా ఉక్రెయిన్‌ అడ్డుకుంది. కీవ్‌ సమీపంలో రష్యా పాత్రికేయురాలు ప్రాణాలు కోల్పోయారు.

ఉక్రెయిన్‌కు బాసట

ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని పంపిస్తున్నామని పశ్చిమ దేశాలు ప్రకటించాయి. కొన్ని వేల క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. ఈయూ నేతలు కూడా మరో 55 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించడానికి సంతకాలు చేశారు. ఆంక్షలు తమపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పే ప్రయత్నంలో భాగంగా పరిమిత ట్రేడింగ్‌తో స్టాక్‌మార్కెట్‌ కార్యకలాపాలను రష్యా నిర్వహించింది.

ఎంత దూరంలో ఉన్నా అణ్వాయుధాలతో నాశనం చేయగలం..

అవసరమైతే రష్యా తన అణ్వాయుధాలను వినియోగిస్తుందనే ఆందోళనను బలపరిచే రీతిలో ఆ దేశ ఏరోస్పేస్‌ సంస్థ అధిపతి దిమిత్రి రొగోజిన్‌ స్పందించారు. తమపై దురాక్రమణకు ప్రయత్నించే ఏ దేశాన్నైనా, ఏ కూటమినైనా, అది ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో నాశనం చేసే సత్తా తమకు ఉందని చెప్పారు.

మాకు సంఘీభావం ప్రకటించండి: ఉక్రెయిన్‌

Russia Ukraine Issue: రష్యాతో తాము చేస్తున్న పోరాటానికి ప్రపంచమంతా సంఘీభావం ప్రకటించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో సందేశం ద్వారా ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. విడిగా స్వీడన్‌ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి బలమైన వాణి వినిపించాలని కోరారు. ఉక్రెయిన్‌ కోసం.. ప్రజల కోసం.. శాంతి కోసం అందరూ స్పందించాలన్నారు.

  • రష్యాకు చెందిన 400 మంది ప్రముఖులపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది.
  • రష్యాపై నాలుగు విడతలుగా విధించిన ఆంక్షలకు ఈయూ ఆమోదం తెలిపింది. ఇంధన సరఫరా విషయంలో సభ్యదేశాలు భిన్నాభిప్రాయం వ్యక్తంచేశాయి.
  • ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని నాటో కూటమి నిర్ణయించింది. 2023 సెప్టెంబరు 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.


ఇదీ చదవండి: ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. ఆ ప్రాంతాలకు భారీగా నాటో బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.