ETV Bharat / international

లీటర్ పెట్రోల్ ధర రూ.30 పెంపు- మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు

author img

By

Published : May 27, 2022, 2:13 PM IST

Pakistan petrol price: ఆర్థికంగా సతమవుతున్న పాకిస్థాన్​లో ఇంధన ధరలను పెంచి ప్రజలపై మరింత భారం వేసింది అక్కడి ప్రభుత్వం. అన్ని రకాల పెట్రోల్​ ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్యపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్​ తీవ్ర విమర్శలు చేశారు. భారత్​ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది అంటూ ప్రశంసించారు.

imran khan
ఇమ్రాన్ ఖాన్

Pakistan petrol price: ఆర్థిక సంక్షోభం, విద్యుత్​ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్​ ప్రజలకు ఇప్పుడు ఇంధనం మరింత భారంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు అక్కడ లీటర్​ పెట్రోల్​ ధర రూ.179.85, డీజిల్​ లీటరు రూ.174.15, కిరోసిన్​ రూ.155.95, లైట్​ డీజిల్​ రూ.148.41కు చేరాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్​) పాక్​ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ దేశ విత్తమంత్రి మిఫాత్​ ఇస్మైల్​ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

"ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు దేశానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్​ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలపై ఈ భారం వేయకతప్పట్లేదు." అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు ఇమ్రాన్​ ఖాన్​ హయాంలో.. పెట్రోల్​ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ అమలులోకి వచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్​ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్​ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్​ తేల్చిచెప్పడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్​ భేష్​..: ప్రభుత్వం పెట్రోల్​ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్.​. ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ సందర్భంగా భారత్​ను ప్రశంసించారు. " దేశంలో పెట్రోల్​ ధరలను ప్రభుత్వం ఒకేసారి 20శాతం/రూ.30 పెంచింది. ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పెంచడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు భారత్​.. ఇందుకు భిన్నంగా ఇంధన ధరలను తగ్గించింది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం." అని ఖాన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : మీనమేషాలు లెక్కించారు! గంటసేపు మారణహోమం జరిగినా కదలని పోలీసులు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.