ETV Bharat / technology

'AIతో ఉద్యోగాలు ఊడడం గ్యారెంటీ - జర జాగ్రత్త!' - ఎలాన్ మస్క్​ - Elon Musk About AI

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 1:09 PM IST

Elon Musk About AI : కృత్రిమ మేధ (AI) వల్ల భవిష్యత్​లో​ మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు అని టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ అభిప్రాయపడ్డారు. భవిష్యత్​లో కేవలం ఒక హాబీగా మాత్రమే జాబ్స్ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

AI will eliminate all jobs - Elon Musk
Elon Musk About AI (Getty Images)

Elon Musk About AI : ఉద్యోగాలపై కృత్రిమ మేధ (AI) ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల భవిష్యత్​లో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

టెక్‌ ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఏఐ అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయోగాలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తుంటే, మరోవైపు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏఐ వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు.

ప్రమాదం పొంచి ఉంది!
ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఎలాన్ మస్క్​ కూడా ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు. ప్యారిస్‌ కేంద్రంగా 'వివా టెక్‌' పేరిట నిర్వహించిన స్టార్టప్‌ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఏఐ టెక్నాలజీపై చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

రానున్న రోజుల్లో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?
రానున్న రోజుల్లో జాబ్ చేయడం అనేది ఒక వ్యాపకం(హాబీ)గా మారుతుందని ఎలాన్ మస్క్‌ అభిప్రాయపడ్డారు. అన్ని రకాల ఉత్పత్తులను, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని ఆయన అంచనా వేశారు. అదే జరిగితే మనుష్యులు ఎవ్వరికీ జాబ్స్‌ ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. అవసరమైతే ఒక హాబీగా మాత్రమే జాబ్​ చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవాలంటే, ప్రపంచంలో ప్రతిఒక్కరికీ 'యూనివర్సల్‌ హై ఇన్‌కమ్‌' ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంటే ప్రపంచంలోని ప్రజలందరికీ కచ్చితంగా భారీ ఆదాయం వస్తూ ఉండాలని అన్నారు. కానీ ఇది ఎలా సాధ్యమో ఆయన చెప్పలేదు. వాస్తవానికి దీనిపై ఎలాన్​ మస్క్ మరింత లోతుగా విశ్లేషించలేదు.

బాధ్యతాయుతంగా ఉండాల్సిందే!
గత కొన్నేళ్లుగా ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగవుతున్నాయని ఎలాన్​ మస్క్‌ చెప్పారు. అయితే ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై, ప్రభుత్వాలు, ప్రైవేట్​ కంపెనీలు, నియంత్రణా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయని ఆయన గుర్తుచేశారు. తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది ఏఐ ‘టెక్నాలజీ’ మాత్రమేనని చెప్పారు. ఇయాన్‌ బ్యాంక్స్‌ రాసిన ‘కల్చర్‌’ సిరీస్‌ పుస్తకాల్లో చూపించిన కల్పిత ప్రపంచం భవిష్యత్తులో ఆవిష్కృతమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ఆయన అన్నారు.

తల్లిదండ్రులకు ఓ సూచన
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఎలాన్​ మస్క్‌ ఓ కీలక సూచన చేశారు. పిల్లలు సోషల్ మీడియాపై గడుపుతున్న సమయాన్ని నియంత్రించాలని సూచించారు. సోషల్ మీడియాపై వ్యామోహం పెంచేందుకు డోపమైన్‌ అనే హార్మోన్‌ మనుష్యుల్లో పెరిగేలా ఏఐతో ప్రోగ్రామ్‌ చేస్తున్నారని మస్క్ వెల్లడించారు. వాస్తవానికి డోపమైన్​ను ‘ఫీల్‌-గుడ్‌ హార్మోన్​గా వ్యవహరిస్తుంటారు. మనుష్యుల్లో ఆనందం, సంతృప్తి, ప్రేరణ లాంటి భావాలకు ఇదే కారణమని వైద్యనిపుణులు చెబుతుంటారు. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, కదలికల లాంటి ఇతర శారీరక విధుల నియంత్రణలోనూ దీని పాత్ర చాలా ఉంటుంది. కానీ అదేపనిగా సోషల్ మీడియాలో నిమగ్నమైతే, అది మనుష్యులపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

'AIని ఒక సాధనంగా చూడాలి - మనిషిలా ట్రీట్ చేస్తే ఇక అంతే' - సత్య నాదెళ్ల - Microsoft Satya Nadella About AI

'పెద్ద జీతంతో ఉద్యోగం రావాలంటే - ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే' - ఇన్ఫోసిస్​ సీటీఓ - AI Skills For IT Job

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.