ETV Bharat / spiritual

పెళ్లిలో అరంధతీ నక్షత్రం ఎందుకు చూపిస్తారు? - కారణం మీకు తెలుసా? - Importance of Arundhati Star

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 9:45 AM IST

Arundhati Star Importance: కొత్తగా పెళ్లైన వారిని పండితులు అరుంధతీ నక్షత్రం చూడమని చెప్తారు. భార్య వేలు పట్టుకొని ఆకాశంలో ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని చూపించమని పెళ్లి కుమారుడికి సూచిస్తారు. హిందూ వివాహ వ్యవస్థను అనుసరించే వారందరికీ ఇది తెలుసు. మరి.. ఈ నక్షత్రాన్ని ఎందుకు చూడమని చెబుతారో మీకు తెలుసా?

Arundhati Star Importance
Importance of Arundhati Star in Hindu Marriage (ETV Bharat)

Importance of Arundhati Star in Hindu Marriage: హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నుదుటన బాసికం, కాలికి మెట్టలు తొడగడం మొదలు.. తాళిబొట్టు, నల్లపూసలు, అప్పగింతల వరకు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇలాంటి వాటిల్లో అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం ఒకటి. మరి, పెళ్లిలోనే ఈ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి దానికి పండితులు ఏం సమాధానమిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

అరుంధతీ చరిత్ర: పురాణాల ప్రకారం.. ఒకసారి బ్రహ్మదేవుడు తన మనో సంకల్పంతో సంధ్య అనే తేజోవంతమైన కన్యను, ఓ సుందర యువకుడైన మన్మథుణ్ణి సృష్టించాడు. సృష్టికార్యంలో తనకు సాయపడమంటూ పంచ బాణాల(అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం)ను కూడా ఇచ్చాడు. అయితే ఆ బాణాల శక్తిని పరీక్షించాలనుకున్న మన్మథుడు.. వాటిని బ్రహ్మలోక వాసుల పైనే ప్రయోగించాడు. ఆ ప్రభావం వల్ల బ్రహ్మతో సహా అందరూ అక్కడ ఉన్న సంధ్యను చూసి మోహానికి గురయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి వెంటనే పరమేశ్వరుడిని ప్రార్థించడంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దాడు. మన్మథుడి చేష్టలకు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు "ఈశ్వరుడి నేత్రాగ్నిలో భస్మమవుతావు" అంటూ శపించాడు. అయితే తన మూలంగానే ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో సంధ్య తపస్సు పేరిట తనువు చాలించాలని బయల్దేరింది. దాంతో బ్రహ్మ- వశిష్టుని పిలిపించి సంధ్యకు శివ తపోదీక్షను ఇవ్వమని కోరాడు. బ్రహ్మ ఆదేశాలనుసారంగా వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.

పెళ్లి లేట్ అవుతుందా? గంగా సప్తమి రోజు శివుడికి అభిషేకం చేస్తే వెంటనే మ్యాచ్​ సెట్​! - Ganga Sapthami Importance

ఆమె దీక్షతో శివుణ్ణి మెప్పించి, ఆయన అనుగ్రహం పొంది "సమస్త ప్రాణులకూ యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగ రాదనే" వరాన్ని ప్రసాదించమ’ని కోరింది. సంతోషించిన పరమేశ్వరుడు మరో వరాన్ని కూడా కోరుకోమన్నాడు. తను పుట్టగానే అనేక మందికి కామ వికారాన్ని కలిగించింది కాబట్టి తన దేహాన్ని నశింపచేయమంది. "‘కణ్వ మహర్షి పుత్రుడైన మేధాతిథి చేస్తున్న యాగకుండంలో దూకి తనువు చాలించు! అందులోనే మళ్లీ జన్మ కలుగుతుంది. శరీరం నశించేటప్పుడు ఎవరిని తలచుకుంటావో అతడే నిన్ను స్వీకరిస్తాడు" అని వరమిచ్చాడు శివుడు.

శివాజ్ఞగా సంధ్యా తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి మళ్లీ జన్మించింది. సంస్కృతంలో ‘అరుం అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటే ధరించినది అనే అర్థం. అలా.. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె "అరుంధతి" అయ్యింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే వశిష్టుడితో వివాహం జరిపించారు. అరుంధతి తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలకూ పూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే "శక్తి". శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించారు.

నూతన దంపతులకు దర్శనం ఎందుకు: కొత్తగా పెళ్లైన వారికి ఆకాశంలో సప్తర్థి మండలంలో ఉన్న వశిష్టుని నక్షత్రానికి పక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. ఎందుకంటే.. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ప్రతీక. కొత్తగా పెళైన దంపతులు సైతం అరుంధతీ, వశిష్టుల్లా అన్యోన్యంగా ఉండాలని పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని చూపడం సంప్రదాయమైంది. ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

శ్రీ కృష్ణుడి నుంచి - ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే! - Lord Krishna Life Lessons in Telugu

విష్ణుమూర్తి కూర్మావతారం వెనుక కారణమేంటి? కూర్మ జయంతి రోజు ఏం చేయాలి? - Kurma Jayanti 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.