ETV Bharat / international

C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

author img

By

Published : Sep 2, 2021, 1:52 PM IST

దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త రకం కరోనా వేరియంట్​ సీ.1.2 (C.1.2 variant).. ప్రపంచదేశాలకు వణుకుపుట్టిస్తోంది. దీని మ్యుటేషన్​ రేటు(Corona Mutant) ఆధారంగా ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని ఆందోళన చెందుతున్నాయి. అసలు.. సీ.1.2 వేరియంట్​ లక్షణాలేంటి? దీని గురించి నిజంగా భయపడాల్సిన పనుందా? మన దేశంలో ఈ తరహా కేసులున్నాయా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

There's no need to panic about the new C.1.2 variant
ఈ కొత్త వేరియంట్ సీ.1.2​తో​ ప్రమాదమా

ఇటీవల దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొత్త రకం కరోనా వేరియంట్​ను గుర్తించారు. సీ.1.2గా (C.1.2 variant) పిలిచే ఈ రకం సింగిల్​ వైరస్​ కాదు.. జన్యుక్రమాలు సారూప్యంగా ఉన్న వైరస్​ల సమూహం(Virus Cluster).

ఈ వేరియంట్​పై(C.1.2 virus) ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు కానీ.. వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి మ్యుటేషన్​ రేటూ ఎక్కువే అని వెల్లడించారు. అంటే.. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మ్యుటేషన్లు బయటపడుతున్నాయని అర్థం.

నిజానికి.. వైరస్​ల స్వభావం అదే. నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాయి. మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. అయితే.. సీ.1.2 ను (New C.1.2 variant) ఇతర వేరియంట్లతో పోల్చి చూడటం తొందరపాటే అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందా? దీని లక్షణాలేంటి? వ్యాక్సిన్ల పనితీరు ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్​ ఎం. మకాయ్​ జవాబులు..

సీ.1.2 లక్షణాలేంటి?

సీ.1.2 కరోనా రకం (New C.1.2 variant) మిగతా వాటికి భిన్నంగా ఉన్నా.. లామ్డా వేరియంట్(పెరూలో వెలుగులోకి వచ్చిన వేరియంట్​)​ జన్యు క్రమానికి దగ్గరి పోలికలున్నాయి. ఒక కరోనా వేరియంట్​లో ఎన్ని మ్యుటేషన్లు(ఉత్పరివర్తనలు) ఉంటాయో చెప్పడం కష్టం. అదే విధంగా.. ఈ మ్యుటేషన్లను బట్టి వేరియంట్​ తీవ్రతను పసిగట్టడమూ కష్టమే.

ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరంగా పరిణమిస్తుందా?

సీ.1.2 వేరియంట్​ వెలుగులోకి వచ్చి కొద్దిరోజులే అయింది కాబట్టి ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేం. ఇప్పట్లో అంచనా వేయడమూ అసాధ్యం. ఇది ఇతర ప్రమాదకర కరోనా రకాలను(Covid Variants) అధిగమించొచ్చు. అకస్మాత్తుగా కనుమరుగూ కావొచ్చు.

ప్రస్తుత డెల్టా(Delta Variant India) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​, భారత్​ సహా పలు దేశాల్లో ఈ తరహా కేసులే(Delta Variant Covid) ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి.. సీ.1.2 పై ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం.

ఈ రకం కరోనా వేగంగా విస్తరిస్తున్నట్లయితే.. అప్పుడు అన్ని రకాలుగా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో కమ్యూనికబుల్​ డిసీసెస్​ జీనోమిక్స్​ నెట్​వర్క్​ ఈ పరిణామాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

భయపడాల్సిన పనుందా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వేరియంట్​ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలో ఇప్పటికీ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి.. ఈ వైరస్​ దేశంలోకి ప్రవేశించే అవకాశాలు చాలా స్వల్పం. మిగతా దేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తత ముఖ్యం.

ఈ వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేయవు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అన్ని సార్స్​-కోవ్​-2 వేరియంట్ల(SARS-CoV-2) నుంచి టీకాలు రక్షణ కల్పిస్తాయి. మరణాలను అడ్డుకుంటాయి. సీ.1.2 వేరియంట్​పైనే వ్యాక్సిన్​ ప్రభావం అలాగే ఉంటుంది.

సీ.1.2 రకం కరోనా గురించి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి.. మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అతిచేయడం, భయపడటం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదు. కొందరు వ్యక్తులు, మీడియా చిన్నవిషయాలను అతి చేసి చూపిస్తాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏది నమ్మాలో ఏది నమ్మద్దో ప్రజలకు ఆలోచించే సమయం ఉండదు. ఇది వారిలో లేనిపోని భయాలను సృష్టిస్తుంది.

ముఖ్యంగా నిపుణులు, డబ్ల్యూహెచ్​ఓ లేదా స్థానిక ఆరోగ్య శాఖ చెప్పే, చేసే ప్రకటనలు, సూచనల ప్రకారం నడచుకోవాలి.

వ్యాక్సినే ఉత్తమ మార్గమా?

కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న కొద్దీ.. వైరస్​ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే.. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు మనకు వ్యాక్సిన్(Corona Vaccine)​ అందుబాటులో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.​ వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్​(Corona Vaccination) వేగవంతం చేయడం వల్ల.. కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చు. ఇదే వైరస్​ నివారణకు పరిష్కారం.

టీకాలతో.. కరోనాను సంపూర్ణంగా అరికట్టవచ్చని చెప్పలేం కానీ, మ్యుటేషన్ల రేటును తగ్గించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థలు అందరిలో ఒకేలా ఉండవు. వైరస్​ తీవ్రతను తట్టుకునే సామర్థ్యం ఉందా? వారికి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా? అనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా వ్యాక్సినేషన్​.. వ్యాధి తీవ్రతను మాత్రం తగ్గిస్తుంది. ఇంకా.. వైరస్​ను అరికట్టేందుకు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం​, స్వచ్ఛమైన గాలి పీల్చడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తూనే ఉండాలి.

  • భారత్​లో ఈ తరహా కేసులు ఉన్నాయా?

కరోనా కొత్త వేరియంట్‌ సీ.1.2ను భారత్‌లో గుర్తించలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటి వరకు సీ.1.2కు సంబంధించి దేశంలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదని కేంద్రం చెప్పింది.

  • ఏఏ దేశాల్లో?

ప్రస్తుతం ఇది చైనా, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్ సహా ఆరు దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఇవీ చూడండి: ఫ్రీగా టీకాలు ఇస్తున్నా వద్దంటున్న ఉత్తర కొరియా

మరో కొత్త వేరియంట్‌.. వ్యాక్సిన్‌కు తలొగ్గని 'మ్యూ'!

కరోనా కొత్త వేరియంట్- అన్నింటికంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.