ETV Bharat / crime

డీమార్ట్​లో క్యారీ బ్యాగ్స్​ కొంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..!

author img

By

Published : Dec 21, 2021, 10:32 AM IST

D Mart Carry Bags: ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది.

D Mart Carry Bags
డీమార్ట్ క్యారీ బ్యాగ్స్

D Mart Carry Bags: ప్రతి వినియోగదారుడు ఎదుర్కొనే చిన్నపాటి సమస్యే ఇది. కానీ కోట్లమంది వినియోగదారులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మూడు వేల రూపాయలు పెట్టి ఇంటి సరకులు కొన్నప్పటికీ చేతి సంచి, లేదా క్యారీ బ్యాగ్‌ కావాలన్నా రూ.3 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నాయి కొన్ని రిటైల్‌ సంస్థలు. అంతేకాదు వాటిపై తమ సంస్థ పేర్లను ముద్రించి వినియోగదారుడిని ప్రచార ఏజెంటుగా వాడుకుంటున్నాయి. ఈ విషయంలో వినియోగదారుల్లోనూ చైతన్యం పెరిగింది.

హైదరాబాద్​లోని తార్నాకకు చెందిన భగేల్కర్‌ ఆకాశ్‌కుమార్‌ 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో సరకులు కొనుగోలు చేశారు. బిల్లు రూ.602.70 అయ్యింది. ఇందులో ప్లాస్టిక్‌ బ్యాగుకు రూ.3.50 వసూలు చేశారు. సంస్థ పేరు ముద్రించినా తన వద్ద ఛార్జీ వసూలు చేశారంటూ ఫిర్యాదీ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించారు.

ఉచితంగానే ఇవ్వాలి..

స్పందించిన డీమార్ట్‌ సంస్థ.. ఫిర్యాదీవన్నీ నిరాధార ఆరోపణలని రాతపూర్వక వివరణ ఇచ్చింది. తమ వద్ద బ్రాండ్‌ పేరుతో ఉన్నవి, లేని బ్యాగులున్నాయని తెలిపింది. అవి తీసుకోవాలా వద్దా? అనేది వినియోగదారుల ఐచ్ఛికమని, వారి సంచులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ వాదనను బెంచ్‌ తోసిపుచ్చింది. వాదనలకు, వాస్తవానికి పొంతన లేదని, వినియోగదారులు తెచ్చుకుంటున్న సంచులను ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక కేంద్రంలో ఉంచాలని సూచించడం సబబేనా అని ప్రశ్నించింది. ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2011 ప్రకారం చేతి సంచులు ఉచితంగా ఇవ్వకూడదని సూచిస్తోందని తెలిపింది. 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని సూచించినట్లు బెంచ్‌ వ్యాఖ్యానించింది. పాత నిబంధనలు చూపుతూ వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేయడం సబబు కాదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇది సేవల్లో లోపమే కాకుండా వినియోగదారులను దోచుకోవడమేనని పేర్కొంది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: చేతి సంచులపై.. వినియోగదారుడి ‘పంచ్‌’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.