ETV Bharat / city

చేతి సంచులపై.. వినియోగదారుడి ‘పంచ్‌’

author img

By

Published : Dec 24, 2020, 1:23 PM IST

ప్రతి వినియోగదారుడు ఎదుర్కొనే చిన్నపాటి సమస్యే ఇది. కానీ కోట్లమంది వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. మూడు వేల రూపాయలు పెట్టి ఇంటి సరకులు కొన్నప్పటికీ చేతి సంచి, లేదా క్యారీ బ్యాగ్‌ కావాలన్నా రూ.3 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నాయి కొన్ని రిటైల్‌ సంస్థలు. అంతేకాదు వాటిపై తమ సంస్థ పేర్లను ముద్రించి వినియోగదారుడిని ప్రచార ఏజెంటుగా వాడుకుంటున్నాయి. ఈ విషయంలో వినియోగదారుల్లోనూ చైతన్యం పెరిగింది.

consumers filed cases on retail companies about carry bag issues
చేతి సంచులపై.. వినియోగదారుడి ‘పంచ్‌’

వేలకు వేల రూపాయలు పెట్టి సరకులు కొన్న వినియోగదారులకు చేతి సంచి కావాలంటే అదనంగా నగదు చెల్లించాల్సిందే. రిటైల్ సంస్థలు తమ సంస్థ పేర్లను ముద్రించి తమను ప్రచార ఏజెంటుగా వాడుకుంటున్నారని వినియోగదారులు ఆ సంస్థ నిర్వాహకులపై విరుచుకుపడుతున్నారు. షాపింగ్‌ మాల్‌లో, సూపర్‌ మార్కెట్‌లోనే ఆయా సంస్థల ప్రతినిధుల్ని నిలదీస్తున్నారు. వినకపోతే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఉపయోగించి వారి వద్ద వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం నేపథ్యంలో క్యారీకవర్లు.. చట్టాన్ని ఉపయోగించి వినియోగదారుల రికవర్లపై కథనం..

మున్సిపల్‌ అథారిటీలో జమ చేయాలి

ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీబ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి మొదలైంది. అలా వసూలు చేసిన రుసుమును వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద మున్సిపల్‌ అథారిటీలో డిపాజిట్‌ చేయాలని వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలా వసూలు చేసిన ప్రతి రూపాయి లెక్కను వినియోగదారులకు బోర్డుల ద్వారా ప్రదర్శించాలి. ఇది నగరంలో అమలు కావడం లేదు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 3000కు పైగా రిటైల్‌ సంస్థలు క్యారీ బ్యాగులపై రూ.కోట్లు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ డబ్బును స్థానిక సంస్థకు జమ చేస్తున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.

పలు కేసుల్లో కీలక తీర్పులు

సంస్థ పేరును ముద్రించిన సంచులకు డబ్బులు వసూలు చేయకూడదని వినియోగదారుల కమిషన్‌ పలు కేసుల్లో స్పష్టం చేసింది. చండీగఢ్‌ వాసి దినేష్‌ ప్రసాద్‌, బాటా సంస్థపై వేసిన కేసులోనూ జిల్లా ఫోరం ఈ తరహా తీర్పు వెలువరించింది. దినేష్‌ సదరు షోరూంలో బూట్లు కొనగా.. క్యారీబ్యాగు కోసం రూ.3 వసూలు చేశారు. అలా వసూలు చేయడం తప్పని కమిషన్‌ అభిప్రాయపడింది. ఈ కేసులో రూ.3వేల పరిహారం లభించడంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.1,000 కట్టాలని బాటా కంపెనీని ఆదేశించింది.

ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్‌ బేగంపేట్‌లోని షాపర్స్‌ స్టాప్‌లో షాపింగ్‌ చేసిన అతనికి బిల్లు కట్టే సమయంలో సంచితో కలిపి రూ.5 ఎక్కువ బిల్లు వేశారు. ఈ విషయంపై అతను తెలంగాణ రాష్ట్ర వినియోగారుల వివాదాల పరిష్కార కేంద్రంలో 2019 మే నెలలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించిన కేంద్రం సదరు సంస్థకు రూ.7వేల జరిమానా విధించింది. షాప్‌ లోగో ముద్రించి ఉంటే క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, లోగో లేని సంచి ఖరీదు కట్టి అమ్మాలని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.