ETV Bharat / crime

Vinod Jain remand Report: 'లైంగిక వేధింపులతో బాలిక చావుకు కారణమయ్యాడు'

author img

By

Published : Feb 2, 2022, 10:44 AM IST

VINOD JAIN REMANDED 14 DAYS
VINOD JAIN REMANDED 14 DAYS

REMAND TO VINOD JAIN: ’నీవు అందంగా ఉన్నావు.. కాళ్లు పొడవుగా ఉన్నాయి. జీన్స్‌ వేసుకుంటే ఇంకా బాగుంటావు..’ఇవి సినిమా డైలాగులు కాదు. తండ్రి వయస్సున్న ఓ కామాంధుడు చేసిన వేధింపులకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో రాసిన మాటలు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడ భవానీపురం వినోద్ జైన్ వేధింపులు తట్టుకోలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించారు.

REMAND TO VINOD JAIN: ఆంధ్రప్రదేశ్​లో విజయవాడలో సంచలనం రేపిన కుమ్మరిపాలెం సెంటర్ పరిధిలో బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు వినోద్ జైన్​కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. సాయంత్రం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ కోర్టులో నిందితుడిని పోలీసులు ప్రవేశ పెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం.. నిందితుడు వినోద్ జైన్ ను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా జైలుకు తరలించారు.

రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే...

‘నీవు అందంగా ఉన్నావు.. కాళ్లు పొడవుగా ఉన్నాయి. జీన్స్‌ వేసుకుంటే ఇంకా బాగుంటావు..’ అంటూ తన కుమార్తె సమానురాలైన బాలికను అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌, మెట్ల వద్ద అసభ్యకరమైన మాటలతో అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే వినోద్‌ జైన్‌ వేధించేవాడు. బాలిక శరీర భాగాలను తాకుతూ వెకిలిగా మాట్లాడేవాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. బాలిక తన సోదరుడిని స్కూలు ఆటో ఎక్కించేందుకు, సరకుల కోసం బయటకు వెళ్లే సమయంలో అక్కడే కాచుకు కూర్చొని మరీ వేధించేవాడు. ఇలా రెండు నెలలు నిత్యం నరకం చూసింది. భరించలేక.. చివరకు తనువు చాలించాలని నిర్ణయించుకుని, గత నెల 29వ తేదీన సాయంత్రం 5.15 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లి దూకి ప్రాణం తీసుకుంది.

అసలేం జరిగిందంటే..

లైంగిక వేధింపులు భరించలేక 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. అపార్ట్​మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించి, బాలిక రాసిన లేఖ ఆదివారం వెలుగు చూడటంతో సంచలనంగా మారింది. ఇదే అపార్ట్‌మెంటులో నాలుగో అంతస్తులో నివాసం ఉండే వినోద్‌ జైన్‌ (55) బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది. అతనిపై లైంగిక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 306, 354ఏ సెక్షన్‌లతో పాటు మృతురాలు మైనర్‌ కావడంతో పోక్సో కింద కేసులు పెట్టారు. ఎస్సై ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీటి సిరాతో బాలిక లేఖ!

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక రోజూ అపార్ట్‌మెంటుపై వాకింగ్‌కు వెళ్తుండేది. ఆ సమయంలో వినోద్‌ వచ్చి వెంబడించేవాడు. తల్లిదండ్రులకు చెప్పలేని బాలిక మానసికంగా ఆందోళనకు గురైంది. ఆత్మహత్యకు సిద్ధపడి శనివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. పైభాగంలో అంచున కూర్చొని ఉండగా, గమనించిన కొందరు పక్కకు రావాలంటూ వారించడంతో వచ్చేసింది. కాసేపటికి మళ్లీ వెళ్లి పైనుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

...

అమ్మా.. నేనీ విషయాన్ని...

అంతకుముందు బాలిక రాసిన మూడు పేజీల లేఖను పోలీసులు గుర్తించారు. అందులో కొంతభాగం వెలుగులోకి వచ్చింది. ‘అమ్మా.. నేనీ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. చాలా భయపడ్డా. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య వస్తే చనిపోయేదాన్ని కాదేమో! ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాను. దీనంతటికీ కారణం వినోద్‌జైన్‌. రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు. మన ఫ్లాట్‌కు వచ్చీపోయేటప్పుడు లిఫ్ట్‌, మెట్ల దగ్గర అసభ్యంగా మాట్లాడుతూ, శరీర భాగాలను తాకేవాడు. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. తప్పని పరిస్థితి వచ్చింది’ అని ఆంగ్లంలో లేఖ రాసింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం బాలిక మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌ వద్దకు తీసుకురాగా, స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని, తమకు అప్పగిస్తే చంపేస్తామంటూ నినాదాలు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకటమహేష్‌, సీపీఎం, ఐద్వా నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

తెదేపా నుంచి వినోద్‌ బహిష్కరణ

వినోద్‌జైన్‌ స్థిరాస్తి వ్యాపారి. అపార్ట్‌మెంట్‌ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. 2014లో 39వ డివిజన్‌ నుంచి భాజపా టికెట్‌ ఆశించి, చివరకు స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయాడు. తెదేపాలో చేరాక, గతేడాది 37వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నిందితుడు తెదేపా నేతలతో దిగిన ఫొటోలను వైకాపా శ్రేణులు ప్రచారం చేశాయి. ప్రతిగా నిందితుడు భాజపాలో ఉన్నప్పుడు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఉన్న ఫొటోలను తెదేపా నాయకులు బయటపెట్టారు. వినోద్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెదేపా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: సమాజంలో పెద్దమనిషిగా చలామణి.. కుమార్తె వయసున్న బాలిక పట్ల వక్రబుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.