ETV Bharat / city

బాగు కోసం సాగు బాట.. కర్షకులకు బోధిస్తూ శిక్షకులుగా..

author img

By

Published : Oct 8, 2022, 9:46 PM IST

BTECH STUDENTS INNOVATION INVENTIONS : ఆ నలుగురిదీ బీటెక్‌ చదువే.. లక్షల జీతమిచ్చే కొలువు సంపాదించాలనే తాపత్రయం కన్నా ముందు మట్టిమనుషులకు అండగా నిలవాలని తపించారు.. ఆ దిశగా ‘అగ్రిబోట్‌’ తయారు చేశారు. ఆ ఇద్దరూ ఏసీ గదుల్లో కూర్చొని ఉన్నతోద్యోగాలు చేసినవారే.. వాటిని వదిలి సాగుని లాభసాటిగా మార్చాలనే పంతంతో కదిలారు.. స్వయంగా సేద్యం చేస్తూ.. అత్యాధునిక పద్ధతుల్ని కర్షకులకు బోధిస్తూ శిక్షకులుగా మారారు. సినిమాలు, సరదాలు, సంపాదన గురించి ఆలోచించే వయసులో వ్యవసాయానికి సై అంటున్న ఆ యువ తరంగాలతో ‘ఈతరం’ మాట కలిపింది.

inventions
inventions

BTECH STUDENTS INNOVATION : అక్కడక్కడా పురుగు సోకినా.. రైతులు చేను మొత్తానికి క్రిమిసంహారక మందులు చల్లాల్సిందే. దీంతో అనవసర ఖర్చే కాదు.. ఈ పంట తినేవారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావమూ పడుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా అగ్రిబోట్‌ అనే ఆవిష్కరణ చేశారు శ్రీకాకుళం జిల్లా కె.కొత్తూరులో ఇంజినీరింగ్‌ చదువుతున్న నలుగురు విద్యార్థులు.

పంటని కాపాడే ప్రాజెక్ట్‌

డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ: సాధారణంగా కీటకాల నివారణకు రైతులే స్ప్రేయర్లతో పురుగుల మందులను పిచికారీ చేస్తుంటారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అతి కొద్దిమంది.. డ్రోన్లను వినియోగిస్తుంటారు. ఈ రెండు విధానాల్లోనూ చీడ ఉన్నచోట, లేనిచోట పురుగుమందు అంతటా సమానంగా పరుచుకుంటుంది. కీటకాలు ఉంటే సరే.. లేని చోట సైతం పిచికారీ చేయడంతో పంటపై రసాయనాలు ఎక్కువవుతాయి. దీంతో ఈ పంట తినేవారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రైతులు, వినియోగదారులకు పెద్ద సమస్యగా మారిన దీని పరిష్కారానికి బీటెక్‌ మూడో ఏడాది విద్యార్థులు లింగూడు ప్రమీల, మజ్జి నిహారిక, నెల్లి వివేకవర్ధిని, ససాల భార్గవ్‌ నడుం బిగించారు. ప్రాజెక్టులో భాగంగా ఒక రోబోట్‌ని తయారు చేశారు. ఇది క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎడ్జ్‌ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. పంటకి సోకిన కీటకాలు, పురుగులను కనిపెట్టి, వాటిపై మాత్రమే రసాయనాలు చల్లేందుకు ఇందులో థర్మల్‌ కెమెరాలను వినియోగించారు.

సాధారణంగా వీటిని రక్షణశాఖలో వినియోగిస్తారు. రాత్రివేళల్లో సైతం ఇవి లక్ష్యాలను గుర్తిస్తాయి. పొలంలో ఏ ప్రాంతంలో, ఏ స్థాయిలో క్రిములు, కీటకాలు ఉన్నాయో గుర్తించి ఆమేర పిచికారీ చేస్తుందీ బోట్‌. దీంతో అనవసర వ్యయం, వాతావరణ కాలుష్యం, మానవాళి ఆరోగ్యంపై రసాయనాల ప్రభావం తగ్గుతాయి. ఐఐటీ ముంబయిలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఈ అగ్రిబోట్‌ని ప్రదర్శించారు. ఇందులో ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు చెందిన పలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ రైతులకు ఉపయుక్తంగా ఉందంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఐఈఈఈ) సంస్థ ప్రశంసించింది.

మరింత మెరుగ్గా:- ప్రమీల
మేం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. రైతుల కష్టాలు తెలుసు. వారికి అండగా నిలవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టాం. ఐఈఈఈ, మా గైడ్‌ సలహాలతో ప్రాజెక్టును ఇంతవరకు తీసుకొచ్చాం. ఒక్కో యూనిట్‌కి రూ.50వేలు అవుతుంది. పెద్దఎత్తున తయారు చేస్తే ఖర్చు తగ్గించొచ్చు. మరిన్ని పరిశోధనలు చేసి ఈ ఆవిష్కరణని మరింత మెరుగు పరుస్తాం.

స్టార్టప్‌ వ్యవసాయం..

పెద్ద చదువులు చదివారు.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితం హాయిగా సాగిపోతున్నా.. మనసంతా వ్యవసాయంపైనే ఉండేది. సరైన దిగుబడి లేక.. దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడే రైతులను చూస్తే తల్లడిల్లిపోయేవారు ఆ ఇద్దరు. సాగును లాభసాటిగా మార్చే తపనతో అంకురసంస్థ ప్రారంభించడమే కాదు.. స్వయంగా వ్యవసాయం చేస్తూ 25 ఏకరాల్లో ఫుడ్‌ ఫారెస్ట్‌ సృష్టించారు.

పేర్ల నవీన్‌ది విశాఖపట్నం. కంపెనీ సెక్రటరీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ చేసి పన్నెండేళ్లు హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ నగరాల్లో వివిధ హోదాల్లో పని చేశాడు. హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీలో చదివిన వజ్రపు సుధీర్‌ది విజయనగరం. ఓ సమావేశంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి ఆశయం, ఆసక్తి.. రైతులకు వెన్నుదన్నుగా నిలవడమే. దీనికోసం స్వయంగా రంగంలోకి దిగి సేద్యాన్ని లాభసాటి వ్యాపకంగా మార్చాలనుకున్నారు. 2020 ఆగస్టులో ‘ఎఫ్‌ఆర్‌ఎంఆర్‌ ఎకో సిస్టం ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో స్టార్టప్‌ మొదలుపెట్టారు. అదే సమయంలో విజయనగరం జిల్లాలో ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారం మూతపడింది.

రైతుల నుంచి సేకరించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు సరఫరా: రైతులు పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడటం గుర్తించారు. కొద్ది దూరంలో ఉన్న మరో కర్మాగారం యాజమాన్యంతో మాట్లాడి 38 వేల టన్నుల చెరుకును తరలించి, విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించే ఏర్పాటు చేశారు. ఇదికాక వారి నుంచి పసుపు, మిరియాలు, కాఫీ గింజలు, ధాన్యం, మిర్చి పంటలను కొనుగోలు చేసి బెంగళూరు, కొచ్చిన్‌, ముంబయి, కోయంబత్తూరులోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. గతేడాది దాదాపు రూ.10 కోట్ల లావాదేవీలు చేశారు. ఇదికాక అక్కడే 25 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం ప్రారంభించారు. మంచి దిగుబడి వచ్చినా ధర లేక మొదటి ఏడాది నష్టాలే మిగిలాయి. దీంతో ఏ నేలలో ఎలాంటి పంట వేయాలి? దిగుబడి నాటికి ధరలు ఎలా ఉండనున్నాయి? తదితర అంశాలపై ఆరునెలల పాటు అధ్యయనం చేశారు.

వాతావరణానికి అనుకూలంగా పంటల సాగు: అక్కడి వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా బొప్పాయి, అరటి, జామ, ఖర్బూజ, పసుపు, కూరగాయలు సాగు చేస్తున్నారు. పండిన పంటను నేరుగా సూపర్‌మార్కెట్లకు సరఫరా చేస్తూ మొత్తానికి లాభాల్లోకి వచ్చారు. ఈ సమయంలో తాము నేర్చుకున్న సాగు విధానాలను చుట్టుపక్కల రైతులకు నేర్పుతూ అవగాహన కల్పిస్తున్నారు. వారిలా వ్యవసాయం చేయాలనుకుంటున్న వారికి సలహాలు, సూచనలు అందించడానికి ‘ఫామింగ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ (ఎఫ్‌ఏఏఎస్‌) పేరుతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో భాగంగా విత్తనం నుంచి విక్రయం వరకు వీళ్లే అన్నీ దగ్గరుండి చూసుకుంటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.