ETV Bharat / business

నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!

author img

By

Published : Oct 18, 2022, 5:19 PM IST

పండగల వేళ ఎన్నో రాయితీలు.. చేతిలో డబ్బు లేకున్నా కోరుకున్న ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా రుణ సదుపాయాలు.. ప్రధానంగా సున్నా వడ్డీతో వాయిదాల (జీరో కాస్ట్‌ ఈఎంఐ) సౌలభ్యం ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. దీన్ని ఉపయోగించుకునే ముందు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం.

zero cost emi
no cost emi

ఖరీదైన టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు ఒకేసారి మొత్తం ధరను చెల్లించక్కర్లేకుండా వాయిదాల పద్ధతిని ఎంచుకోవచ్చు. డబ్బు చేతిలో లేనప్పుడు ఇది ఎంతో అనుకూలమైన అంశమే.

వదులుకుంటేనే..
ఒకేసారి మొత్తం డబ్బును చెల్లించినప్పుడు కొన్ని రాయితీలు ఉంటాయి. ఉదాహరణకు రూ.5,000 వస్తువును 10 శాతం రాయితీతో రూ.4,500లకు సొంతం చేసుకోవచ్చు. సున్నా వడ్డీ వాయిదాలో కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ రాయితీ అందదు. అంటే, తగ్గింపును వదులుకోవాలన్నమాట.

మరో సందర్భంలో ఉత్పత్తి ధర రూ.5,000 అనుకుందాం. నెలకు రూ.500 చొప్పున 12 నెలల పాటు చెల్లించాల్సి రావచ్చు. అంటే అదనంగా 20 శాతం, రూ.1,000. అప్పుడు ఆ వస్తువు ధర రూ.6,000 అవుతుంది. సాధారణంగా సున్నా వడ్డీ అని చెప్పినా.. రాయితీలు ఇవ్వకపోవడం లేదా ప్రాసెసింగ్‌ ఫీజుల రూపంలో ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటారన్నమాట. సాధారణ ఈఎంఐని ఎంచుకున్నప్పుడు వడ్డీ భాగాన్ని విడిగా చూపిస్తుంటారు. కానీ, నో కాస్ట్‌ ఈఎంఐలో ఇలా ప్రత్యేకంగా వడ్డీ ఉండదు.

ఎప్పుడు ఎంచుకోవాలి..
ఖరీదైన ఉత్పత్తిని కొనాలనుకొని, ఒకేసారి ఆ మొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నోకాస్ట్‌ ఈఎంఐను ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు వ్యాపారులు, ఇ-కామర్స్‌ సంస్థలు ఎంపిక చేసిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేక రాయితీలతోపాటు, ఈఎంఐ వెసులుబాటు కల్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనూ ఈ వెసులుబాటును వాడుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం..
రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సున్నా వడ్డీ వాయిదాలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఒకటికి మించి వాయిదాలు చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో మీ చెల్లింపు సామర్థ్యాన్ని తనిఖీ చేసుకోవడం చాలా అవసరం.

రుసుములూ చూడాలి..
సున్నా వడ్డీ వాయిదాల్లో కొనుగోలు చేస్తున్నప్పుడు ముందస్తు చెల్లింపు మొత్తం, ఆలస్య రుసుముల్లాంటివి పరిశీలించాలి. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే ఈ వెసులుబాటును ఉపయోగించుకోండి.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత ధరలు ఎంతంటే?

మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్​కార్ట్​.. త్వరలోనే 'బిగ్​ దీపావళి సేల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.