ETV Bharat / business

థర్డ్ పార్టీ మోటార్ బీమా.. ఏ వాహనానికి ఎంత ప్రీమియం కట్టాలి? కొత్త రూల్స్ ఇవే..

author img

By

Published : Jun 20, 2023, 8:50 PM IST

Updated : Jun 20, 2023, 10:17 PM IST

Third party insurance premium : 2023-24 ఆర్థిక సంవత్సరానికి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. పలు వాహనాలకు ప్రీమియంలో రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి ఏ వాహనానికి ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసా?

third-party-insurance-premium
third-party-insurance-premium

Third party insurance premium : థర్డ్-పార్టీ మోటర్ ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2023-24 సంవత్సరానికి కొత్త ప్రీమియం రేట్లను నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలతో పాటు, ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహణాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్​మెంట్ అథారిటీ (ఐఆర్​డీఏఐ)తో సమన్వయం చేసుకొని ఈ ముసాయిదాను సిద్ధం చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ ప్రీమియం రేట్లు ఇలా ఉన్నాయి.

  • 1000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్లకు రూ.2,094 ప్రీమియంగా నిర్ణయించారు.
  • 1000- 1500 సీసీ మధ్య ఉన్న కార్లకు ప్రీమియం రేటును రూ.3,416గా పేర్కొన్నారు.
  • 1500 సీసీ కన్నా అధిక సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్లు రూ.7,897ను ప్రీమియంగా చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ద్విచక్ర వాహనాలకు ప్రీమియం రేట్లు ఇలా...

  • 75 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన టూవీలర్లకు థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.538గా నిర్ణయించారు.
  • ఇక 75 సీసీ నుంచి 350 సీసీ వరకు సామర్థ్యం కలిగిన వివిధ కేటగిరీల టూవీలర్లకు ప్రీమియం రూ.714 నుంచి రూ.2,804 మధ్య ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు.

వాణిజ్య వాహనాలకు ఎంతంటే?
సరకు రవాణాకు వినియోగించే వాణిజ్య వాహనాల(త్రీవీలర్లు కాకుండా)కు సైతం ప్రీమియం మొత్తాన్ని ముసాయిదాలో పేర్కొన్నారు. 7500 కేజీలకు మించని వాహనాలకు ప్రీమియం మొత్తాన్ని రూ.16,049గా నిర్ణయించారు. ఇక 7500 కేజీలకు మించిన వాహనాల నుంచి 40వేల కేజీలు, ఆపై వాహనాలకు ప్రీమియం రూ.27,186 నుంచి రూ.44,242 మధ్య ఉంటుందని ముసాయిదా పేర్కొంది. సరకు రవాణాకు వినియోగించే త్రీవీలర్ మోటార్ వాహనాలకు ప్రతిపాదిత ప్రీమియం రేటును రూ.4,492గా పేర్కొన్నారు.

ప్రైవేటు ఈ-కార్లకు ప్రీమియం రేట్లు ఇలా..

  • 30 కిలో వాట్ మించని ఈ- కార్లకు: రూ.1,780
  • 30 కిలోవాట్- 65 కిలోవాట్ ఈ-కార్లకు: రూ.2,904
  • 65 కిలోవాట్​కు పైబడిన ఈ-కార్లకు: రూ.6,712

ఈ-టూవీలర్లకు ప్రీమియం రేట్లు

  • 3KW: రూ.457
  • 3KW-7KW: రూ.607
  • 7KW-16KW: రూ.1161
  • 16KWపైన ఉండే టూవీలర్లకు రూ.2,383

బ్యాటరీ ఆధారంగా పనిచేసే వాణిజ్య వాహనాలకు (త్రీవీలర్ కాకుండా) రేట్లు ఇలా..

  • 7500 కేజీల వరకు రూ.13,642
  • 7500-12000 కేజీలు- రూ.23,108
  • 12,000-20,000 కేజీలు- రూ.30,016
  • 20,000-40,000 కేజీలు- రూ.37,357
  • 40,000 కేజీల పైన- రూ.37,606

విద్యా సంస్థలకు చెందిన బస్సులకు 15 శాతం డిస్కౌంట్ ప్రతిపాదిస్తున్నట్లు ముసాయిదాలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. వింటేజ్ కారుగా రిజిస్టర్ అయిన ప్రైవేటు కారుకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ లభించనున్నట్లు పేర్కొంది. త్రీవీలర్ ప్యాసింజర్ వాహనాలకు 6.5 శాతం ప్రీమియంలో డిస్కౌంట్ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపింది.

Last Updated :Jun 20, 2023, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.