ETV Bharat / bharat

రాహుల్​ పిటిషన్​ను​ స్వీకరించిన గుజరాత్​ హైకోర్టు.. ఆరోజే తుది విచారణ

author img

By

Published : Apr 29, 2023, 4:26 PM IST

Updated : Apr 29, 2023, 5:23 PM IST

పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ వేసిన పిటిషన్​ను గుజరాత్​ హైకోర్టు స్వీకరించింది. విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

Gujarat High Court Rahul Gandhi defamation case
Gujarat High Court Rahul Gandhi defamation case

పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్​ను గుజరాత్​ హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం.. వాదనలు విన్న హైకోర్టు.. మే 2కు విచారణను వాయిదా వేసింది. సూరత్​ కోర్టు విధించిన శిక్షపై తమ అభిప్రాయాన్ని తెలపాలని.. రాహుల్​ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించింది. మే 2న తుది వాదనలు ఉంటాయని.. ఇరు పక్షాలు హాజరు కావాలని గుజరాత్​ హైకోర్టు ఆదేశించింది.

రాహుల్​ తరఫున గుజరాత్ హైకోర్టులో వాదించిన న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ.. ఈ దేశంలో 13 కోట్ల మంది మోదీలు ఉన్నారన్నారు. వారంతా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన నేరం కాదన్న ఆయన.. రాజకీయ కారణాలతోనే రాహుల్​పై ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అందుకే తాము స్టే కోరుతున్నామని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.

మరోవైపు కొన్ని రోజుల క్రితం సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోర్టుకు అభ్యర్థించారు. అంతకుముందు రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​ను సూరత్​ సెషన్స్​ కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా జడ్జి ఆర్​పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల.. కచ్చితంగా ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీ ప్రతిష్ఠకు హాని కలిగి ఉండవచ్చుని జస్టిస్​ ఆర్‌పీ మొగేరా అభిప్రాయపడ్డారు. అలాగే ఆయన మానసిక వేదనకు గురి కావొచ్చన్నారు.

అంతకుముందు ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్​ సెషన్స్​ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.

కేసు ఏంటంటే?
2019 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే రాహుల్​.. తన బంగ్లాను ఖాళీ కూడా చేశారు.

Last Updated :Apr 29, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.