ETV Bharat / bharat

సీఎం తల్లికి చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్! విచారణకు సీఎంఓ ఆదేశం

author img

By

Published : Apr 29, 2023, 7:26 AM IST

హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి సుఖ్విందర్​ సింగ్​ సుఖు తల్లికి.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ డాక్టర్​ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. స్పందించిన అధికారులు.. సంబంధిత వైద్యుడికి షోకాజ్​ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. ఈ వ్యవహారంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

doctor Indecent behavior with Himachal CM mother
doctor Indecent behavior with Himachal CM mother

హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి సుఖ్విందర్​ సింగ్ సుఖు తల్లితో ఓ ఆస్పత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఆయన తల్లి ఆరోపించారు. ఏప్రిల్​ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వియషంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్.. విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన హమీర్​పుర్​ జిల్లాలో జరిగింది.

వివరాలు ఇలా..
సుఖ్విందర్​ సింగ్​ సుఖు తల్లి సంసారో దేవి ఏప్రిల్​ 9న కడుపునొప్పితో నాదౌన్​ సివిల్​ ఆస్పత్రికి వెళ్లారు. ఆమె వెంట ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్​ అసభ్యంగా ప్రవర్తించారని సంసారో దేవి ఆరోపించారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజే సీఎం సుఖ్విందర్.. హమీర్​పుర్​లో పర్యటించారు. జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్​ 10న హమీర్​పుర్​ చేసుకున్న సుఖ్విందర్​.. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్​ను (సీఎమ్​ఓ) వివరణ కోరారు. అనంతరం డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు అధికారులు.

అయితే, షోకాజ్​ నోటీసుకు సమాధానం ఇచ్చిన డాక్టర్​.. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని.. రోగితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరినట్లు చెప్పారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు సమాధానమిచ్చాడు. వైద్యుడి స్పందన అనంతరం.. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ ఆర్​కే అగ్నిహోత్రి. బ్లాక్​ మెడికల్​ ఆఫీసర్​ (బీఎమ్​ఓ) నేతృత్వంలోని ఈ కమిటీ.. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని అగ్నిహోత్రి తెలిపారు. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

'తప్పు చేస్తే కుమారుడినైనా కొడతా..'
గతేడాది డిసెంబర్​లో హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్​ సింగ్​ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంలో ఆయన తల్లి సంసారో దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే.. తన కుమారుడ్ని ఇప్పటికీ కొడతానని చెప్పారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సుఖును ప్రభుత్వ ఉద్యోగిని చేయాలనుకున్నానని.. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారని ఆమె తెలిపారు. కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి బిడ్డేనని.. పెళ్లైన తర్వాత కూడా అనేక సార్లు సుఖును కొట్టానని చెప్పారు. ఇంత వయసు, హోదా వచ్చినా.. ఏనాడూ తనకు ఎదురు చెప్పలేదని అన్నారు.

కళాశాలకు వెళ్లినా.. రాజకీయ కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనేవారని, ఇంటికి ఎప్పుడూ ఒంటరిగా వచ్చేవారు కాదని గుర్తు చేసుకున్నారు. తన కుమారుడితో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజనం పెట్టే పంపించానని చెప్పారు. తన భర్త రూ.90 జీతంతో ఆరుగురు ఉన్న కుటుంబాన్ని పోషించేవారని తెలిపారు. తన భర్త.. రాజకీయ నాయకుల వాహనాలు నడిపేవారని.. ఇప్పుడు తన కుమారుడు రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు సంసారో దేవి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.