ETV Bharat / bharat

క్విట్ ఇండియా.. ఉషోదయానికి ఊపిరిలూదిన ఉద్యమం

author img

By

Published : Aug 8, 2021, 7:30 AM IST

Updated : Aug 8, 2021, 2:58 PM IST

1947 ఆగస్ట్‌ 15. స్వతంత్ర భారతవని ఆవిర్భవించిన రోజు. ఒక సరికొత్త దేశం ఉదయించిన క్షణం. దేశం నలుమూలాల సంబరాలు అంబరాన్నింటిన చారిత్రక సమయమది. అంతులేని ఆనందం వెల్లి వెరిసింది. ఆ ఉద్నిగ్నభరితమైన ఘట్టాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ మరికొద్దిరోజుల్లోనే 70 ఏళ్ల తిరంగ పండుగకు సిద్ధమవుతోంది యావత్‌ భారతం. ఆ క్రమంలో ఈసారి అంతకముందే వచ్చిన మరో విశేషం... వజ్రోత్సవాల క్విట్‌ఇండియా ఉద్యమం. భారత స్వతంత్ర పోరాటంలో చిట్టచివరి కీలకపోరాటంగా నిలిచిపోయిన ఈ మైలురాయికి, ఈ ఆగస్ట్‌ 8కి 75ఏళ్లు. వందేమాతరం నినాదం తర్వాత అంత మహత్తరంగా, అంతకన్నా ఉద్ధృతంగా, యావత్‌ దేశాన్ని ప్రభంజనంలా నడిపించిన మంత్రం క్విట్‌ ఇండియా ఉద్యమం నాటి జ్ఞాపకాలను స్మరించుకునేలా వేడుకలకు సిద్ధమవుతోంది దేశం.

quit india
క్విట్ ఇండియా

క్విట్ ఇండియా ఉద్యమం

'క్విట్‌ ఇండియా'

'భారత్‌ ఛోడో'

'ఈ దేశం విడిచి పో...'

భాష ఏదైనా.. వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరుగు పెట్టించిన నినాదమిది.

ఆగస్ట్‌ విప్లవంగా చరిత్రలో నిలిచిపోయిన మహత్తర పోరాటానికి ఊపిరిలూదింది.

ఎవరు కలిసి వచ్చినా రాకున్నా.. సాధారణ ప్రజలే సాటిలేని సాహసం, అపూర్వ సమరశీలత ప్రదర్శించారు.

డూ ఆర్ డై(Do or Die) అన్న గాంధీజీ పిలుపుతో యావత్‌ భారతవని ఉవ్వెత్తున ఎగిసి ఉద్యమబాట పట్టింది.

స్వతంత్ర సాధనలోనే చావోరేవో తేల్చుకోవాలని విప్లవశంఖం పూరించింది. అందుకే ఎవరు అవును అన్న.. కాదు అని అన్నా... సంపూర్ణ స్వరాజ్య సాధన పోరాటంలో అదో మేలిమలుపు.

75ఏళ్ల వజ్రోత్సవాల సందర్భంగా అదే చరిత్రపుటల నుంచి భరతజాతికి కొత్తసందేశం పంపుతోంది . ఎందరో స్వతంత్రసమరయోధుల పోరాటఫలంగా వచ్చిన స్వతంత్ర భారతావనికి ఒక్కసారి నాటి సంఘటనలను మననం చేస్తోంది.

గాంధీజీ పిలుపు

మితవాద, అతివాద దశలు దాటుకుని గాంధేయ వాదంతో.. భారత స్వతంత్ర్యోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఎన్నో పోరాటాలు. విభిన్న పంథాల్లో నిరసనలు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాధిపతుల్లో చలనం వస్తేనా! ఐనా వారి పీఠాలు కదిలించి.. భరతమాతను దాస్య విముక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వతంత్ర పోరాటాన్ని కొత్తఎత్తులకు తీసుకెళ్లడానికి జాతీయకాంగ్రెస్‌ నాయకులంతా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. దేశాలకు దేశాలే యుద్ధోన్మాదంతో ఊగిపోయిన రెండో ప్రపంచయుద్ధం నాటికి వారికి మరో సరైన అవకాశం వచ్చింది. ఆంగ్లేయులు... ఈ దేశ పౌరుల సమ్మతితో సంబంధం లేకుండానే భారత్‌ను యుద్ధంలో పాత్రధారి చేశారు. అందుకు సంబంధించిన క్రిప్స్‌ రాయబారం విఫలమైన వెంటనే యుద్ధానికి భారత సేనల్ని పంపడాన్ని నిరసిస్తూ... తక్షణ దేశ స్వతంత్రం కాంక్షిస్తూ గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు.

ఆంగ్లేయులు, కాంగ్రెస్‌ మధ్య చర్చలు విఫలమైన వెంటనే క్విట్‌ ఇండియా ఉద్యమ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్షణం నుంచి భారతీయులు స్వతంత్రులుగా వ్యవహరించాలని.. పరాయిపాలన సహించవద్దని సందేశాన్నిచ్చారు. బాంబేలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాల్లో ఈ మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. 1942ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమం తీర్మానం ఆమోదించారు. ఆ సందర్భంగా మహాత్మాగాంధీ చేసిన ప్రసంగం మరో చరిత్రాత్మక ఘట్టం. కోట్లాదిమంది భారతీయుల గుండెగుండెలో క్విట్‌ ఇండియా ఉద్యమ స్పూర్తినింపింది.

"మన ముందు ఓ మంత్రం ఉంది. చాలా చిన్నది. అదే గుండెల నిండా ముద్రించుకుందాం. ప్రతిశ్వాసలో బలంగా పఠిస్తూ నినదిద్దాం. చావోరేవో అన్నదే ఆ మంత్రం"

-మహాత్మా గాంధీ, జాతిపిత

తారకమంత్రం

నాడు గాంధీజీ అన్న ఇవే మాటలు బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, దేశ ప్రజలకు వినిపిస్తూ మహాత్మాగాంధీ ఉద్వేగంగా చేసిన ప్రసంగం దేశంలో ప్రతి ఒక్కరి హృదయాలనూ తట్టి లేపి సమరానికి సన్నద్ధం చేసింది. శాంతి, సౌభ్రాతృత్వాలకు తప్ప ఉన్మాదచర్యలకు సహకరించేది లేదని... భారతీయులు వారి భవిష్యత్‌ గతిని వారే నిర్దేశించుకోగలరని.. ఇంకెంతమాత్రం వలసపాలనను సహించేది లేదన్న సందేశం తారకమంత్రాలై జనవాహిని ప్రజవిప్లవ సేనావాహినిగా మార్చాయి. తర్వాతి రోజు..1942 ఆగస్టు 9న సూర్యుడు ఉదయిస్తునే ఉద్యమం హోరెత్తించారు.

అణచివేత యత్నాలను ఎదిరించి..

ఒకవైపు యుద్ధంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఆంగ్లేయులు చేయని ప్రయత్నం లేదు. ఆగస్టు 8 అర్థరాత్రి నుంచే కాంగ్రెస్‌ నాయకులందర్నీ ఎక్కడికక్కడ నిర్భంధించారు. భారత కాంగ్రెస్‌ను నిషేధించారు. గాంధీ, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి అగ్రనాయకత్వాన్ని మొత్తం అరెస్ట్ చేసి జైళ్లకు పంపారు. ఆల్‌ ఇండియా ముస్లింలీగ్, సంస్థానాలు, పోలీస్‌వ్యవస్థ, బ్రిటీష్‌ ఇండియన్ ఆర్మీ, ఆంగ్లేయుల ప్రాపకంలో పబ్బం గడపడానికి అలవాటు పడ్డ అధికారులు, వ్యాపార వర్గాలు... అందరూ ఉద్యమానికి దూరంగా నిలిచారు. హిందూమహాసభ, వామపక్షాలు, స్వయం సేవక్‌ సంఘ్‌ వంటి సంస్థలూ మద్దతు పలకలేదు.

అలా నాయకత్వంలేని ఉద్యమం నీరుగారక తప్పదని ఆశపడ్డ తెల్లదొరలకు తెల్లారేసరికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్టు 9 ఉదయం ముంబై బహిరంగ సమావేశానికి 3లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించే నేతలు లేకపోవటంతో వీరవనిత అరుణా ఆసఫ్ అలీ బహిరంగ సభకు నాయకత్వం వహించారు.

త్రివర్ణ పతాక చేబూని, కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్న గోవాలియా టాంక్ మైదానం దద్దరిల్లేలా క్విట్‌ ఇండియా అంటూ ఆమె చేసిన నినాదం యావత్‌ భారతావనినీ మేల్కొలిపింది.

గ్రామాలకు ఉద్యమం..

ముంబైలో అహింసామార్గంలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదటే అణచి వేసేందుకు బ్రిటిష్ పోలీసులు లాఠీ ఛార్జీలు ప్రయోగించారు. అయినా క్రమంగా దేశంలోని అన్ని నగరాల్లో ఉద్యమం ఊపందుకుంది. కార్మికులు పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసులు లాఠీ ఛార్జీలు, కాల్పుల ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ పోరు రోజురోజుకూ తీవ్రమైందే గానీ.. ఏమాత్రం తగ్గలేదు. ప్రారంభంలో నగర ప్రాంతాల్లోనే ఆరంభమైనా... చిన్నగా గ్రామాలకూ వ్యాపించింది.

హింసాత్మకం

స్వతంత్ర సమరయోధులపై పోలీసు కాల్పులపై ఆగ్రహించిన ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. క్రమంగా ఉద్యమం అదుపుతప్పింది. హింసాత్మకమైంది. విద్యుత్, టెలిఫోన్ సేవలకు పూర్తి అంతరాయం కలిగింది. యువకులు, విద్యార్థులూ ఆందోళనబాట పట్టారు. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడికక్కడే ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా మహరాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బంగ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో ఆందోళనకారులు సమాంతరప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. అన్నింటికీ ఎదురొడ్డి నిలిచారు.

1943 ఉద్యమం నీరస పడడానికి ఆంగ్లేయుల దారుణమైన అణచివేత ఒకకారణమైతే.. డొక్కలు ఎండబెట్టి లక్షలమంది ప్రాణాలు బలిగొన్న భయంకరమైన కరవూ మరో హేతువయింది.

ఉషోదయానికి నాంది...

క్విట్‌ ఇండియా ఉద్యమంలో 1942 చివరకే లక్షమందికి పైగా అరెస్టయ్యారు. 26 వేల మందికి శిక్షలు విధించారు. 18 వేల మందిని ఇండియా రక్షణచట్టం క్రింద నిర్భింధించారు. భారీ స్థాయిలో జరిమానాలు విధించారు. సైనిక పాలన ప్రకటించలేదు గానీ... అదే అంతే పని చేశారు. పోలీసుల కాల్పుల్లో వేలాదిమంది అసువులు బాశారు. రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. లెక్కకుమించి రైల్వే స్టేషన్లు, పోస్టీఫీసులు, ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి. ప్రభుత్వకార్యాలయం కనిపిస్తే చాలు దాడులు చేశారు. తెల్లవాళ్ల కింద పనిచేసే అధికారులపై కూడా భౌతికదాడులు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజురోజుకి పెరిగిన ఉద్యమం బ్రిటిష్ పాలకుల్లో కొత్త అలజడిని రేకెత్తించింది. ఉద్యమం ధాటికి బ్రిటీష్‌ సింహాసనం తల కిందులు అయింది. అనంతర పరిణామాల్లో 1947 ఆగస్టు 15 ఉషోదయానికి ఊపిరిలూదింది.

ఇవీ చదవండి:

Last Updated :Aug 8, 2021, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.