ETV Bharat / bharat

'మోదీని ప్రశ్నిస్తూనే ఉంటా.. అరెస్టు చేసినా భయపడను'.. ప్రెస్​మీట్​లో రాహుల్

author img

By

Published : Mar 25, 2023, 1:18 PM IST

Updated : Mar 25, 2023, 3:59 PM IST

తనపై అనర్హత వేటు వేసినంత మాత్రాన ప్రశ్నలు అడగడం మానేయబోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తాను భయపడనని పేర్కొన్నారు. అరెస్టు చేసినా తాను వెనకడుగు వేయబోనని అన్నారు.

RAHUL GANDHI PRESS MEET
RAHUL GANDHI PRESS MEET

మోదీ సర్కారును తాను ప్రశ్నలు అడగడం మానే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా ప్రకటించిన మాత్రాన.. భయపడేది లేదని చెప్పారు. భయపడటమనేది తన చరిత్రలోనే లేదని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేసినా వెనకాడబోనని అన్నారు. నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా తేలడం, అనర్హత వేటుకు గురికావడం వంటి పరిణామాల తర్వాత తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాహుల్.. దేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని ఆరోపించారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు.
అదానీ- మోదీ మధ్య స్నేహంపైనా ప్రశ్నలు సంధించారు రాహుల్. నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్​పోర్టులను అదానీకి కట్టబెడుతున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దాని గురించి మాట్లాడినందుకే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

"అదానీకి షెల్ కంపెనీలు ఉన్నాయి. అందులో రూ.20 వేల కోట్లు ఎవరో పెట్టుబడులు పెట్టారు. అది అదానీ డబ్బు కాదు. అసలు ఈ రూ.20వేల కోట్లు ఎవరివి? అదానీ- మోదీ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. మోదీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఉంది. దానికి చాలా రుజువులు ఉన్నాయి. దీనికి సంబంధించి నేను పార్లమెంట్​లోనూ మాట్లాడా. కానీ నా ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అదానీ గురించి మాట్లాడినందుకే తనపై అనర్హత వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తనపై అనర్హత వేటు వేసినంతమాత్రాన మాట్లాడటంలో తేడా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జీవితాంతం తనను అనర్హుడిగా ప్రకటించినా.. తన పని తాను చేసుకుంటానని చెప్పారు. 'నేను పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా తేడా ఏంలేదు. ఎక్కడైనా నా ప్రశ్నలు కొనసాగుతాయి. ప్రస్తుతం నేను సత్యం అనే తపస్సు చేస్తున్నా. అది ఎప్పటికీ కొనసాగుతుంది' అని రాహుల్ తేల్చి చెప్పారు.

"నాపై ఎందుకు అనర్హత వేటు వేశారో ఆలోచించండి. మోదీ, అదానీ మధ్య విడదీయరాని బంధం ఉంది. దాని గురించే నేను మాట్లాడుతున్నా. నా తర్వాతి ప్రసంగానికి భయపడే అనర్హత వేశారు. అదానీ షెల్ కంపెనీలకు రూ.20 వేల కోట్లు ఎలా వచ్చాయి. అదానీ షెల్ కంపెనీల్లో కొన్ని డిఫెన్స్‌వి కూడా ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఎందుకు అభ్యంతరం లేవనెత్తదు? అత్యంత అవినీతి వ్యక్తికి.. ప్రధాని ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ నేతలు అదానీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు. మీరు (బీజేపీ నేతలు) బీజేపీని వెనకేసుకు రండి. అదానీని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? దేశమంటే అదానీ.. అదానీ అంటే దేశం అనేలా తయారు చేశారు. ఈ ప్రశ్నలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నాపై అనర్హత వేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఆరోపణలపై సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని స్పీకర్​ను కోరినా.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వివరించారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్​ను కొట్టిపారేశారు. తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని పేర్కొన్న ఆయన.. గాంధీ ఎప్పటికీ క్షమాపణ చెప్పరని స్పష్టం చేశారు. అనర్హత వేటు తర్వాత తనకు మద్దతుగా నిలిచిన విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

పైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు: బీజేపీ ప్రశ్న
వెనుకబడిన వర్గాలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తుందని కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాహుల్‌గాంధీకి విమర్శించే హక్కు ఉంది కానీ.. అవమానించే హక్కు లేదని తేల్చిచెప్పారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోర్టు సూచించినా పట్టించుకోలేదని రవిశంకర్ తెలిపారు. చట్టం అందరికీ సమానమేనన్న రవిశంకర్‌ ప్రసాద్‌.. పరువునష్టం కేసులో ఇప్పటివరకు 25 మందిపై అనర్హత వేటు పడిందని.. రాహుల్‌గాంధీ అందుకు అతీతుడేమీ కాదని స్పష్టం చేశారు. రాహుల్‌కు విధించి శిక్షపై.. పై కోర్టులో అప్పీలుకు వెళ్లకుండా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని రవిశంకర్ ఆరోపించారు.

"రాహుల్‌ గాంధీపై ఏడు పరువునష్టం కేసులు ఉన్నాయి. వెనుకబడిన వర్గాలను అవమానించిన రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేస్తాం. ఆయన (రాహుల్‌) వద్ద పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు. వారు సూరత్‌ సెషన్స్‌ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కాంగ్రెస్ నేత పవన్‌ ఖేడా విషయంలో గంటలో సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లోని న్యాయవాదులు రాహుల్ విషయంలో ఎందుకు మౌనం వహించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని బాధితుడిగా చూపించి కర్ణాటక ఎన్నికల్లో లాభం పొందాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి

'తప్పులు సహజం.. క్షమాపణ ఏది?'
OBCలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు, లోక్‌సభ సభ్యత్వం రద్దుతో కేంద్రానికి సంబంధం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ఐదేళ్ల కింద కర్ణాటకలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు చట్టపరమైన శిక్ష పడిందన్నారు. ఈ ఘటనపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాహుల్‌పై కేసు నమోదైందన్నారు. ప్రసంగాలు చేసే సమయంలో ఎవరికైనా తప్పులు దొర్లడం సహజమన్న హిమంత.. రాహుల్ వెంటనే ఆ రోజు క్షమాపణ కోరి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

కాంగ్రెస్ ఆందోళనలు
ఇదిలా ఉండగా.. రాహుల్​కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రాహుల్​పై అనర్హత వేటును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. కేరళలోని వయనాడ్​లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న వారిని.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత తలెత్తింది. నిరసకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని స్టేషన్​కు తరలించారు. చండీగఢ్​లో యూత్ కాంగ్రెస్ నేతలు రైల్​రోకో నిర్వహించారు. చండీగఢ్ రైల్వే స్టేషన్​లో ఉన్న న్యూదిల్లీ-చండీగఢ్ శతాబ్ది ట్రైన్​ను అడ్డగించారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు మౌన నిరసన చేశారు. రాష్ట్ర అసెంబ్లీ బయట బైఠాయించారు.

క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చిన గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు.. 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. అనర్హత వేటు తర్వాత ట్విటర్‌లో స్పందించిన రాహుల్‌గాంధీ.. దేశం వాణిని వినిపించేందుకు పోరాడుతున్నానని.. దానికోసం ఎంత మూల్యమైనా చెల్లించుకునేందుకు సిద్ధం ఉన్నానని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన గెలిచిన కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయింది.

Last Updated :Mar 25, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.