ETV Bharat / bharat

'OBCలను అవమానించారు'.. రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా

author img

By

Published : Mar 25, 2023, 11:54 AM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా వేశానన్నారు. ఈ దావా విచారణ నేపథ్యంలో రాహుల్​ ఈ ఏడాది ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు హాజరుకావాల్సి ఉందని ఆయన అన్నారు. మరోవైపు.. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Modi surname case Rahul Gandhi Patna court
Modi surname case Rahul Gandhi Patna court

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అనర్హత వేటుకు గురయ్యారు. అయితే, ఈ కేసు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మోదీ ఇంటిపేరును కించపరిచేలా రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు గానూ.. 2019లో సూరత్​ కోర్టులో గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. అలాగే అదే ఏడాది పట్నా కోర్టులో కూడా రాహుల్​పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రాహుల్ గాంధీ 2023 ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఈ దావాను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్​ కుమార్​ మోదీ వేశారు. రాహుల్​ అనర్హత వేటుపై స్పందించిన సుశీల్​​ కుమార్​ కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రాహుల్​ గాంధీ నిజం మాట్లాడినందుకు ఆయనపై వేటువేశారన్న కాంగ్రెస్​ నాయకుల వ్యాఖ్యలను సుశీల్​ కుమార్​ మోదీ తిప్పికొట్టారు. కోట్లాది మంది ఓబీసీలను రాహుల్​ అవమానించారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే​ కాంగ్రెస్​ నాయకులు ఈవీఎంలు ట్యాప్​ చేశారని ఆరోపిస్తారని అన్నారు. రాహుల్​ గాంధీ కోర్టు నిర్ణయాన్ని అంగీరించాలని హితవు పలికారు సుశీల్ మోదీ. దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. అవినీతిలో కూరుకుపోయినవారే.. దాని గురించి మాట్లాడుతున్నారని రాహుల్​, కాంగ్రెస్​ను ఉద్దేశించి విమర్శించారు.

రాహుల్​ గాంధీ కంటే ముందు.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వంటి ప్రముఖులు కూడా అనర్హత వేటుకు గురయ్యారు. ఇదేం కొత్తం విషయం కాదు. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. కాంగ్రెస్​ పార్టీయే నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో వెనుకబడిన కులాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చా?.. వారికి ఉన్నత స్థానాల్లో ఉండే హక్కు రాజ్యాంగం కల్పించలేదా?. ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం రాహుల్ అహంకారానికి పరాకాష్ఠ. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ.. ప్రధాని కావడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నాయి.

--సుశీల్​​ కుమార్ మోదీ, బీజేపీ రాజ్యసభ ఎంపీ

'అనర్హత వేటు'పై సుప్రీంలో పిటిషన్​..
దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌8(3)రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ కేరళకు చెందిన ఆభా మురళీధరన్ అనే పీహెచ్​డీ స్కాలర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. తక్షణ అనర్హత వేటు అనేది రాజ్యాంగ విరుద్ధమని.. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణంని ఉల్లంఘించడమే అని పిటిషనర్ పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన "ఆటోమేటిక్" అనర్హతపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం రాత్రి దాఖలు కాగా.. వచ్చే వారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ పరువునష్టం కేసులో దోషిగా తేలి 2 ఏళ్ల శిక్ష పడిన కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం దాఖలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళలోని వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్​ గాంధీని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం(24 మార్చి 2023) ప్రకటించింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు గానూ.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ కేసు నేపథ్యం..
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో జరిగిన సభలో మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ​. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్‌ మోదీని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీకి ముడిపెట్టారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో విచారణ జరిపిన కోర్టు రాహుల్​కు రెండేళ్ల శిక్ష విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.