Scorpio Hit And Run in Bangalore : కేసు విత్​డ్రాకు ఒప్పుకోలేదని కారుతో ఢీకొట్టి హత్య.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి..

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 3:40 PM IST

thumbnail

Scorpio Hit And Run in Bangalore Man Died : తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోలేదనే కోపంతో ఓ వ్యాపారిని స్కార్పియో కారుతో ఢీకొట్టి మరీ చంపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని పులికేశి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
సయ్యద్​ అస్గర్​.. నగరంలో సెకండ్​ హ్యాండ్​ కార్లను విక్రయిస్తుండేవాడు. ఎనిమిది నెలల క్రితం అమిన్​ అనే వ్యక్తికి రూ.4 లక్షల విలువైన రెండు కార్లను అమ్మాడు. అయితే ఈ డబ్బును చెల్లించేందుకు సయ్యద్​ను అమిన్​ కొంత గడువు అడిగాడు. గడువు ముగిసినా అమిన్​డబ్బులు చెల్లించకపోవడం వల్ల కొద్దిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు వ్యాపారి అస్గర్​. ఈ పంచాయితీలో.. అస్గర్​కు త్వరలోనే డబ్బును చెల్లిస్తానని అమిన్ అంగీకరించాడు. 

ఇలా ఒప్పుకున్న తర్వాత కొద్దిరోజులకు అమిన్​ తన సహచరులతో కలిసి అస్గర్​, అతడి స్నేహితుడు ముజాహిద్​పై బీర్​ బాటిల్​తో దాడి చేశాడు. దీంతో స్థానిక పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టాడు ముజాహిద్​. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సయ్యద్​ అస్గర్​పై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు అమిన్​. ఇందుకు అస్గర్​ ఒప్పుకోకపోవడం వల్ల అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్​ 18వ తేదీ రాత్రి అస్గర్​ను నగరంలోని SK గార్డెన్‌కు రమ్మని పిలిచాడు. ముజాహిద్​ అనే వ్యక్తితో కలిసి చెప్పిన ప్రదేశానికి అస్గర్​ వెళ్లాడు. అమిన్​ కూడా తన స్నేహితుడు నవాజ్​తో కలిసి స్కార్పియో కారులో అక్కడకు చేరుకున్నాడు. అక్కడ కూడా కేసును విత్​డ్రా చేసుకోవాలని మళ్లీ కోరారు. 

ఇందుకు అస్గర్​, ముజాహిద్​ ఇద్దరూ నో చెప్పి బైక్​పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడే నిలబడ్డ అస్గర్​పైకి ఒక్కసారిగా కారును పోనిచ్చారు అమిన్​, నవాజ్​. వారి నుంచి​ తప్పించుకునేందుకు సయ్యద్​ ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. అలా అస్గర్​ మరణించే దాకా అతడిని కారుతో ఢీ కొడుతూనే ముందుకు తీసుకెళ్లారు. చివరకు అస్గర్​ మృతిచెందాడని నిర్ధరించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఈ క్రమంలో ముజాహిద్​కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు నిందితులు. ముజాహిద్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పులికేశి నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు అమిన్​, నవాజ్​లపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.