ETV Bharat / sports

ధోనీ, యువీ, మిథాలీకి అరుదైన గౌరవం.. లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌తో MCC సత్కారం

author img

By

Published : Apr 5, 2023, 8:08 PM IST

మహేంద్ర సింగ్​ ధోనీ, యువరాజ్​ సింగ్​, సురేశ్​ రైనా, మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ వీరికి లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఇచ్చి సత్కరించింది.

Etv MS Dhoni, Yuvraj, Raina, Mithali, Goswami awarded MCC honourable lifetime membership.
MS Dhoni, Yuvraj, Raina, Mithali, Goswami awarded MCC honourable lifetime membership.

టీమ్​ఇండియా క్రికెట్​ జట్టు దిగ్గజాలు మహేంద్ర సింగ్​ ధోనీ, యువరాజ్​ సింగ్​, సురేశ్​ రైనాతో పాటు భారత మహిళా క్రికెట్‌ దిగ్గజాలు మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వీరికి లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్‌ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించింది. ఈ వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రెటరీ గుయ్‌ లావెండర్‌ నేడు(ఏప్రిల్‌ 5) అధికారికంగా ప్రకటించారు.

  • టీమ్​ఇండియా- మహేంద్ర సింగ్​ ధోనీ
  • టీమ్​ఇండియా- యువరాజ్​ సింగ్​
  • టీమ్​ఇండియా- సురేశ్​ రైనా
  • టీమ్​ఇండియా- మిథాలీ రాజ్​
  • టీమ్​ఇండియా- జులన్ గోస్వామి
  • వెస్టిండీస్​- మెరిస్సా అగ్యూలైరా
  • ఇంగ్లాండ్​- జెన్నీ గన్​
  • ఇంగ్లాండ్​- లారా మార్ష్​
  • ఇంగ్లాండ్​- ఇయాన్​ మోర్గాన్​
  • ఇంగ్లాండ్​- కెవిన్​ పీటర్సన్​
  • ఇంగ్లాండ్​- అన్యా శ్రుభ్​సోల్​
  • పాకిస్థాన్​​- మహ్మద్​ హఫీజ్​
  • ఆస్ట్రేలియా​- రేచల్​ హేన్స్​
  • బంగ్లాదేశ్​- ముష్రఫే మోర్తాజా
  • న్యూజిలాండ్- రాస్​టేలర్​
  • న్యూజిలాండ్- సాటరెత్​ వైట్​
  • సౌతాఫ్రికా- డేల్​ స్టెయిన్​

కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్‌ మెంబర్‌షిప్‌ అందుకున్న ధోనీ, యువరాజ్‌, రైనా భారత్‌ 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన జట్టులో సభ్యులు కాగా.. మిథాలీ రాజ్‌ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్‌ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంసీసీ చివరిసారిగా లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. అప్పుడు ఇంగ్లాండ్‌కు చెందిన అలిస్టర్‌ కుక్‌, సౌతాఫ్రికాకు చెందిన జాక్‌ కల్లిస్‌, భారత్‌కు చెందిన హర్భజన్‌ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది.

తాజాగా ఎంసీసీలో అరుదైన గౌరవం దక్కించుకున్న టీమ్​ఇండియా ప్లేయర్లు ఐదుగురు.. అన్ని ఫార్మాట్ల క్రికెట్​కు వీడ్కోలు పలికారు. కేవలం ధోనీ మాత్రమే ఐపీఎల్​లో ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు లీగ్​ చరిత్రలో మోస్ట్​ సెక్స్​స్​ఫుల్​ జట్టుగా పేరు సంపాదించిన చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

క్రికెట్‌లో చట్టాలను రూపొందించే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ గురించి ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. క్రికెట్ ఆడే ప్రతీ దేశంలో ఫ్రాంచైజీ లీగ్​లు పుట్టుకొస్తున్న వేళ వాటిని నియంత్రించాల్సిన అవసరముందని.. ఇదిలాగే కొనసాగితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఎంసీసీ తెలిపింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.